పాత తరం కంపెనీలను మించుతున్న స్టార్టప్‌‌లు

పాత తరం కంపెనీలను మించుతున్న స్టార్టప్‌‌లు
  • బీపీసీఎల్‌‌, కోల్ ఇండియా కంటే నైకా మార్కెట్ క్యాప్ ఎక్కువ
  • కొన్ని పెద్ద బ్యాంకులను వెనక్కి నెట్టిన పేటీఎం

బిజినెస్‌‌‌‌ డెస్క్, వెలుగు: 
జొమాటో, నైకా, పేటీఎం, పాలసీబజార్‌‌‌‌‌‌‌‌ వంటి యూనికార్న్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లు ఐపీఓ ద్వారా పెద్ద మొత్తంలో ఫండ్స్‌‌‌‌ను సేకరించగలుగుతున్నాయి. ప్రైమరీ మార్కెట్‌‌‌‌ ద్వారా ఏకంగా రూ. 5,300 కోట్ల నుంచి రూ. 18,300 కోట్ల ఫండ్స్‌‌‌‌ను  ఈ కంపెనీలు సేకరించగలిగాయి. ఇండియన్ ఇంటర్నెట్ కంపెనీల వాల్యుయేషన్, ఎప్పటి నుంచో మార్కెట్‌‌‌‌లో ఉన్న కంపెనీల వాల్యుయేషన్‌‌‌‌ను దాటేస్తుండడం గమనించాలి. మార్కెట్‌‌‌‌లో లిస్ట్ అయిన హాస్పిటాలిటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని 52 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 70 వేల కోట్లు. ఒక్క జొమాటో మార్కెట్ క్యాప్ రూ. 1.2 లక్షల కోట్లకు పైనే ఉంది. నైకా మార్కెట్ క్యాప్ ఎస్‌‌‌‌బీఐ కార్డ్స్‌‌‌‌, హిందాల్కో, గోద్రేజ్‌‌‌‌ కన్జూమర్‌‌‌‌‌‌‌‌, బీపీసీఎల్, కోల్ ఇండియా వంటి పెద్ద కంపెనీల మార్కెట్ క్యాప్‌‌‌‌ను క్రాస్‌ చేసింది. పేటీఎం ఐపీఓ వాల్యుయేషన్‌‌‌‌ ఐడీబీఐ బ్యాంక్‌‌‌‌, ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్‌‌‌‌, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకుల మార్కెట్ క్యాప్‌‌‌‌ కంటే ఎక్కువ.    ఇన్ఫోసిస్‌‌‌‌ 1993 లో మార్కెట్‌‌‌‌లో లిస్ట్ అవ్వగా, ఈ కంపెనీ వాల్యుయేషన్ రూ. లక్ష కోట్లను క్రాస్ చేయడానికి 13 ఏళ్లు పట్టింది. అదే జొమాటో, నైకా కంపెనీలు లిస్టింగ్ అయిన రోజే రూ. లక్ష కోట్ల మార్కెట్‌‌‌‌ను క్రాస్ చేశాయి. ఈజ్‌‌‌‌ మై ట్రిప్‌‌‌‌ ప్లానర్స్‌‌‌‌, జొమాటో, కార్‌‌‌‌‌‌‌‌ట్రేడ్‌‌‌‌, నైకా, పాలసీబజార్‌‌‌‌‌‌‌‌, పేటీఎం వంటి అర డజను స్టార్టప్ కంపెనీలు ఇప్పటి వరకు ఐపీఓకు వచ్చాయి. ఈ కంపెనీల వలన బీఎస్‌‌‌‌ఈ మార్కెట్ క్యాప్‌‌‌‌ ఏకంగా రూ. 4.37 లక్షల కోట్లు పెరిగింది. ఐటీ కంపెనీలు లిస్ట్ అయినప్పుడు ఎలా స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో రివల్యూషన్‌‌‌‌ స్టార్టయ్యిందో, ఇప్పుడు కూడా అలానే కొత్త తరం కంపెనీల వలన రివల్యూషన్‌‌‌‌ స్టార్టయ్యిందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. 

మార్కెట్‌‌‌‌ను మారుస్తున్నాయి..

