స్పోర్టింగ్‌‌‌‌ నేషన్‌‌‌‌గా ఇండియా : నీరజ్‌‌‌‌ చోప్రా

స్పోర్టింగ్‌‌‌‌ నేషన్‌‌‌‌గా ఇండియా  : నీరజ్‌‌‌‌ చోప్రా
  • ఆసియా గేమ్స్‌‌‌‌ ఫలితాలే అందుకు నిదర్శనం 
  • స్టార్ జావెలిన్‌‌‌‌ త్రోయర్‌‌‌‌‌‌‌‌  నీరజ్‌‌‌‌ చోప్రా

హైదరాబాద్, వెలుగు: ఇండియా అథ్లెట్లు ఇప్పుడు నిర్భయంగా, తమ  సత్తాపై  పూర్తి ఆత్మవిశ్వాసంతో  ప్రపంచంలోని అత్యుత్తమ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు  సిద్ధంగా ఉన్నారని  ఒలింపిక్, వరల్డ్, ఆసియా గేమ్స్ చాంపియన్‌‌‌‌, స్టార్ జావెలిన్‌‌‌‌ త్రోయర్‌‌‌‌‌‌‌‌ నీరజ్ చోప్రా అన్నాడు. ఇండియా స్పోర్టింగ్‌‌‌‌ నేషన్‌‌‌‌గా మారుతోందని,  ఇటీవల ముగిసిన ఆసియా గేమ్స్‌‌‌‌తో  ఆ విషయం స్పష్టమైందని చెప్పాడు. 'గత ఎడిషన్‌‌‌‌ ఆసియా గేమ్స్‌‌‌‌లో మనం 70  మెడల్స్‌‌‌‌ సాధిస్తే ఈసారి 107 పతకాలు అందుకున్నాం. ఇది చాలా పెద్ద ఇంప్రూవ్‌‌‌‌మెంట్. ఇది రాత్రికి రాత్రే జరగలేదు. 

మనం స్పోర్టింగ్‌‌‌‌ నేషన్‌‌‌‌గా ఎదుగుతున్నాం కాబట్టే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. అథ్లెటిక్స్ మాత్రమే కాదు చాలా ఈవెంట్లలో ఇండియన్స్‌‌‌‌ మెడల్స్ రాబట్టారు. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌‌‌‌ ముంగిట ఇది సానుకూల విషయం’ అని సోమవారం హైదరాబాద్‌‌‌‌లో అండర్ ఆర్మర్  స్టోర్‌‌‌‌ను ప్రారంభించిన నీరజ్‌‌‌‌ చోప్రా పేర్కొన్నాడు. జావెలిన్‌‌‌‌లో తాను 90 మీటర్ల మార్కును కచ్చితంగా అందుకుంటానని నీరజ్‌‌‌‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకు ఒక్కో అడుగు ముందుకు వేయాలన్నాడు.  

హైదరాబాద్‌‌‌‌ చాలా మారింది

2015లో  జూనియర్ ఫెడ్ కప్‌‌‌‌ మీట్‌‌‌‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌‌‌‌ వచ్చానని నీరజ్‌‌‌‌ తెలిపాడు. అప్పటితో పోలిస్తే సిటీ చాలా మారిందని, పెద్ద పెద్ద బిల్డింగ్స్‌‌‌‌తో చాలా డెవలప్‌‌‌‌ అయిందన్నాడు. ఏ గేమ్‌‌‌‌లోనైనా ఓపిక ఉంటేనే ఫలితాలు వస్తాయని యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌కు చోప్రా సలహా ఇచ్చాడు. ‘ఆటలో ఓర్పు చాలా  కీలకం. 

నేను అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనేందుకు మూడేళ్లు, పతకం సాధించేందుకు ఆరు నుంచి ఏడేళ్లు పట్టింది. కాబట్టి మనం ఓపికగా ఉండాలి. మన లక్ష్యానికి కట్టుబడి ఉండాలి. మీరు ఏ పని చేసినా వంద శాతం కష్టపడితేనే  ఫలితాలను సాధిస్తారు’ అని చెప్పుకొచ్చాడు.