అంతరిక్ష రంగంలోనూ స్టార్టప్​ల అడుగు

అంతరిక్ష రంగంలోనూ  స్టార్టప్​ల అడుగు

న్యూఢిల్లీ: భూమిపైనే కాదు ఆకాశంలోనూ తమ సత్తా చాటడానికి స్టార్టప్​లు రెడీ అవుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు పోటీగా రాకెట్లు తయారు చేస్తున్నాయి. ఇస్రో శుక్రవారం చెన్నైకి 115 కిలోమీటర్ల దూరంలోని శ్రీహరికోటలోని అంతరిక్ష నౌకాశ్రయం నుంచి విక్రమ్- ఎస్‌‌‌‌ను ప్రయోగించింది. భారతదేశ అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్‌‌కు నివాళిగా రాకెట్​కు ఈ పేరు పెట్టారు. ఈ ప్రయత్నం ఇస్రో గుత్తాధిపత్యానికి ముగింపు పలికి అంతరిక్ష పోటీలో ప్రైవేట్ రంగం ప్రవేశానికి సూచన అని చెప్పుకోవచ్చు.  ఈ మిషన్‌‌కు 'ప్రారంభ్' (ప్రారంభం) అని పేరు పెట్టారు. విక్రమ్- ఎస్‌‌ను నాలుగేళ్ల స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసింది. ప్రైవేట్​కంపెనీలకు స్పేస్ సెగ్మెంట్​లో 2020 నుంచి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం, 80శాతం పోలార్​ శాటిలైట్​ లాంచ్​ వెహికల్స్​ ఇస్రో లేదా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌‌మెంట్ ఆర్గనైజేషన్  తయారీ కార్యక్రమాల క్రింద స్థానికంగా తయారవుతున్నాయి. 

1 స్కైరూట్ ఏరోస్పేస్  భారీ నిధులతో కూడిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్. దీనిని జూన్ 2018లో ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ దాకా స్థాపించారు.
2 స్కైరూట్ ఏరోస్పేస్​ ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో సిరీస్ -బీ ఫైనాన్సింగ్ రౌండ్ ద్వారా 51 మిలియన్ డాలర్లను సేకరించింది. గతేడాది జూలైలో సిరీస్ -ఎలో 11 మిలియన్ డాలర్లను సేకరించింది.
3 స్కైరూట్ భారతదేశంలోనే  మొట్టమొదటి   క్రయోజెనిక్, హైపర్‌‌ గోలిక్- లిక్విడ్, సాలిడ్​ ఫ్యూయల్​ రాకెట్​ ఇంజన్లను లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగించి నిర్మించింది. విజయవంతంగా పరీక్షించింది.
4  దీనికి సింగపూర్ జీఐసీ, గ్రీన్​కోఫౌండర్లు అనిల్ కుమార్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ఆర్థికంగా మద్దతు ఇచ్చారు.  మింత్రా, కల్ట్​ఫిట్​ ఫౌండర్ ముఖేష్ బన్సల్,​ ఆదిత్య మిట్టల్ ఫ్యామిలీ ట్రస్టు,  సోలార్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు కూడా ఉన్నాయి.
5 ఇస్రోతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తొలి స్టార్టప్ ఇదే. స్కైరూట్ దాని బలమైన ఎకోసిస్టమ్​, టెక్నాలజీల ద్వారా  ప్రయోగ ఖర్చులను ప్రముఖ గ్లోబల్ కంపెనీలతో పోలిస్తే 50శాతం తగ్గించింది.
6 విక్రమ్- ఎస్​ను​ అభివృద్ధి చేయడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది.  కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్స్,  3డీ -ప్రింటెడ్ కాంపోనెంట్స్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి దీనిని నిర్మించారు.
7 భారతదేశపు మొట్టమొదటి కార్బన్- ఫైబర్ -బిల్ట్​ సాలిడ్​ ఫ్యూయర్​ఇంజిన్‌‌.. విక్రమ్- ఎస్. దీనిని నవంబర్ 15న ప్రయోగించాల్సి ఉంది, అయితే చివరకు నవంబర్ 18న స్పేస్ రెగ్యులేటర్ ఐఎన్ ​-స్పేస్​ ద్వారా ప్రయోగానికి అనుమతి లభించింది.
8 విక్రమ్-ఎస్ 81 కి.మీ ఎత్తుకు ఎగిరి ఐదు నిమిషాల కంటే తక్కువ కాలంలో స్ప్లాష్ డౌన్​ అవుతుంది. విక్రమ్-ఎస్ రాకెట్ విక్రమ్-1 రాకెట్​కు చిన్న వెర్షన్ అని చందన తెలిపారు. మునుపటిది సింగిల్-స్టేజ్ రాకెట్ అయితే రెండోది మల్టీ స్టేజ్​ వెహికల్.
9 విక్రమ్- ఎస్​లో దాదాపు అన్ని సిస్టమ్‌‌లను సొంతగానే డిజైన్​ చేశామని, కొన్ని సెన్సర్‌‌లను మాత్రమే దిగుమతి చేసుకున్నామని చందన చెప్పారు. 
10   గ్లోబల్​స్పేస్​ మార్కెట్లో ప్రస్తుతం మన వాటా రెండు శాతానికి మించడదు. అయితే సంస్కరణల వల్ల అంతరిక్ష కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఇండియా స్పేస్​ ఇండస్ట్రీ విలువ 2019లో ఏడు బిలియన్​ డాలర్లు కాగా, 2024 నాటికి ఇది 50 బిలియన్​ డాలర్లకు చేరుతుందని అంచనా.