క్రీడా ప్రాంగణాల్లేకుండా స్పోర్ట్స్ కిట్లు దేనికి?

క్రీడా ప్రాంగణాల్లేకుండా స్పోర్ట్స్ కిట్లు దేనికి?
  • స్థలాలు కేటాయించి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • బోర్డులు పెట్టి మమ అనిపించిన అధికారులు
  • ఇటీవల 33 జిల్లాలకు 18 వేల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ
  • పదిహేను రోజులైనా అందని గైడ్ లైన్స్

మెదక్/నిజాంపేట, వెలుగు : పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టి పెట్టినట్టు’ క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ‘కేసీఆర్​స్పోర్ట్స్​కిట్లు’ కొనుగోలు చేసి మండల కేంద్రాలు, మున్సిపాలిటీలకు పంపింది.15 రోజులైనా ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. వాటిని ఎవరికి అప్పగించాలి, పర్యవేక్షణ బాధ్యత ఎవరిది అనే విషయం వెల్లడించలేదు. దీంతో కిట్లు ఆఫీసుల్లోని అట్టపెట్టెల్లోనే మూలుగుతున్నాయి. ఒకవేళ వాటిని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలకు లేదా యూత్​అసోసియేషన్లకు అప్పగించినా వినియోగించుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాల్లో 95 శాతం అసంపూర్తిగా ఉన్నాయి. చాలాచోట్ల బోర్డులు తప్ప ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.

17 వేలకు పైగా.. 

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామం, పట్టణాల్లోని వార్డుల్లో టీకేపీ(తెలంగాణ క్రీడా ప్రాంగణాలు)లు మంజూరు చేసింది. మెదక్ జిల్లాలో 469, సిద్దిపేట జిల్లాలో 525, సంగారెడ్డి జిల్లాలో 733 సహా రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ఆయాచోట్ల ఎకరం, అర ఎకరం విస్తీర్ణంలో బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్​కోర్టులు, ఎక్సర్​సైజ్​చేసేందుకు వీలుగా ఇనుప రాడ్లతో బార్​లు అందుబాటులోకి తేవాల్సి ఉంది. 

కాగా దాదాపు అన్నిచోట్ల ఎక్సర్​సైజ్​బార్​లు, వాలీబాల్​నెట్​ కట్టేందుకు వీలుగా ఇనుప పైపులు తప్ప ఎక్కడా కోర్టులు ఏర్పాటు చేయలేదు. క్రీడా ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్​మాదిరిగా పొడవుగా పెరిగే చెట్లు నాటాలని నిర్దేశించినా ఎక్కడా నాటిన దాఖలాలు లేవు. అధికారులు బోర్డులు పెట్టి వదిలేశారు. కొన్ని చోట్ల స్థలాలు దొరకలేదని చెప్పి గవర్నమెంట్​స్కూల్​గ్రౌండ్​ల లోనే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా 100 శాతం పనులు పూర్తిచేయలేదు. చాలాచోట్ల పిచ్చి మొక్కలు, గడ్డి, చెట్లు ఏపుగా పెరిగి అధ్వానంగా మారాయి. 

క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో...

ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కోర్టులు ఏర్పాటు చేయకుండానే తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒకేసారి రాష్ట్రమంతా సరిపోయేలా కేసీఆర్​ స్పోర్ట్స్​కిట్లు కొనుగోలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 33 జిల్లాలకు 18 వేల కిట్లను సరఫరా చేశారు. ఒక్కోదానిలోని ఐటెమ్స్ ను బట్టి కిట్​రూ.15 వేలు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసిన కిట్ల విలువ రూ.27 కోట్లు ఉంటుంది.

కిట్​లో 23 ఐటెమ్స్

కేసీఆర్ స్పోర్ట్స్​కిట్​లో వివిధ ఆటలకు సంబంధించి మొత్తం23 ఐటమ్స్​ఉన్నాయి.  రెండు క్రికెట్​బ్యాట్​లు, రెండు బ్యాటింగ్ గ్లౌజులు, ఒక వికెట్ కీపింగ్ గ్లౌజ్, 6 క్రికెట్ బాల్స్, 4 సింథటిక్ వాలీబాల్, రెండు వాలీబాల్ నెట్లు, ఒక సైకిల్​పంప్, మూడు డంబెల్స్(2.5 కేజీ, 5 కేజీ,7.5 కేజీ ), రెండు డిస్కస్ త్రోలు(కేజీ,2 కేజీలు), 6 టెన్నికాయిట్ రింగ్స్, 4 స్కిప్పింగ్ రోప్స్, ఒక స్టాప్ వాచ్, మూడు ప్లాస్టిక్ విజిల్స్, 75 ప్లేయర్స్ టీ షర్ట్స్ ఉన్నాయి.