ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి

పాలకుర్తి, వెలుగు : బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రపై అధికార టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి ఆరోపించారు. రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్​పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చేరుకుంటున్న సందర్భంగా పాలకుర్తిలో మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో బండి సంజయ్​పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేని టీఆర్ఎస్​ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తోందన్నారు. బీజేపీలో ప్రస్తుత చేరికలు ట్రైలర్ ​మాత్రమేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పరిస్థితి జీరో అయ్యిందని, రేవంత్​రెడ్డే లాస్ట్​పీసీసీ అధ్యక్షుడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి విఠల్, జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి, మాజీ ఎంపీ సురేశ్​రెడ్డి, ఆర్గానిక్​ సెల్​రాష్ర్ట కన్వీనర్​వెంగళ్​రావు, మండల అధ్యక్షుడు కె.శ్రీకాంత్​, సంపత్​ పాల్గొన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్​ చేయాలి

జనగామ అర్బన్​, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​సోమవారం జనగామ జిల్లాలో చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్​ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి.. బీజేపీ లీడర్లు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని శామీర్ పేట గ్రామంలోని దుర్గమ్మ గుడి వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు బండారి తిరుపతి యాదవ్​అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. మీటింగ్​లో వెంకటరమణ, విద్యాసాగర్​రెడ్డి, మహిపాల్​,  రాంకోటినాయక్​ తదితరులు 
పాల్గొన్నారు. 

వజ్రోత్సవాలను సక్సెస్​ చేయాలి
హనుమకొండ సిటీ, వెలుగు : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను సక్సెస్​ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. ఆదివారం రాత్రి హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో ని నేరెళ్ల వేణుమాధవ్​ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జానపద కళాకారుల ప్రదర్శనలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్​రావు మాట్లాడుతూ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుని దేశభక్తిని చాటి చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్​భాస్కర్, మేయర్ సుధారాణి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య పాల్గొన్నారు.

భూపాలపల్లిలో కళాకారుల ప్రదర్శనలు
భూపాలపల్లి అర్భన్​, వెలుగు : 75వ భారత వజ్రోత్సవాల సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో  ఘనంగా వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని సింగరేణి క్లబ్ హౌస్​లో ఆదివారం సాంస్కృతిక, జానపద కళాకారుల ప్రదర్శన వైభవంగా ప్రారంభమైంది. వేడుకలకు చీఫ్​గెస్ట్​గా మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కళా ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, జడ్పీ చైర్ పర్సన్ శ్రీ హర్షిని, మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరాణి సిద్దు, ఎస్పీ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. 
కాజీపేట, వెలుగు: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా కాజీపేట మండలం మడికొండలోని శ్రీ సీతారామచంద్ర మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివలింగాన్ని, సీతారాములను జాతీయ జెండా రంగులతో ప్రత్యేకంగా అలంకరించారు.

వర్ధన్నపేట, వెలుగు : భారత వజ్రోత్సవాలో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జానపద కళాకారుల నాటక ప్రదర్శనను ఏర్పాటుచేశారు. ఈనాటకాన్ని టీఆర్ఎస్​వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ తిలకించారు. 

నేటి నుంచే ‘బండి’ సంగ్రామ యాత్ర

జనగామ, వెలుగు : బీజేపీ స్టేట్​చీఫ్ బండి సంజయ్​మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర సోమవారం నుంచి జనగామ జిల్లాలో ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం సీతారాంపురం స్టేజీ వద్దకు బండి సంజయ్​చేరుకోనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బండి సంజయ్​ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పాదయాత్ర పాలకుర్తి, జనగామ, స్టేషన్​ఘన్​పూర్​నియోజకవర్గాల్లో ఈనెల 22 వరకు సుమారు 36 గ్రామాల మీదుగా 128 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. యాత్రలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో, రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్​లో పబ్లిక్​ మీటింగ్​లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఓరుగల్లులో ‘లైగర్​’ సందడి 
వెలుగు, కాజీపేట : ఓరుగల్లులో లైగర్​ టీం సందడి చేసింది. ఆదివారం రాత్రి కాజీపేట మండలం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్ లో లైగర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ ను ఘనంగా నిర్వహించారు. సినీతారలు విజయ్ దేవరకొండ, అనన్య పాండే, ఆలీ, చార్మి, డెరెక్టర్​పూరి జగన్నాథ్ సందడి చేశారు. నటీనటులను ప్రత్యక్షంగా చేసేందుకు అభిమానులు తరలివచ్చారు. చీఫ్​గెస్ట్​గా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత ఓరుగల్లులో సినీ రంగ యాక్టివిటీస్​ రోజురోజుకు పెరగడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, మేయర్ గుండు సుధారాణి, నటులు గెటప్ శీను, సింగర్​  రామ్ మిర్యాల, యాంకర్ సుమ 
పాల్గొన్నారు.

