ఆణిముత్యాలు ఈ తెలుగుబిడ్డలు.. అక్క DSP, చెల్లి ఆర్మీ మేజర్

ఆణిముత్యాలు ఈ తెలుగుబిడ్డలు.. అక్క DSP, చెల్లి ఆర్మీ మేజర్

అంతరిక్షం వైపు అడుగులు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఆడపిల్లకు ఆటలొద్దు అనే సమాజం మనది. నలుగురిలో నవ్వొద్దంటారు, నలుగురితో కలవొద్దంటారు. తలెత్తి చూసినా తప్పే. ఇలాంటి ఆంక్షలు ప్రతి ఊరిలో కనిపించేవే. కానీ ఈ కథనంలో మనం చెప్పుకోబోయే ఆడపిల్లలు తల్లిదండ్రులు అలా కాదు. నేటి పరిస్థితులకు తగ్గట్టుగా వారి ఆలోచనలు మార్చుకున్నారు. తమ కూతుర్లకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు కావాల్సిన స్వేఛ్చను అందించారు. అదే ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ల భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. 

ఆంధ్రప్రదేశ్,కు చెందిన ఈ తెలుగింటి ఆణిముత్యాలైన ఇద్దరు అక్కా చెళ్లెల్లు(ప్రతిభ, ప్రదీప్తి) ఎన్నో సవాళ్లను, అవరోధాలను ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యాలను సాధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో ప్రదీప్తి డీఎస్పీగా ఎంపికైంది. ఆమె సోదరి ప్రతిభ ఆర్మీలో మేజర్ గా రాణిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని కొర్లకోట వీరిది. తండ్రి.. పేడాడ అప్పారావు, తల్లి.. సుగుణవేణి. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇద్దరూ చదువు చెప్పే గురువులకు కావడంతో.. పిల్లల చదువు విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 

వారు కూడా తల్లిదండ్రుల ఇచ్చిన స్వేచ్ఛను ఏనాడూ వమ్ముచేయలేదు. చదువులో రాణించి బీటెక్‌ పూర్తిచేశారు. ఇక తెలిసినవాళ్లంతా బాగా చదువుతారు కాబట్టి పెద్దగా శ్రమ ఉండని ఐటీ ఉద్యోగమో, బ్యాంకు ఉద్యోగమో ఎంచుకొమ్మని సలహా ఇచ్చారు. కానీ వారి ఆలోచనలు వేరు. ప్రదీప్తి పోలీస్‌ ఉద్యోగంలో చేరాలనుకుంటే.. ప్రతిభ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంది. యూనిఫాం ఉద్యోగాలు కావడంతో మొదట తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పినా.. తర్వాత వాళ్ల ఇష్టానికే వదిలేశారు. 

21 ఏళ్లకే భారత సైన్యంలోకి

ప్రతిభ.. 21 ఏళ్లకే భారత సైన్యంలో చేరింది. లెఫ్టినెంట్‌గా ఎంపికై శిక్షణ అనంతరం జమ్మూ కశ్మీర్‌, బారాముల్లా బెటాలియన్‌లో పనిచేసింది. ఆ తర్వాత కెప్టెన్‌గా, మేజర్‌గా పదోన్నతి సాధించి.. ఐక్యరాజ్యసమితి భద్రతా దళాల విభాగంలో పనిచేసే అవకాశం దక్కించుకుంది. త్వరలోనే ఆమె శాంతి స్థాపన కోసం మనం దేశం తరఫున విధులు నిర్వహించేందుకు సౌత్‌ సుడాన్‌ వెళ్లనుంది.

ఎస్‌ఐగా పనిచేస్తూనే డీఎస్పీగా

ప్రదీప్తి 2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్‌ 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎక్సైజ్‌ శాఖలో ఎస్‌ఐగా ఉద్యోగం సంపాదించింది. ఆ విధులు నిర్వహిస్తూనే మరోసారి పరీక్షలు రాసి.. తాజాగా విడుదలైన గ్రూప్‌-1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికైంది. ఇద్దరు పిల్లలు సాధించిన విజయాల గురుంచి సమాజం మాట్లాడుకుంటుంటే ఆ తల్లిదండ్రుల ఆనందం మాటల్లో వర్ణించేలేనిది. ఒకరు రాష్ట్రానికీ, మరొకరు దేశానికీ సేవలందిస్తునందుకు తల్లిదండ్రులుగా గర్వంగా ఉందని చెప్తున్నారు.