డిసెంబర్ 31 నైట్ పార్టీలకు సర్కార్ స్పెషల్ పర్మిషన్లు

డిసెంబర్ 31 నైట్ పార్టీలకు సర్కార్ స్పెషల్ పర్మిషన్లు
  • ఒక్క హైదరాబాద్​లోనే 900 ఈవెంట్లకు అనుమతి
  • ఒక్కో ఈవెంట్​కు రూ.12 వేల చొప్పున వసూలు
  • న్యూఇయర్ వేడుకల ద్వారా దాదాపు 
  • రూ.200 కోట్లు రాబట్టుకోవాలని టార్గెట్ 

హైదరాబాద్, వెలుగు: న్యూఇయర్ వేడుకల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర సర్కార్ చూస్తోంది. వీలైనంత ఎక్కువ మద్యం అమ్మి ఖజానా 
నింపుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం డిసెంబర్ 31 నైట్ పార్టీలకు స్పెషల్ పర్మిషన్లు ఇస్తోంది. అర్ధరాత్రి 12 గంటల దాకా వైన్స్ లలో మద్యం అమ్మేందుకు, ఒంటిగంట దాకా బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లకే కాకుండా కొత్తగా డిసెంబర్ 31న నైట్ పార్టీలు నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలకు ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఇస్తోంది. ఇందుకు ఒక్కో ఈవెంట్ కు రూ.12 వేలు వసూలు చేస్తోంది. ఒక్క హైదరాబాద్​ పరిధిలోనే ఇప్పటికే దాదాపు 900 ఈవెంట్లకు పర్మిషన్లు ఇచ్చారు. డిసెంబర్ 31న నైట్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.150 కోట్ల నుంచి రూ.200  కోట్ల లిక్కర్​సేల్స్​జరపాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆఫీసర్లలో చర్చ జరుగుతోంది. కేవలం ఈవెంట్ పర్మిషన్ల ద్వారానే రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల దాకా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిసింది. 

లిక్కర్ సేల్స్ పై టార్గెట్.. 

ఈవెంట్లకు అనుమతులు ఇచ్చే టైమ్​లో ఏవో మొక్కుబడి సూచనలు చేస్తూ ఎక్సైజ్​ శాఖ చేతులు దులుపుకుంటోంది. పైగా వీలైనంత ఎక్కువగా లిక్కర్ సేల్స్​ఉండాలని టార్గెట్ పెడుతున్నట్లు తెలిసింది. నెల రోజుల స్టాక్ ఒక్క రోజులో సేల్ కావాలని బార్లు, వైన్స్​లకు టార్గెట్ పెడుతున్నది. మరోవైపు ఈవెంట్లలో లిక్కర్​ వినియోగంపైనా వివరాలు తీసుకుంటోంది. ఎంతమందితో ఈవెంట్​ చేస్తారు ? ఏయే బ్రాండ్లు అందుబాటులో పెడతారు ? అనే వివరాలు తీసుకుంటూ.. బీర్ల కంటే లిక్కర్​కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తోంది. కాగా, రాష్ట్ర సర్కార్ రాబడి కోసం పండుగలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను టార్గెట్ చేసుకొని లిక్కర్ సేల్స్ పెంచుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.25 వేల కోట్ల మేర ఎక్సైజ్​ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. 

డ్రగ్స్​పై నిఘా ఏదీ? 

ఈవెంట్లకు అడ్డగోలుగా పర్మిషన్ ఇస్తున్న ఎక్సైజ్ డిపార్ట్​మెంట్.. డ్రగ్స్ పై దృష్టి పెట్టడం లేదు. డిసెంబర్​ 31న రాత్రి ఈవెంట్లలో డ్రగ్స్ సప్లై అయ్యే అవకాశం ఉందని ఇంటలిజెన్స్​వర్గాలు హెచ్చరించినా.. టాస్క్​ఫోర్స్ మాత్రం​నిఘా పెట్టడం లేదు. రెగ్యులర్​టీమ్స్​మాత్రమే పని చేస్తున్నాయి. పర్మిషన్​ఇచ్చిన ఈవెంట్ల దగ్గర కచ్చితంగా టాస్క్​ఫోర్స్​నుంచి ఒకరు ఉండాల్సి ఉంటుంది. అయితే వేల సంఖ్యలో పర్మిషన్లు ఇస్తుండడం, ఆ స్థాయిలో సిబ్బందిని నియమించే పరిస్థితి లేదంటూ కొన్నిచోట్లకే పరిమితం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్​ఫోర్స్​మెంట్ వింగ్​(హెచ్​–న్యూ)  ఉన్నప్పటికీ.. ప్రస్తుతమున్న పబ్​లు, ఇతర బార్లపైనే దృష్టి పెడుతున్నారు.