
- పదేండ్ల కేసీఆర్ కుటుంబ పాలనతో రాష్ట్రం దివాలా
- కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్
ఖమ్మం టౌన్, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం అవినీతి పాలనతో భ్రష్టు పట్టించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌పాలనలో అన్నిరంగాలు దివాలా తీశాయని విమర్శించారు. శుక్రవారం ఖమ్మంటౌన్ లోని వెలుగుమట్ల అర్బన్ పార్క్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం పర్యటనలో కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై మంత్రి స్పందించారు. జర్నలిస్టులు రాయలేని, వినలేని భాషలో కేటీఆర్ మాట్లాడారని, ప్రజలు ఓడించినా ఇంకా సిగ్గు, బుద్ధి రాలేదని, వచ్చే ఎన్నికల్లో కూడా తగిన బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు.
భద్రాద్రి రామయ్యకు ఇచ్చిన హామీని కేసీఆర్ తుంగలో తొక్కి, ఏడు మండలాలను ఏపీకి ఇచ్చేశారని విమర్శించారు. నిపుణులు చెప్పినా వినకుండా రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి కూలిపోయేలా చేశారన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన ఏ ప్రాజెక్ట్ కు సీడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదన్నారు. గత పదేండ్లలో రాష్ట్ర నీటి వాటాను ఆంధ్రవాళ్లు వాడుకుంటే, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎక్కువ వాటా వాడుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్నారు. డీలర్ల కృత్రిమ కొరతతోనే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయన వెంట డీసీసీ ప్రెసిడెంట్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ నీరజ ఉన్నారు.