ఉచిత రేషన్ ​కోసం పాక్​లో తొక్కిసలాట.. ముగ్గురు చిన్నారులు సహా 12 మంది మృతి

ఉచిత రేషన్ ​కోసం  పాక్​లో తొక్కిసలాట.. ముగ్గురు చిన్నారులు సహా 12 మంది మృతి
  •     ఇరుకు సందులో పంపిణీ చేయడమే కారణం
  •     ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసిన అధికారులు

కరాచీ: ఆహార సంక్షోభంతో సతమతం అవుతున్న  పాక్​లో దారుణం చోటుచేసుకుంది. రంజాన్​ సందర్భంగా కరాచీలోని  ఒక ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఉచిత రేషన్​, క్యాష్​ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. రేషన్ తీసుకునేందుకు జనం ఎగబడడంతో తొక్కిసలాట జరిగి 12 మంది చనిపోయారు. శుక్రవారం సాయంత్రం పొద్దుపోయాక ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో 8 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు, ఒక పురుషుడు ఉన్నారు. మరికొందరికి గాయాలు కావడంతో ఆస్పత్రుల్లో  చేర్పించారు. 

ఫ్యాక్టరీ మేనేజర్​ సహా మొత్తం 8 మందిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జకాత్​ డబ్బులు, ఉచిత రేషన్​ పంపిణీపై ముందే సమాచారమిస్తే తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసి ఉండే వాళ్లమని పోలీసులు చెప్పారు.  ‘‘ఒక ఇరుకైన సందులో ప్రజలను క్యూ లైన్​లో నిలబెట్టి రేషన్ పంపిణీ చేశారు. వెనుక నిలబడిన వాళ్లు ఒక్కసారిగా బలంగా తోయడంతో.. ముందు వరుసలో ఉన్న మహిళలు, పిల్లలు కుప్పకూలిపోయారు. తర్వాత చాలామంది రేషన్ కౌంటర్​ వద్దకు పరుగెత్తుకు వచ్చారు. 

ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగింది” అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని సింధ్​ ప్రావిన్స్ సీఎం మురాద్​ అలీ షా ప్రకటించారు. గాయపడిన వారికి చెరో రూ.లక్ష చొప్పున సహాయం చేస్తామన్నారు.  రంజాన్​ ఉపవాసాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు పాక్​లో జకాత్, ప్రభుత్వ ఉచిత రేషన్ పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటల్లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 

గంటలకొద్దీ క్యూలో నిలబడి..

రంజాన్​ మాసం మొదలైన తర్వాత పాక్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా గోధుమ పిండిని పంపిణీ చేస్తోంది. ఈ కేంద్రాలకు వచ్చే ప్రజలు గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది. గంటల తరబడి నిలుచున్నా ఒక్కోసారి ఖాళీ చేతులతోనే వెనుదిరగాల్సి వస్తోంది. దీంతో క్యూలో ఉన్నవారు త్వరగా గోధుమలు తీసుకోవాలనే తాపత్రయంతో ఒకరినొకరు తోసుకుంటున్నారు. ఇది తొక్కిసలాటకు దారితీస్తోంది.

ఆర్థిక సంక్షోభంతో ద్రవ్యోల్బణం పైపైకి..

పాక్​లో వారాంతపు ద్రవ్యోల్బణం (వీక్లీ ఇన్ ఫ్లేషన్) 45 శాతానికి ఎగబాకింది. 1947లో పాక్​ ఏర్పడిన తర్వాత ద్రవ్యోల్బణం ఇంతలా పెరగడం ఇదే తొలిసారి.  మార్చి నెలలో పాక్​ లో ద్రవ్యోల్బణం 35.4 శాతానికి చేరింది.  పాక్ హైపర్​ ఇన్​ ఫ్లేషన్​ దిశగా పోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లీటర్​ పెట్రోలు రూ.272

ఇప్పుడు పాక్​లో లీటర్​ పెట్రోలు ధర రూ.272, లీటర్​ డీజిల్​ ధర రూ.293, లీటర్​ కిరోసిన్​ ధర రూ. 181  వద్ద ఉన్నాయి.  నిత్యావసరాల ధరలు కూడా చుక్కలనంటాయి. కిలో నిమ్మకాయలు రూ.800కు, కిలో ఎల్లిగడ్డ రూ.640కు, డజను అరటిపండ్లు రూ.250కు, కిలో టమాట రూ.120కు,  కిలో  బీరకాయ రూ.140, కిలో ఖర్బూజా రూ.250, కిలో స్ట్రాబెర్రీ రూ.600కు చేరాయి.

పాక్​ ప్రజలు బాధపడుతున్నరు: మోహన్ భాగవత్​

న్యూఢిల్లీ: ఇండియా నుంచి విడిపోయిన 7 దశాబ్దాల తర్వాత పాక్​ ప్రజల్లో బాధ కనిపిస్తోందని ఆర్ఎస్ఎస్​ చీఫ్ మోహన్​ భాగవత్​ వ్యాఖ్యానించారు. దేశ విభజన తప్పిదమని ఇప్పుడు  భావిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘పాక్​ నుంచి ఇండియాకు వచ్చేసిన వాళ్లంతా హ్యాపీగా ఉన్నరు.. రానోళ్లు బాధల్లో ఉన్నరు” అని అన్నారు. హేము కలానీ జయంతి ఉత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి సింధీ సామాజికవర్గం ప్రజలు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో భాగవత్​ మాట్లాడుతూ..‘‘ఆనాడు ఇండియా వదిలి వెళ్లిపోయిన వారు హ్యాపీగా ఉన్నారా?” అని ప్రశ్నించారు. ‘అఖండ భారత్​’  అన్నది నిజం.. కానీ ‘విభజిత భారత్’​ అనేది ఒక పీడకల అన్నారు. ‘‘విదేశాలపై దాడులకు పాల్పడే కల్చర్​తో ఇండియాకు సంబంధంలేదు. అయితే ప్రతిఘటించే కల్చర్​ భారత్​కు ఉంది. అందుకే సర్జికల్​ స్ట్రైక్​ చేసొచ్చాం”అని మోహన్​ భాగవత్​ స్పష్టం చేశారు.