శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు

శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు

శ్రీశైలం: భూకైలాసగిరి అయిన శ్రీశైల క్షేత్రంలో రేపు గురువారం నుండి ఆలయ దర్శన వేళలు మార్పు చేశారు. ఇప్పటి వరకు ఉదయం పూట 6 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. రేపు గురువారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.
 ఏపీ ప్రభుత్వం కర్యూ ఆంక్షలు సడలించిన నేపధ్యంలో భక్తుల కోసం శ్రీశైల దర్శన వేళల్లో మార్పు చేసినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. రాత్రి 8 వరకు భక్తులకు దర్శానాలకు ఆలయంలోకి అనుమతించడం జరుగుతుందని, రాత్రి 9 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేయడం జరుగుతుందని ఈవో వివరించారు. స్వామి అమ్మవారల ఆలయ ద్వారాలు తెరచినప్పటి నుంచి రాత్రి ఆలయ ద్వారాలు మూసేంత వరకు రోజువారిగా జరిగే ఆలయ కైంకర్యాలన్నీ యధావిధిగా జరుగుతాయని, అర్చక స్వాములు ఈ కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహిస్తారని దేవస్థానం ఈవో వివరించారు. 
ఆన్ లైన్ పరోక్ష సేవలు యధాతథం
ఆలయ దర్శన వేళలు మార్పు చేసినప్పటికీ ఆన్ లైన్ ద్వారా నిర్వహించే పరోక్ష సేవలు యధావిధిగా కొనసాగుతాయని దేవస్థానం ప్రకటించింది. అయితే దర్శనానికి నేరుగా వచ్చే భక్తులు మాత్రం తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలియజేసింది. మాస్కును విధిగా ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించడం.. శానిటైజ్ చేసుకోవడం, పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాల్సి ఉంటుందని శ్రీశైల ప్రభ సంపాదకుడు డాక్టర్ అనిల్ కుమార్ ప్రకటించారు.