ఈటల చేరికపై ఎందుకంత ఆక్రోశం

V6 Velugu Posted on Jun 22, 2021

ఈటల రాజేందర్​ను  కేబినెట్​ నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈటల కేంద్రంగా ఎత్తులు,  పొత్తులు , ఊహాగానాలు వ్యాపించాయి. రాష్ట్రంలో టీఆర్​ఎస్​ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరాన్ని గుర్తించిన బహుజన, ప్రజా సంఘాలు, కేసీఆర్​ వ్యతిరేక నేతలు ఈటల కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రయత్నించారు. కానీ ఈటల బీజేపీ పెద్దలను కలవగానే కొత్త వాదనకు తెరలేపారు. కొందరు.. లెఫ్ట్  ఐడియాలజీ నుంచి వచ్చిన ఈటల రైట్ ఐడియాలజీ గల బీజేపీలో ఎట్ల చేరుతారనే చర్చ ప్రారంభించారు. ఇంకొందరు.. తన ఆస్తులను కాపాడుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకోవడానికే చేరారంటూ తమ స్థాయి మరిచి సోషల్ మీడియా, మీడియాలో ఆక్రోశాన్ని బయటపెట్టుకున్నారు. ఈ వాదన వల్ల ఎవరికి లాభం అనేది ఇక్కడ విశ్లేషించుకోవాలి. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. అలాంటి రాష్ట్రంలో ఉద్యమ ఆశయాలు, ఆకాంక్షలను పక్కన పెట్టి, ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చి, వారసత్వమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. అప్పుల రాష్ట్రంగా తయారుచేశారు. రాష్ట్ర ప్రజలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో  బాధ పడుతుంటే, సమస్యల నుంచి దృష్టి మళ్లించి పాలన సాగిస్తున్నారు. అలాంటి పాలకులను వదిలిపెట్టిన కొందరు బహుజన నాయకులు లేవనెత్తిన ప్రశ్నలు.. 1. ఈటల లెఫ్ట్  నుంచి  రైట్ పార్టీకి  ఎలా వెళ్తారు?  2. ఆస్తులు కాపాడుకోవడానికి, కేసుల నుంచి రక్షణ కోసం కాదా?  3. బహుజన రాజకీయ వేదిక రాజ్యాధికారం వద్దా ? అని. 
ఆర్​ఎస్​ఎస్​ నుంచి ఆర్​ఎస్​యూ దాకా
విద్యార్థి దశలో లెఫ్ట్  ఐడియాలజీలో ఈటల పనిచేసి ఆదర్శ వివాహం చేసుకున్న తర్వాత జీవనం కోసం పౌల్ట్రీ వ్యాపారంలోకి వచ్చారు.   తెలంగాణ వచ్చేనాటికి పౌల్ట్రీ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. ఉద్యమంలో కీలక నేతలలో ఒకరిగా ఎన్నో అవమానాలను తట్టుకొని రాష్ట్ర సాధనే లక్షంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఏ పార్టీ ఐడియాలజీని అడాప్ట్  చేసుకోలేదు. ఆర్​ఎస్​ఎస్​ నుంచి ఆర్​ఎస్​యూ వరకు అందరిని కలుపుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలన్నదే ఉద్యమ ఐడియాలజీ .  ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే కాకినాడ తీర్మానం, మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీదే. కాంగ్రెస్ అలసత్వాన్ని పార్లమెంటులో బట్టబయలు చేసి, వీరుల బలిదానాలను గుర్తించి , ఉద్యమ తీవ్రతకు ప్రాణం పోసింది బీజేపీ. ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షానికి తెలంగాణ బిల్లుపై సపోర్ట్ చేసింది రైట్ పార్టీ అయిన బీజేపీనే కదా!
స్వలాభం కోసం అంటే నమ్మగలమా?
