మహిళలకు బస్సుల్లో..ఫ్రీ జర్నీడిసెంబర్ 9 నుంచే

మహిళలకు బస్సుల్లో..ఫ్రీ జర్నీడిసెంబర్ 9 నుంచే
  • రాజీవ్​ ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షల స్కీమ్​ కూడా..
  • 6 గ్యారంటీల్లో ఈ రెండు సోనియా బర్త్​ డే సందర్భంగా అమల్లోకి
  • కేబినెట్​ తొలి సమావేశంలో నిర్ణయం
  • గత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై వైట్​ పేపర్​  రిలీజ్​ చేస్తం
  • అధికారుల నుంచి రిపోర్ట్​ రాగానే చర్యలు తీసుకుంటం
  • వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల కరెంట్​ ఇస్తం
  • గ్రూప్​ 1, 2 పరీక్షలపై నివేదిక అందగానే తదుపరి కార్యాచరణ
  • వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నం
  • కేబినెట్​ భేటీ వివరాలను వెల్లడించిన మంత్రులు శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్​ తొలి భేటీలోనే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రాజీవ్​ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల వైద్య సౌకర్యం హామీని కూడా శనివారం నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్​ 9న  సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు గ్యారంటీలు అమలులోకి వస్తాయని తెలిపింది. 

సెక్రటేరియేట్​లో గురువారం సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన కేబినెట్​తొలి భేటీ జరిగింది. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఆరు గ్యారంటీలతోపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కేబినెట్​ నిర్ణయాలను మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్​ మీడియాకు వెల్లడించారు. కేబినెట్‌ భేటీలో ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమల్లోకి తీసుకువచ్చేలా చూస్తామన్నారు. వీటిలో మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ, రాజీవ్​ ఆరోగ్యశ్రీ రూ. 10లక్షల స్కీమ్​ను సోనియాగాంధీ బర్త్​ డే సందర్భంగా శనివారం నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

ఆర్థిక వ్యవహారాలపై రిపోర్ట్​ ఆధారంగా చర్యలు

రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రజలకు తెలియజేయాలని కేబినెట్​ భేటీలో నిర్ణయించినట్లు మంత్రులు శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్​ తెలిపారు. ‘‘గత ప్రభుత్వం ఏమేమి  ఖర్చులు చేసింది ? ఎందుకు చేసింది? దాంతో జరిగిందేమిటి? అనే వివరాలను ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులను కేబినెట్​ ఆదేశించింది. 2014 నుంచి 2023 డిసెంబర్‌ 7 వరకు రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై వైట్​ పేపర్​ రిలీజ్​ చేస్తం” అని ప్రకటించారు. అధికారుల నుంచి వచ్చే రిపోర్టును బట్టి చర్యలు తీసుకునే డోస్​ ఆధారపడి ఉంటుందని మంత్రి పొన్నం అన్నారు. 

నేడు విద్యుత్​పై మళ్లీ సీఎం సమీక్ష

కేబినెట్​లో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని.. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో మళ్లీ సమీక్షిస్తారని శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్​ తెలిపారు. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా 24 గంటలూ కరెంట్​ ఇవ్వాలని, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలూ కరెంట్​ ఇవ్వాలని అధికారులను కేబినెట్​ ఆదేశించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడిందని తెలిపారు.

సమగ్ర వివరాలు తెప్పించుకుని ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని.. కరెంట్​ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటలు అందిస్తామని స్పష్టం చేశారు. తమ గ్యారంటీల్లో  గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై కేబినెట్​ భేటీలో చర్చించినట్లు చెప్పారు.

అధికారులను వివరాలు అడిగామని.. రాగానే నిర్ణయం తీసుకుంటామన్నారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని వారు పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సాయంపై కేబినెట్‌ భేటీలో చర్చించామని.. అన్ని వివరాలు ఇవ్వాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించామని చెప్పారు. 

శాఖల కేటాయింపుపై సీఎం, అధిష్టానానిదే నిర్ణయం

మంత్రులకు శాఖల కేటాయింపు, కొత్త మంత్రులపైముఖ్యమంత్రి, పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని మంత్రులు శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్​ పేర్కొన్నారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల విషయమై కేబినెట్‌లో చర్చించామని, అధికారుల నుంచి పూర్తి వివరాలు అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని  తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సీఎస్‌ చేతుల మీదుగా ప్రారంభమవుతుందని మంత్రులు చెప్పారు.