ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: భైంసా మండలం గుండెగాం గ్రామానికి చెందిన సూర్యవంశీ స్థానిక గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్​కు అందజేసిన అంబులెన్స్​ను సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి ప్రారంభించారు. అత్యవసర టైంలో రోగులు, క్షతగాత్రులను భైంసా నుంచి నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, నాందేడ్ తదితర పట్టణాలకు తరలించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చందు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కాశీనాథ్, డాక్టర్​వర్ష జాదవ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎనుపోతుల మల్లేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూషణ్, కౌన్సిలర్​గౌతం పింగ్లే, సాహెబ్​రావు, నాగనాథ్, మారుతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

రెండేళ్లుగా కేసీఆర్​ కిట్​ అందట్లే

కాగజ్ నగర్, వెలుగు: కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం కాగజ్​నగర్, కౌటాల, సిర్పూర్​(టి) మండలాల్లోని పలు ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. కౌటాల మండలం గుండాయి పేట హెల్త్​సెంటర్​లో సభ్యులు డాక్టర్ రాజేశ్ రంజన్, ఇషా శర్మ, హరి కృష్ణ తనిఖీ చేశారు. టీబీ, ఎయిడ్స్, ఆంత్రాక్స్, డెంగీ ఇతర వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. ఏఎన్ ఎం రికార్డులు సరిగ్గా నిర్వహించకపోవడం, వేరే వ్యక్తులు రిజిస్టర్​ రాయడం తదితరాలు గుర్తించారు. కేసీఆర్​  కిట్ అందడంలేదని ఏఎన్ఎం సునీత ఆఫీసర్లకు తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అడిషనల్ డెరైక్టర్ (ఎన్ డీ) డాక్టర్  పుష్ప, జిల్లా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ధరమ్ సింగ్, వైద్యులు ప్రేమ్ సాగర్, పల్లవి ఉన్నారు.

పేద కుటుంబాలకు ‘కాకా’ ఫౌండేషన్ చేయూత

నస్పూర్, వెలుగు: ‘కాకా’ ఫౌండేషన్​ఆధ్వర్యంలో సోమవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులోని కృష్ణకాలనీలోని నాలుగు పేద కుటుంబాలకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా వివేక్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బరపటి మారుతి మాట్లాడారు. పేదలకు ‘కాకా’ ఫౌండేషన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నస్పూర్ పట్టణ ఉపాధ్యక్షుడు జంగపెల్లి మహేశ్, బీజేవైఎం జనరల్ సెక్రటరీ అంబాల సాగర్, బీసీ మోర్చా జనరల్ సెక్రటరీ కొంతం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. సోమవారం స్థానిక ఎస్సీ స్టడీ సర్కిల్​లోని విద్యార్థులకు బ్లాంకెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్​సీడబ్ల్యూవో సునీత,  బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ లీడర్​చంద్రయ్య, సిబ్బంది జితేందర్, శైలజ, అశోక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అండగా సర్కారు

భైంసా,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన భైంసా కాటన్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. రైతుబంధు, రైతు బీమాతో ఆత్మహత్యలు తగ్గాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్​పిప్పెర కృష్ణ, వైస్​చైర్మన్​ఆసీఫ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ గంగాచరణ్, లీడర్లు మురళీగౌడ్, తోట రాము తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్ నాయక్ చెప్పారు. సోమవారం తన చాంబర్​లో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్, ప్లానింగ్​ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. బస్తీ దవాఖానాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. హరితహారంలో లక్ష్యాలను సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు – మన బడిలో ఎంపికైన స్కూళ్లలో పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. భావితరాలకు ఉపయోగపడే విధంగా టౌన్​ మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. మండలాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని మండల స్పెషల్​ ఆఫీసర్లు, ఎంపీడీవోలతో జరిగిన గూగుల్ మీట్​లో ఆదేశించారు. ఎంపీడీవోలు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆఫీసులో అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి తీసుకున్న చర్యలపై ప్రతివారం రివ్యూ చేయాలన్నారు.  