కేసులు, ఆస్తుల విషయానికొస్తే.. వైఎస్​ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని  ఔటర్ రింగ్ రోడ్ అలైన్​మెంట్​ పేరుతో ఈటల భూములను గుంజుకోవాలనుకున్నప్పుడు కానీ, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను  కొన్నప్పుడు గానీ, నయీం లాంటి వ్యక్తిని చంపాలని రెక్కీ నిర్వహించినప్పుడు గానీ భయపడని ఈటల ఇప్పుడు భయపడి స్వలాభం కోసం బీజేపీలో చేరారు అంటే నమ్మలేం. 
ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయ వేదిక లేదెందుకు?
‘బహుజన రాజకీయ వేదిక– రాజ్యాధికారం’ అనే చర్చ చాలా ముఖ్యమైనది. ఉద్యమకాలంలో,  అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్​ఎస్​ నుంచి కేసీఆర్​ వెళ్లగొట్టిన  నాయకులు ఎక్కువ మంది బహుజనులే. వీరిలో చాలామంది నాయకులు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఉద్యమంలో ముందువరుసలో పనిచేసిన వాళ్లే.  నాయకులను బయటకు పంపేందుకు వారిపై ఆరోపణలు చేయడం కేసీఆర్​కు అలవాటైన పనే.  ఇది రాష్ట్ర  ప్రజలకు కూడా తెలియని విషయం కాదు. ఈ క్రమంలో ఈటల విషయాన్ని అదునుగా చేసుకొని కొందరు బహుజనవాదం పేరుతో ఈటల భుజంపై తుపాకీ పెట్టి తమ పగ తీర్చుకోవాలని ఆశపడ్డప్పటికీ నిరాశే మిగిలింది. ఈ భంగపాటును భరించలేక ఉలిక్కిపడి , మరుగునపడ్డ సిద్ధాంతాలతో రాద్ధాంతం చేయడం మొదలుపెట్టారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం మొదలైన తర్వాత సిద్ధాంత రాజకీయాలు కనుమరుగయ్యాయి. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేసీఆర్​ ప్రభుత్వంపై వీరందరూ కలిసి ఒక ప్రత్యామ్నాయ వేదిక ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటుచేయలేకపోయారు ? అందుకు కావాల్సిన ధైర్యం, శక్తి లేదా?   ప్రయత్న లోపమా.. సమన్వయ లోపమా.. వ్యక్తిగత లోపమా .. వ్యూహ లోపమా..? అనేది ఆ నాయకులే చెప్పాలి. అంటే.. అన్నిరకాలుగా ఉన్న బలమైన నాయకుడి అవసరం ఎంతైనా ఉన్నదనేది ఒక సత్యం.. అదే ఈటల రాజేందర్  అనేది నిజం.
తోటి బీసీ అని కూడా చూడకుండా..
ఈటల తమ నుంచి దూరమై బీజేపీకి దగ్గరయ్యారన్న  బాధతో , కోపంతో తమ స్థాయిని మరిచి , తోటి బీసీ అని కూడా చూడకుండా ఆయన కులాన్ని , పేదరికాన్ని గుర్తుచేసి కొందరు కించపరుస్తున్నారు . బీజేపీకి తెలంగాణ ఉద్యమంతో , తెలంగాణ ఏర్పాటులో సంబంధం లేనట్లుగా చర్చించడం రాజకీయ అవివేకానికి నిదర్శనం. మనదేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి బహుజన వర్గాలకు చెందినవారు కాదా..? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బహుజన ప్రజాప్రతినిధులు లేరా..? బీజేపీని బహుజన వ్యతిరేక పార్టీ అనే వాదనను విరమించండి. ఈటల తన రాజకీయ ఆత్మరక్షణ కోసం, తన ఆత్మగౌరవం కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ వ్యూహంలో భాగంగా బీజేపీతో  కలిసి  పనిచెయ్యాలనే వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కు రాజ్యాంగం కల్పించింది. 

Tagged Bjp, TRS, Telangana, etela rajender, POLITICS,

Latest Videos

Subscribe Now

More News