మహిళపై అఘాయిత్యం..లంక క్రికెటర్ అరెస్ట్

మహిళపై అఘాయిత్యం..లంక క్రికెటర్ అరెస్ట్

టీ20 వరల్డ్ కప్ 2022 ఆడటానికి వెళ్లిన శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక అరెస్ట్ అయ్యాడు.  మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో అతన్ని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డ్ కూడా నిర్ధారించింది. అటు గుణతిలకపై లంక బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. అన్ని ఫార్మాట్ల నుంచి అతని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

మహిళలపై అఘాయిత్యం..
టీ20 వరల్డ్ కప్ 2022లో కోసం ప్రకటించిన శ్రీలంక జట్టుకు ధనుష్క గుణతిలక ఎంపియ్యాడు. అయితే  గ్రూప్స్ దశ మ్యాచ్‌ ఆడుతూ గాయపడ్డాడు. హ్యామ్‌ స్ట్రింగ్ గాయం వల్ల అతను సూపర్ 12 మ్యాచ్‌లల్లో పాల్గొనలేదు. దీంతో లంక క్రికెట్ బోర్డు..గుణతిలక స్థానంలో మరో ప్లేయర్‌‌ను టీ20 వరల్డ్ కప్ కోసం పంపించింది. కానీ గుణతిలకను మాత్రం వెనక్కి రమ్మనలేదు. ప్రస్తుతం గుణతిలక జట్టుతో పాటే ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఇదే క్రమంలో  సిడ్నీ సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ పరిధిలోని ఓ హోటల్‌లో అతను బస చేస్తున్నాడు. ఈ సమయంలో  29 ఏళ్ల  మహిళపై అతను అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

సిడ్నీ పోలీస్ స్టేషన్కు గుణతిలక..
బాధిత మహిళ ధనుష్క గుణతిలకకు ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ లో పరిచయమైంది. ఈ నెల 2న న్యూ సౌత్ వేల్స్‌లోని ఓ హోటల్‌లో ఆమెను కలిశాడు. ఈ  సమయంలో  గుణతిలక తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలు న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన  పోలీసులు..ధనుష్క గుణతిలకను సస్సెక్స్‌ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని  సిడ్నీ సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గుణతిలకపై వేటు..
ధనుష్క గుణతిలక అరెస్ట్ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ధృవీకరించింది. అంతేకాదు అతనిపై వేటు కూడా వేసింది. గుణతిలకను అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేసింది.ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. గుణతిలక పేరును ఎలాంటి సెలెక్షన్స్‌కు కూడా పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని అన్ని స్థాయిల్లోని క్రికెట్ అసోసియేషన్లకు పంపిస్తామని పేర్కొంది. అఘాయిత్యం కేసులో గుణతిలక దోషిగా తేలితే అతనికి భారీ జరిమానా విధిస్తామని  శ్రీలంక క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది. 

బెయిల్కు నిరాకరణ
ఈ కేసులో  ధనుష్క గుణతిలకను పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపర్చారు.  సర్రీ హిల్స్ జైలు నుంచి డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో వీడియో లింక్ ద్వారా వర్చువల్ విధానంలో గుణతిలక విచారణకు హాజరయ్యాడు. అతని తరఫు న్యాయవాది ఆనంద అమర్‌నాథ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మెజిస్ట్రేట్ రాబర్ట్ విలియమ్స్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.