V6 News

అడుగంటుతున్న ఎస్సారెస్పీ.. భారీగా పడిపోయిన నీటి నిల్వలు

అడుగంటుతున్న ఎస్సారెస్పీ.. భారీగా పడిపోయిన నీటి నిల్వలు

బాల్కొండ, వెలుగు: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్  ప్రాజెక్టు నీటి మట్టం అడుగంటుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులతో పోల్చితే 23.5 అడుగులు తక్కువగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 90.31 టీఎంసీలు కాగా, అధికారిక లెక్కల ప్రకారం 80.50 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1067.50 అడుగులు,19.38 టీఎంసీల నీరు ఉంది. 

గత ఏడాది ఇదే సమయానికి 1061 అడుగులు,11.54 టీఎంసీల నీరు ఉందని ఇరిగేషన్  ఆఫీసర్లు తెలిపారు. ఎగువ నుంచి ఇన్ ఫ్లో పూర్తిగా తగ్గడంతో గోదావరి వట్టిపోయింది.1077 క్యూసెక్కుల నీరు బయటికి వెళ్తోంది. కాకతీయ కెనాల్ కు 300 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 546 క్యూసెక్కులు అంటే 50 శాతం మేర ఆవిరి అవుతోంది. మిషన్  భగీరథ కోసం నిజామాబాద్, కామారెడ్డి  జిల్లాలకు108, ఆదిలాబాద్, నిర్మల్  జిల్లాలకు 63,కోరుట్ల, జగిత్యాల ప్రాంతానికి 61క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

తాగునీటికి ప్రాధాన్యం

ప్రస్తుతం ఉన్న నీటితో జూన్  మొదటి వారం వరకు నాలుగు ఉమ్మడి జిల్లాలకు తాగునీటికి ఢోకా లేదు. ఖరీఫ్  సాగుకు మాత్రం ఎగువన వర్షాలు కురవాల్సిందే. లక్ష్మీ, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలకు నీటి విడుదల నిలిపివేశారు. రోజుకు 0.1 టీఎంసీల నీరు బయటకు వెళ్తోంది. డెడ్  స్టోరేజీ దాటినా తాగునీటికి ఢోకా లేదని ఆఫీసర్లు చెబుతున్నారు.