జిల్లాల్లోనూ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు నిర్వహిస్తాం: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

జిల్లాల్లోనూ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు నిర్వహిస్తాం: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక విధానాల వల్లే హైదరాబాద్ నగరం నేషనల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్‌‌ ఈవెంట్లకు వేదికగా మారుతోందని  క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం (నవంబర్ 04) గచ్చిబౌలి స్టేడియంలో  తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్  బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు.

 ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీ సక్సెస్ అయిందని, భవిష్యత్తులో హైదరాబాద్‌‌కే పరిమితం కాకుండా తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ ఇంటర్నేషనల్  టోర్నమెంట్లు నిర్వహించేందుకు  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్జ్ చైర్మన్‌‌ శివసేనా రెడ్డి, 
నేషనల్ చీఫ్​ కోచ్‌‌ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు.

టీపీఎల్‌‌ పోస్టర్‌‌ ఆవిష్కరించిన మంత్రి  

తెలుగు ప్రీమియర్‌‌ లీగ్‌‌ (టీపీఎల్‌‌) క్రికెట్‌‌ టోర్నమెంట్ పోస్టర్‌‌ను క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. ‘సే నో టూ డ్రగ్స్‌‌’  ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న  టీపీఎల్‌‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. యువతను మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే శక్తి క్రీడలకు ఉందన్నారు. 

తెలంగాణ, ఏపీలో సుమారు 60 వేదికల్లో 600 టీమ్‌‌లతో ఈ పోటీలను నిర్వహిస్తున్న  జూపర్‌‌ ఎల్‌‌ఈడీ సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఫిట్‌‌నెస్‌‌, క్రీడలపై అవగాహన పెంచేందుకు తమ సీఎస్‌‌ఆర్ నిధులతో  లీగ్‌‌  ఏర్పాటు చేసినట్టు  సంస్థ డైరెక్టర్  ఒ.రమేష్‌‌ తెలిపారు. మొత్తం  రూ.80 లక్షల ప్రైజ్‌‌మనీ అందిస్తున్నట్టు వెల్లడించారు.