అవినీతి ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి

ఆసిఫాబాద్,వెలుగు: అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్​చేశారు. సోమవారం స్థానిక డీఐఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో చాపలె సాయికృష్ణ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్​ టేబుల్​సమావేశంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీడీఎస్ యూ, కేవీపీఎస్, ఏఐటీయూసీ, సీపీఐ, సీపీఎం, టీఎంఆర్పీఎస్ ​లీడర్లు మాట్లాడారు. ఎలాంటి నోటిఫికేషన్​ఇవ్వకుండా మైనార్టీ గురుకులాల్లో ఉద్యగ నియామకాలు చేస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్ యార్డ్ లో జరిగిన అవినీతి జరిగిందన్నారు. ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా చేపట్టాల్సిన ఔట్​సోర్సింగ్​కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఏజెన్సీలతో కుమ్మక్కు అయ్యారన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు, ఆర్టీసీ కార్మికులపై వేధింపులు పెరిగాయన్నారు. అవినీతి ఆఫీసర్లపై సిట్టింగ్​జడ్జితో ఎంక్వైరీ చేయించాలన్నారు. అవినీతి జరుగుతున్నా... చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న కలెక్టర్​ను వెంటనే బదిలీ చేయాలని, డీఎంఎఫ్ టీ నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​చేశారు. సమావేశంలో సీపీఐ లీడర్లు పిడుగు శంకర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, కేవీపీఎస్​జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, ఎమ్మార్పీఎస్​లీడర్​బొమ్మెన ధర్మయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి,  ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

ఎత్తిపోతలపై నిర్లక్ష్యం చేస్తున్రు

భైంసా/ముథోల్,వెలుగు: అష్టా ఎత్తిపోతల పథకంపై సర్కారు నిర్లక్ష్యం వీడాలని టీజేఎస్ నియోజకవర్గ ఇన్​చార్జి సర్దార్ వినోద్​కుమార్​కోరారు. సోమవారం రైతులతో కలిసి ఆయన ముథోల్​ మండలంలోని అష్టా ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. రూ. ఐదు కోట్లతో నిర్మించిన ఈ పథకం గుంట భూమికి సాగునీరు అందించలేదన్నారు. రిపేర్​ చేయిస్తానన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఇంతవరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రబీ సీజన్​ప్రారంభమైందని.. ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకురాకపోతే రెండు వేల ఎకరాలు బీడుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఆయన వెంట రైతులు బొంత రాజు, పొశెట్టి, మురళీ, గంగాధర్​ ఉన్నారు.

మునుగోడులో బీజేపీదే విజయం

నిర్మల్,వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో  బీజేపీదే నైతిక విజయమని, ఇక అసలు ఆట మొదలైందని ఆ పార్టీ పెద్దపల్లి ఇన్​చార్జి రావుల రాంనాథ్  పేర్కొన్నారు. సోమవారం పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ డబ్బులు, అధికార బలంతో గెలిచిందన్నారు. ప్రజలు బీజేపీవైపే ఉన్నారని బై ఎలక్షన్​ ద్వారా తేలిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడును చుట్టిముట్టి ఓటర్లను ప్రలోభాలు, భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. జిల్లా మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టిన సర్వేల్ లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. సమావేశంలో పార్టీ టౌన్  ప్రెసిడెంట్ సాధం అర్వింద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిశెల అర్జున్, అల్లం భాస్కర్, కోడె దేవేందర్, తోట సత్యనారాయణ, రచ్చ మల్లేశ్​ పాల్గొన్నారు.

పార్కింగ్ కాంప్లెక్స్​ నిర్మించాలి

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్​లోని గణేశ్​ థియేటర్​ స్థలంలో పార్కింగ్​ కాంప్లెక్స్ నిర్మించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్​ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ లీడర్లతో కలిసి అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్​బా బాషా షేక్​కు వినతి పత్రం అందజేశారు. అవసరం లేకున్నా.. ఇరుకైన వీధుల్లో ఎనిమిది ఫీట్ల వెడల్పుతో డివైడర్లు నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీజు ముగియడంతో గణేశ్​ థియేటర్​కూల్చివేసి, ఆ స్థలాన్ని మరొకరికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అవగాహన లేని వ్యక్తిని కేవలం ఎమ్మెల్యే కొడుకు అన్న కారణంగా మున్సిపల్​చైర్మన్​ను చేశారని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్​రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి వకులాభరణం వేద వ్యాస్, లీడర్లు ఆకుల ప్రవీణ్, దినేశ్ మాటోలియా, జోగు రవి, సోమ రవి తదితరులు పాల్గొన్నారు.