జనగామ టౌన్‭లో ఆగిపోయిన అభివృద్ధి పనులు

జనగామ టౌన్‭లో ఆగిపోయిన అభివృద్ధి పనులు

పనులు చేయకుంటే మీటింగులెందుకు?
జనగామ టౌన్​లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నయ్: కౌన్సిలర్లు
ఆఫీసర్లు సమాధానం చెప్తలేరు
వాడీవేడీగా మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్

జనగామ, వెలుగు: ‘ఆమోదించిన పనులు మొదలైతలేవు. ప్రారంభించిన పనులు కంప్లీట్ అయితలేవు. జనరల్ బాడీ మీటింగ్​లలో ఎన్నిసార్లు మొత్తుకున్నా ఇదే పరిస్థితి. ఆఫీసర్లను ప్రశ్నిస్తే సమాధానం చెప్తలేరు. ఇక మీటింగులెందుకు?’ అంటూ జనగామ కౌన్సిలర్లు మండిపడ్డారు. మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్​పోకల జమున లింగయ్య అధ్యక్షతన జనరల్  బాడీ మీటింగ్ జరిగింది. అడిషనల్​కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆఫీసర్లు, కౌన్సిలర్లు హాజరయ్యారు. వార్డుల్లోని సమస్యలను ఏకరువు పెట్టారు. 17వ వార్డు కౌన్సిలర్ జక్కుల అనిత వేణుమాధవ్ మాట్లాడుతూ.. గత రెండేండ్ల నుంచి కరెంట్ పోల్స్​సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా.. నేటికీ పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ ఆడిటింగ్ ఎప్పుడని అడిగి రెండు నెలలు అవుతున్నా.. ఖాతరు చేయడం లేదన్నారు.

నిధుల సమీకరణకు చర్యలేవి?

బీజేపీ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు సమీకరించుకోవడంలో పాలకవర్గం ఫెయిల్ అయిందన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, ఎంపీల నుంచి రావాల్సిన ఫండ్స్ గురించి ఒక్కరు కూడా అడగడం లేదన్నారు. ట్రేడ్ లైసెన్స్ విషయంలో వ్యాపారులకు వెసులుబాటు కల్పించాలన్నారు. వార్డులో మంజూరైన పనులు.. నెలలు దాటినా ప్రారంభించడం లేదన్నారు. కౌన్సిలర్లు చందర్,  మల్లేశ్ సైతం పనులు మొదలుపెట్టకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు పాండు, బండ పద్మ మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డును ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బొట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పట్టణంలో కోతులు,  కుక్కలు, పందుల బెడద విపరీతంగా ఉందని, వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ మీటింగ్​లో 18 ఎజెండా అంశాలతో పాటు మూడు టేబుల్ ఎజెండా అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.

పరిష్కారానికి చర్యలు..

మున్సిపల్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అడిషనల్​ కలెక్టర్ ప్రపుల్​ దేశాయ్​ అన్నారు. సభ్యులు సైతం వార్డుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. కౌన్సిలర్లు మీటింగ్ కు తప్పనిసరిగా హాజరై చివరి వరకు ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రజిత, డీఈఈ చంద్రమౌళి,  వైస్ చైర్మన్ రాం ప్రసాద్,  కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

శానిటేషన్ వర్కర్లకు సత్కారం

జనగామ అర్బన్, వెలుగు: స్వచ్ఛ సర్వేక్షణ్–2022​లో భాగంగా జనగామ పట్టణానికి అవార్డు రావడం పట్ల మున్సిపల్ పాలకవర్గం, ఆఫీసర్లు హర్షం వ్యక్తం చేశారు. జనరల్ బాడీ మీటింగ్​లో స్వచ్ఛతకు కృషి చేసిన మున్సిపల్ శానిటేషన్ కార్మికులను ఘనంగా సత్కరించారు. కేంద్రం నిర్వహించిన సర్వేలో 50వేల నుంచి లక్ష వరకు జనాభా గల కేటగిరీలో పట్టణం మూడో స్థానంలో నిలిచిందని మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున తెలిపారు. అడిషనల్​కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, కమిషనర్ రజిత, వైస్  చైర్మన్  మేకల రాంప్రసాద్ తదితరులు సిబ్బందికి అభినందనలు తెలిపారు.