నేడు (సెప్టెంబర్ 8న) ఎస్సారెస్పీ నీటి విడుదల

నేడు (సెప్టెంబర్ 8న) ఎస్సారెస్పీ నీటి విడుదల

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా రైతాంగానికి  నేటి నుంచి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయనున్నారు.  జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే  మందుల సామేల్ గేట్లను ఎత్తి నీటి విడుదల చేయడానికి తిరుమలగిరి డివిజన్ నీటిపారుదల శాఖ ఆదివారం ప్రణాళిక సిద్ధం చేశారు. నీటి విడుదల వారబందీ పద్ధతిలో కొనసాగుతుందా..? లేక ప్రతిరోజు జరుగుతుందా..? అనే అంశాన్ని మాత్రం ఆ శాఖ నిర్ణయించలేదు. ప్రస్తుతానికి మాత్రం ఒక వారం రోజుల పాటు సూర్యాపేట జిల్లాకు ప్రతిరోజు విడుదల చేయాలని  ఇరిగేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల అనంతరం దీనిపై పూర్తి స్థాయ షెడ్యూల్ రూపొందిస్తారు. 

మైలారం నుంచి బయన్నవాగులోకి నీటి విడుదల

కాకతీయ కాలువ నుంచి వస్తున్న నీటితో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండిపోయింది. దీంతో అక్కడి అధికారులు గేట్లను ఆదివారం మధ్యాహ్నం ఎత్తి బయన్నవారు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వైపు వదిలారు. సోమవారం ఉదయం నాటికి బయన్నవాగుకు భారీగానే నీళ్లు చేరుతాయని తిరుమలగిరి డివిజన్ నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. భాగంగానే సూర్యాపేట జిల్లాకు నీటి విడుదల చేయాలని భావించినేడు నీటిని విడుదల చేయనున్నారు. సూర్యాపేట జిల్లాకు మొదట 500 క్యూసెక్కులు విడుదల చేసి సామర్ధ్యాన్ని క్రమక్రమంగా పెంచుతామని ఆ శాఖ ఈఈ సత్యనారాయణ తెలిపారు.