జమ్మూ కశ్మీర్ను నాశనం చేసింది వాళ్లే

జమ్మూ కశ్మీర్ను నాశనం చేసింది వాళ్లే
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్​చుగ్

శ్రీనగర్: ఏండ్ల తరబడి తమను దోచుకుంటూ, తప్పుదోవ పట్టిస్తున్న అబ్దుల్లా, ముఫ్తీల కుటుంబాలను జమ్మూ కాశ్మీర్​ప్రజలు వదులుకున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ ​చుగ్​అన్నారు. గత 70 ఏండ్లలో అబ్దుల్లాలు, ముఫ్తీలు జమ్మూకాశ్మీర్​ను నాశనం చేశారని, కాశ్మీర్​ప్రజలు వారిని ఎప్పటికీ అనుమతించబోరని ఆయన వెల్లడించారు. 
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య నేతృత్వంలో రెండు రోజుల తిరంగా యాత్రను చేపట్టారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్ లో తేజస్వి సూర్యతో కలిసి తరుణ్​చుగ్​తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు, ఇందులో 3000 మంది యువకులు, నేషనల్​ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టికల్​370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ర్యాలీ కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ముగియనుంది.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు గుర్తుగా 75 మీటర్ల పొడవైన భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

మెహబూబా చూడాల్సింది..

ఈ సందర్భంగా చుగ్​మాట్లాడుతూ..‘‘370 రద్దు తర్వాత కాశ్మీర్​లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వారు ఎవరూ ఉండరని మెహబూబా ముఫ్తీ గతంలో అన్నారు. ఇవాల ర్యాలీ సందర్భంగా లాల్ చౌక్‌కు వచ్చి ఎంత మంది యువకులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారో ఆమె చూడాలి’’ అని అన్నారు. లాల్​చౌక్​ వద్ద ఎవరినీ జాతీయ జెండా ఎగురినచ్చేవారు కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ కార్గిల్ వరకు సాగే ఈ కవాతు దేశ సమగ్రతకు ప్రతీక, భారత్ ఒక్కటే అనే భావానికి చిహ్నం అని అన్నారు.