ఇండియన్లకు ఫ్రీ వీసా.. ఏడు దేశాలకు శ్రీలంక ఆఫర్

ఇండియన్లకు ఫ్రీ వీసా..  ఏడు దేశాలకు శ్రీలంక ఆఫర్

కొలంబో: టెర్రర్ దాడులు, కరోనా విలయం, రాజకీయ సంక్షోభంతో విలవిల్లాడిన శ్రీలంక.. మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటున్నది. తమకు ప్రధాన ఆదాయ వనరు అయిన టూరిజాన్ని మునుపటి స్థాయికి తీసుకెళ్లేందుకు లంక ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇండియా సహా మొత్తం ఏడు దేశాల టూరిస్టులకు ఉచితంగా వీసాలు జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన పాలసీని కేబినెట్ ఆమోదించినట్లు ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అలీ సబ్రీ మంగళవారం వెల్లడించారు. ఈ పైలట్ ప్రాజెక్టు తక్షణమే అమల్లోకి వస్తుందని, వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రకారం ఇండియా, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్​లాండ్‌‌ దేశాల పౌరులు శ్రీలంకలో పర్యటించేందుకు ఉచితంగా వీసాను పొందవచ్చు.  శ్రీలంకకు వచ్చే టూరిస్టుల్లో ఇండియన్లే ఎక్కువగా ఉంటారు. గత సెప్టెంబర్‌‌‌‌లో 30 వేల మంది అక్కడికి వెళ్లారు. మొత్తం టూరిస్టుల్లో ఇది 26 శాతం పైనే. ఇక రెండో స్థానంలో చైనా వాళ్లు ఉన్నారు. వాళ్లు 8 వేల మంది దాకా వెళ్లారు.