ప్రస్తుతం బీఎస్‌‌‌‌ఈ మార్కెట్‌‌‌‌ క్యాప్‌లో  కొత్త తరం కంపెనీల వాటా 1 శాతంగా ఉంది. అదే  యూఎస్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో ఇటువంటి కంపెనీల మార్కెట్ క్యాప్ వాటా 25 శాతంగా, చైనాలో 15 శాతంగా ఉంది. మన దగ్గర కూడా కొత్తతరం ఇంటర్నెట్ కంపెనీలు లిస్ట్ అయ్యే కొద్దీ మార్కెట్ క్యాప్‌‌‌‌  మరింత పెరుగుతుంది. 2027 నాటికి మొత్తం మార్కెట్ క్యాప్‌‌‌‌లో   ఇంటర్నెట్ స్టార్టప్​ల వాటా 15 శాతానికి పెరుగుతుందని అంచనా. ‘వచ్చే 3–5 ఏళ్లలో మరో 150 కి పైగా  యూనికార్న్​లు వస్తాయి. ఇందులో 20–25 శాతం కంపెనీలు మార్కెట్‌‌‌‌లో లిస్ట్‌‌‌‌ అయినా బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ అదనంగా 500 బిలియన్ డాలర్లు పెరుగుతుంది’ అని ఒక ఎనలిస్టు అన్నారు.  ఓయో రూమ్స్‌‌‌‌, డెల్హివరీ, ఫార్మ్‌‌‌‌ఈజీ, స్నాప్‌‌‌‌డీల్‌‌‌‌, మొబిక్విక్‌‌‌‌, ఇక్సిగో వంటి స్టార్టప్‌‌‌‌ కంపెనీలూ ఐపీఓకి రెడీగా ఉన్నాయి. దీంతో బీఎస్‌‌‌‌ఈ మార్కెట్ క్యాప్  ఇంకా పెరుగుతుందని అంచనా.    స్టార్టప్​లకు ఐపీఓలకూ డిమాండ్​ రావడాన్ని గమనించాలి.  నైకా ఐపీఓ సైజు రూ. 5,352 కోట్లు కాగా రూ. 2.5 లక్షల కోట్ల షేర్లకు బిడ్స్‌‌‌‌ వచ్చాయి. జొమాటో ఐపీఓ రూ. 9,375 కోట్లు అయితే  రూ. 2.10 లక్షల కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. పాలసీబజార్‌‌‌‌‌‌‌‌, ఈజ్‌‌‌‌ మై ట్రీప్‌‌‌‌, కార్‌‌‌‌‌‌‌‌ట్రేడ్ ఐపీఓలకు రూ. 40 వేల కోట్ల–రూ. 56 వేల కోట్ల మధ్య బిడ్స్‌‌‌‌ సాధించాయి.

వాల్యుయేషన్ చాలా ఎక్కువ..

మార్కెట్‌‌లో లిస్ట్‌‌ అయిన స్టార్టప్ కంపెనీల వాల్యుయేషన్‌‌ చాలా ఎక్కువగా ఉందని కొంత మంది ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. జొమాటో షేరు వాల్యు  రూ. 40 దగ్గర ఉండాలని, కానీ, రూ. 153 దగ్గర కంపెనీ షేరు ట్రేడవుతోందని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌‌  ప్రొఫెసర్‌‌‌‌ అన్నారు.  ఒక్క నైకా తప్ప పైన పేర్కొన్న స్టార్టప్‌‌ కంపెనీలు ఏవీ కూడా లాభాల్లో నడవడం లేదని గుర్తుంచుకోవాలి. నైకా 2020–21 లో రూ. 61 కోట్ల ప్రాఫిట్‌‌ను ప్రకటించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 12,700 కోట్ల ప్రాఫిట్‌‌ను ప్రకటించిన కోల్‌‌ ఇండియా, రూ. 16,165 కోట్ల ప్రాఫిట్‌‌ను ప్రకటించిన బీపీసీఎల్‌‌ కంటే ఎక్కువగా ఉంది. ఈ కంపెనీల బిజినెస్‌‌లు ఫ్యూచర్‌‌‌‌లో పెరుగుతాయనే అంచనాలతో వీటి షేర్లు ఇప్పుడు పెరుగుతున్నాయి. కానీ, ప్రస్తుతం మాత్రం ఈ స్టార్టప్‌‌ కంపెనీలు మరీ ఎక్కువ వాల్యుయేషన్‌‌తో ట్రేడవుతున్నాయి. మార్కెట్ పాజిటివ్‌‌గా ఉండడం వీటికి కలిసొస్తోంది. ఒకవేళ మార్కెట్ పడితే  హై వాల్యుయేషన్‌‌లో ఉన్న షేర్లు ఆటోమెటిక్‌‌గా కరెక్ట్ అవుతాయని  ఎనలిస్టులు చెబుతున్నారు.  మరోవైపు పాత కంపెనీలను కొత్త తరం కంపెనీలతో పోల్చకూడదని మరికొంత మంది ఎనలిస్టులు చెబుతున్నారు.