త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది

ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

భూపాలపల్లి రూరల్, వెలుగు : త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీదైతే, వాటి ఫలితాలను అనుభవిస్తున్న చరిత్ర బీజేపీదని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన ఆజాద్ కా గౌరవ్ యాత్ర (పాదయాత్ర) ఆదివారం 75 కి.మీ పూర్తిచేసుకోవడంతో ముగిసింది. ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. చీఫ్​గెస్ట్​లుగా శ్రీధర్ బాబు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. శ్రీధర్​బాబు మాట్లాడుతూ త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయుల ఆలోచనలను ఇప్పుడున్న ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ లకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేందర్ పాల్గొన్నారు. మరిపెడ, వెలుగు: డోర్నకల్​ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ జెండా ఎగురుతుందని ఆ పార్టీ డోర్నకల్ ఇన్​చార్జి నెహ్రూ నాయక్ అన్నారు. ఆదివారం మరిపెడలో పాదయాత్ర నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జంతు వధకు పర్మిషన్​ తప్పనిసరి 

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : గ్రేటర్​వరంగల్​సిటీలోని లక్ష్మీపురం కాశీబుగ్గ కబేళాను మేయర్​గుండు సుధారాణి ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె జంతు వధశాల రికార్డులను పరిశీలించారు. జంతు వధకు తప్పనిసరిగా పర్మిషన్​తీసుకోవాలన్నారు. గ్రేటర్​ పరిధిలోని జంతు వధను రిజిస్టర్లలో నమోదు చేయడంతో పాటు జంతువులకు సిక్కా వేసిన తర్వాతే వధించాలన్నారు. ఆరోగ్యంగా ఉన్న జీవాల మాంసాన్నే అమ్మాలని, ఇతర ప్రాంతాల్లో వధించిన జంతువుల మాంసాన్ని అమ్మితే జరిమానాలు విధించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్​, మెడికల్​ స్టూడెంట్స్​ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్​రన్ ర్యాలీని మేయర్​ జెండా ఊపి ప్రారంభించారు. 

మహనీయుల విగ్రహాల వద్ద నివాళి

నర్సంపేట, వర్ధన్నపేట, కాశీబుగ్గ, వెలుగు : బీజేపీ హైకమాండ్​ఆదేశాల మేరకు ఆజాదీ​కా అమృత్​మహోత్సవంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను బీజేపీ నాయకులు ఆదివారం శుభ్రం చేశారు. వర్ధన్నపేట పట్టణంలో అంబేడ్కర్, ఇల్లంద గ్రామంలో స్వామి వివేకానంద, జగ్జీవన్ రామ్, అంబేడ్కర్, సుభాశ్​చంద్రబోస్ , గాంధీ విగ్రహాలను వర్ధన్న పేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు  కొండేటి శ్రీధర్ శుభ్రం చేసి నివాళులర్పించారు. నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి శుభ్రం చేసి నివాళులర్పించారు. వరంగల్​ లోనూ జాతీయ నాయకుల విగ్రహాలకు బీజేపీ లీడర్లు నివాళులర్పించారు. 

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా 

తొర్రూరు, వెలుగు :  జాతీయస్థాయి కరాటే పోటీల్లో మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన స్టూడెంట్​సత్తా చాటాడు. వెంకటాపురం గ్రామానికి చెందిన గదగాని శివతేజ ఇటీవల ముంబైలో జరిగిన జాతీయస్థాయి జూనియర్ లెవెల్ కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. అంతకుముందు హనుమకొండ, ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ గోల్డ్​మెడల్​కైవసం చేసుకున్నాడు. కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శివతేజను, మాస్టర్ సోమ శ్రీధర్ ను సర్పంచ్ శీలం లింగన్న గౌడ్ ఆదివారం అభినందించాడు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి 

నర్సంపేట, వెలుగు :  గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చే పేదలకు మెరుగైన ట్రీట్​మెంట్​ అందించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డాక్టర్లకు సూచించారు. నర్సంపేట హాస్పిటల్ ను ఎమ్మెల్యే పెద్ది ఆదివారం తనిఖీ చేశారు. పలు వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. డ్యూటీల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఖానాపురం మండలం అశోక్ నగర్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.