డబుల్ ఇండ్ల బుగులు.. లక్షల్లో లబ్ధిదారులు, వేలల్లో ఇండ్లు

డబుల్  ఇండ్ల బుగులు.. లక్షల్లో లబ్ధిదారులు,  వేలల్లో ఇండ్లు
  • మూడేండ్ల నుంచి ఖాళీగా ఉంచి ఇప్పుడు పంపిణీ
  • అనర్హులకు ఇస్తున్నరని ఆరోపణలు.. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌లో నిరసనలు
  • లాటరీ ప్రోగ్రామ్స్‌‌కు గైర్హాజరవుతున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: డబుల్ బెడ్రూమ్‌‌ ఇండ్ల పంపిణీ కార్యక్రమం.. అధికార బీఆర్ఎస్‌‌లో బుగులు పుట్టిస్తున్నది. లబ్ధిదారులు లక్షల్లో ఉండగా.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇండ్లు వేలల్లో మాత్రమే ఉన్నాయి. దీంతో ఇండ్లు రాని పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇవ్వకుండా అనర్హులకు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్థానికులకు కాకుండా వేరే చోటు నుంచి తీసుకొచ్చిన వారికి ఇండ్లను అందజేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు మూడేండ్ల కిందట నిర్మాణం పూర్తయిన ఇండ్లను.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంపిణీ చేస్తుండటం వివాదాస్పదమవుతున్నది. ఒక్క గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్ పరిధిలోనే 2022 వరకు 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 3 లక్షల మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. 

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక మొదటి నుంచి వివాదాస్పదమే. ఇండ్లు లేని వారు ఎంతో మంది ఉండగా.. అనర్హులకు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇండ్లను అందుకుంటున్న వారిలో ఎక్కువ మంది అధికార పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఉన్నారని జనం ఆరోపిస్తున్నారు. ఇండ్ల పంపిణీ విషయంలో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, దివ్యాంగులకు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయటం లేదని ఆరోపణలు ఉన్నాయి. 

రూరల్‌లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనారిటీలకు 7 శాతం, ఇతరులకు 43 శాతం ఇవ్వాలి. అర్బన్‌లో  ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనారిటీలకు 12 శాతం, ఇతరులకు 65 శాతం ఇవ్వాలని ప్రభుత్వం 2015లో జీవో ఇచ్చింది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద నిధులు ఇస్తున్నది. గ్రామాల్లో అయితే 70 వేలు,   అర్బన్ లో రూ.1.5 లక్షలు ఇస్తోంది. అయితే డబుల్ ఇళ్లపై పీఎం ఆవాస్ యోజన లోగోను చిన్నగా కనపడకుండా అధికారులు పెడుతున్నారు.

గ్రామ సభలు, వార్డు మీటింగ్​లు లేవు

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు ఊర్లలో గ్రామ సభ, అర్బన్ ఏరియాల్లో వార్డు సభ పెట్టి అప్లికేషన్లు తీసుకోవాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఇండ్లు లేని వారికి కేటాయించాలని స్పష్టం చేసింది. అయితే ఇందుకు విరుద్ధంగా లబ్ధిదారులకు ఇండ్లను ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్, జిల్లాల్లో ఇండ్ల పంపిణీతో లోకల్ బాడీ లీడర్లకు పెద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంపిణీ ఆపాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు చెబుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు పంపిణీ చేస్తే లాభం జరుగుతుందని భావించామని, అయితే ఇపుడు పంపిణీ వ్యవహారం మాకు పెద్ద ఇబ్బంది మారిందని వరంగల్ జిల్లాకు చెందిన మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఇటీవల మహేశ్వరం నియోజకవర్గంలో ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. తక్కువ ఇండ్లు పంపిణీ చేస్తుండటంతో.. జనం నుంచి వ్యతిరేకత వస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి చెందిన నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

హైదరాబాద్‌లో అప్లికేషన్ల తగ్గింపు?

హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసుకు 2021 ఫిబ్రవరి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం మొత్తం 2,84,000 అప్లికేషన్లు వచ్చాయని ఆర్టీఐ ద్వారా అధికారులు సమాచారం ఇచ్చారు. ఇటీవల కలెక్టర్ అనుదీప్ మాత్రం 1,53,000 అప్లికేషన్లు వచ్చాయని, ఇందులో 53 వేల మంది అర్హులని తేల్చామని చెప్పారు. ఇందులో రాండమ్ పద్ధతిలో లాటరీ తీశామని వెల్లడించారు. గ్రేటర్‌‌లో నియోజకవర్గానికి 500 మందిని చొప్పున ఇటీవల డ్రా తీసి పంపిణీ చేస్తున్నారు. ఇండ్లు వచ్చిన వారికి సెల్‌కు కనీసం మేసేజ్ కూడా రాలేదని చెబుతున్నారు. ఇక అప్లికేషన్ పెట్టుకున్న తమ పరిస్థితి ఏంటని కలెక్టరేట్లు, మీ సేవ కేంద్రాల్లో పేదలు ఆరా తీస్తున్నారు.

ఏపీలో ఫుల్ స్పీడ్‌గా ఇండ్ల నిర్మాణం

ఏపీలో శరవేగంగా ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇప్పటి వరకు ఏపీలో ఈ ఏడాది జులై నాటికి 4,22,355 ఇండ్లు పూర్తయినట్లు ఇటీవల పార్లమెంట్ లో కేంద్రం వెల్లడించింది. ఇందుకు తాము రూ.11,273.55 కోట్లు శాంక్షన్ చేశామని తెలిపింది. తెలంగాణ లో మాత్రం గ్రేటర్‌‌లో లక్ష ఇళ్లు, ఇతర జిల్లాల్లో లక్షా 92 వేల 057 ఇండ్లును శాంక్షన్ చేయగా, ఇందులో లక్షా 45 వేలు పూర్తి అయ్యాయి. మరో 50 వేల ఇండ్ల పనులు పూర్తి కాలేదు. గద్వాల, ములుగు, నారాయణపేట, ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కనీసం వెయ్యి చొప్పున కూడా పూర్తి కాలేదు.

సగానికి పైగా అనర్హులే

అర్హులను పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్లకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారు. నా నియోజకవర్గంలో 500 మందికి పంపిణీ చేయగా.. అందులో సగానికి పైగా లబ్ధిదారులకు సొంత ఇండ్లు ఉన్నాయి. నా నియోజకవర్గంలో 18 వేల మంది ఇండ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇళ్లు లేని పేదలకు కాకుండా అనర్హులకు ఎలా ఇస్తారు. దీనిపై సీఎం కేసీఆర్, అధికారులు సమాధానం చెప్పాలి. ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మించటంలో ప్రభుత్వం విఫలమైంది.

రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే

ఎన్నికల కోసమే ఇండ్ల పంపిణీ

ఎన్నికల కోసమే ఇండ్లను ఇప్పుడు ఇస్తు న్నరు. డబుల్ ఇండ్లపై ఇచ్చిన రిజర్వేషన్ల జీవో, లబ్ధిదారుల ఎంపికపై ఇచ్చిన జీవోను ప్రభుత్వమే ఫాలో కావటం లేదు. లబ్ధిదారు ల లిస్టును ఎందుకు బయట పెట్టడం లేదో సమాధానం చెప్పాలి. కలెక్టరేట్లకు వచ్చి లక్షల మంది అప్లికేషన్లు ఇచ్చారు. వాటిని వెరిఫికేషన్ చేశారో లేదో కూడా తెలియదు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో అయితే డస్ట్ బిన్ లో అప్లికేషన్లు పడేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శంగా జరగలేదు.

శ్రీనివాస్, సీపీఎం నేత