వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు

వచ్చే  అసెంబ్లీ ఎన్నికలపై  బీజేపీ కసరత్తు

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనంటున్న బీజేపీ.. క్షేతస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఒక్కో అడుగువేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరు చేసి ప్రజల్లోకి వెళ్లడంలో సక్సెస్ అయ్యామనుకుంటున్న బీజేపీ నాయకత్వం.. ఇక నుంచి పార్టీ కేడర్ సేవలను సమగ్రంగా వాడుకోవాలని డిసైడ్ అయ్యింది. పార్టీ కోసం పనిచేస్తూ పదవులు రాకుండా నిరాశలో ఉన్న వారిని యాక్టివ్ చేయడంలో భాగంగా పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంతో పాటు జిల్లా, మండల, గ్రామ, నియోజక వర్గ కమిటీలలో పోస్టులు అనేకం పెండింగ్ లోనే ఉన్నాయి. వాటన్నింటినీ భర్తీ చేసి కేడర్ ను యాక్టివ్ చేయాలని బీజేపీ భావిస్తోంది. 

ప్రజా సమస్యలపై పోరాటాలు

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అత్యధిక స్థానాలున్న ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాలపై రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసింది. 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను నియమించింది. ఆయా నియోజక వర్గాల్లో గెలుపొందితే ఇక మిగతా నియోజకవర్గాల్లో గెలుపు సింపుల్ అనే భావనతో ఉన్నారు నేతలు. దీంతో ఈ నియోజక వర్గాల కోసం ప్రత్యేకంగా రెండు కమిటీలు వేసి కార్యాచరణ అమలు చేసే పనిలో పార్టీ పడింది. దీంతో పాటు నియోజకవర్గాలకు కన్వీనర్ లను నియమించి ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడం ద్వారా ప్రజల దృష్టి బీజేపీ వైపు తిప్పుకునే ప్లాన్ చేస్తోంది. 

బీజేపీ ప్లాన్

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని మరోసారి గెలిపించుకోవాలంటే రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కూడా బీజేపీ ప్లాన్ చేస్తోంది. MP నియోజకవర్గాల్లో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసం ఇప్పటికే పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్ లను నియమించింది. వీటితో పాటు మిగిలిన 80 అసెంబ్లీ నియోజక వర్గాలకు సైతం బీజేపీ రాష్ట్ర నాయకత్వం కన్వీనర్ లను నియమించి ఎన్నికలకు రెడీ అవ్వాలని ప్లాన్ చేస్తోంది.

రాష్ట్రంలో పార్టీ బలోపేతం

ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. అయితే ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ లేదని సీఎం కేసీఆర్ క్లియర్ గా చెప్పినా.. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్న  భావనలో బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో ఇకపై రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తమ కార్యాచరణ మరింత వేగంగా అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.