పాడువడ్డ ఇండ్లను పంచేదెట్ల?..రాష్ట్రవ్యాప్తంగా అధ్వాన స్థితికి డబుల్ బెడ్రూం ఇండ్లు

పాడువడ్డ ఇండ్లను పంచేదెట్ల?..రాష్ట్రవ్యాప్తంగా అధ్వాన స్థితికి డబుల్ బెడ్రూం ఇండ్లు
  • ఆఫీసర్ల ఫీల్డ్​ ఎంక్వైరీలో దిగ్ర్భాంతికర దృశ్యాలు
  • సౌలతులు, రిపేర్లకే వెయ్యి కోట్లకుపైగా ఖర్చయితయని అంచనా
  • గోడలకు పగుళ్లు.. స్లాబులు, పిల్లర్లకు నడుమ గ్యాపులు
  • విరిగిన తలుపులు, పగిలిన ట్యాంకులు.. కిటికీలు, ఇతర సామగ్రి దొంగల పాలు
  • తాగునీరు, కరెంట్​, రోడ్లు, ఇతర వసతులు నిల్​

హైదరాబాద్/నెట్​వర్క్, వెలుగు: కేసీఆర్​ మానస పుత్రికగా చెప్పుకున్న డబుల్​బెడ్​రూం ఇండ్ల స్కీం ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లుగా తయారైంది. నాడు సుమారు 3 లక్షల ఇండ్లు మంజూరు చేసి, రూ. 12,560  కోట్లు ఖర్చు చేసినా పూర్తయిన ఇండ్లు 1.5 లక్షలు మాత్రమే. వీటిలో సగానికి పైగా ఇండ్లకు తాగునీరు, కరెంట్​, డ్రైనేజీ లాంటి మౌలికవసతులు లేకపోవడంతో పంచకుండానే అప్పట్లో పక్కనపెట్టారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్కీ డ్రా ద్వారా సుమారు లక్షకు పైగా ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసినా పొజిషన్​ చూపలేదు. దీంతో అసలే క్వాలిటీ లేకుండా నిర్మించిన ఆ ఇండ్లు కాస్తా నిర్వహణ కూడా లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలు పగుళ్లుబారి, ట్యాంకులు పగిలిపోయి, పైపులు విరిగిపోయి, కిటికీలు, తలుపులు ఊడిపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి. చాలాచోట్ల కిటికీల ఊచలు, తలుపులు, కరెంట్​వైర్లు, ఇతర సామగ్రి దొంగలపాలయ్యాయి. హైదరాబాద్​లాంటి చోట్ల నిర్మించిన అపార్ట్​మెంట్లలో డ్రింకింగ్​వాటర్​, కరెంట్, లిఫ్టులు, డ్రైనేజీ సమస్యతో 20 వేల మంది అటుదిక్కు పోవడం లేదు. లక్కీ డ్రా ద్వారా ఇండ్లను పొందిన లబ్ధిదారులు వాటిని అప్పగించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తుండడంతో ఇటీవల రాష్ట్ర సర్కారు జిల్లాలవారీగా డబుల్​బెడ్రూం ఇండ్ల పరిస్థితిని తెలుసుకునేందుకు కలెక్టర్ల ద్వారా ఫీల్డ్​ ఎంక్వైరీ చేయిస్తున్నది.

ఆఫీసర్ల పరిశీలనలో ఎక్కడ చూసినా క్వాలిటీ, మెయింటనెన్స్​ లేక ఇండ్లన్నీ పడావుపడి కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మౌలిక వసతులు కల్పించి, వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటే మౌలిక వసతులు, రిపేర్లకే రూ.1,000 కోట్లకుపైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏ జిల్లాలో చూసినా ఇదే సీన్​..

ఫీల్డ్​ ఎంక్వైరీలో డబుల్​ బెడ్రూం ఇండ్ల దుస్థితిని చూసి ఆఫీసర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తయిన, మధ్యలో వదిలేసిన ఇండ్ల చుట్టూ కంప చెట్లు మొలిచి, బూత్​ బంగ్లాల్లా మారిపోయాయి. గత ప్రభుత్వం డబుల్​ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించే బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించగా, అసలే నిధుల్లేని పాలకవర్గాలు అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో తాగునీరు, కరెంట్, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులు లేకపోవడంతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంపిక చేసిన లబ్ధిదారులకు కూడా పొజిషన్​చూపలేదు. అసలే క్వాలిటీ లేకుండా నిర్మించిన ఇండ్ల గోడలు పగుళ్లుబారాయి. స్లాబులు, పిల్లర్లకు మధ్య గ్యాపులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పైపులు, ట్యాంకులు విరిగిపోయి కింద పడ్డాయి.

 కిటికీలు, తలుపులు, వైర్లు, ఇతర సామగ్రి దొంగలపాలయ్యాయి. ఉదాహరణకు.. జోగులాంబ గద్వాల జిల్లా దౌదర్​పల్లి దర్గా దగ్గర 1,275.. గద్వాల మండలం గోన్​పాడు దగ్గర 25 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినా ఏ ఒక్కరికీ పంచలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా తీసినా పొజిషన్​ చూపలేదు. ఈ క్రమంలో గోన్​పాడు దగ్గర నిర్మించిన 25 ఇండ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయి. విరిగిపోయిన కిటికీలు, డోర్లు, పగిలిపోయిన అద్దాలతో పరిస్థితి అధ్వానంగా ఉంది. కరీంనగర్ జిల్లాలో 6,564 డబుల్​ బెడ్రూం ఇండ్లు మంజూరైతే కేవలం 789 ఇండ్లను పూర్తిచేశారు. ఇందులో 388 ఇండ్లను పంపిణీ చేయగా, పంపిణీకాని 400 ఇండ్లు శిథిలమవుతున్నాయి. నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో 240, అచ్చంపేటలో 150 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. రెండు చోట్ల కరెంట్, వాటర్, డ్రైనేజీ పనులు పెండింగ్​లో ఉండడంతో పొజిషన్ చూపలేదు. దీంతో నిర్వహణ లేక ఇండ్లన్నీ దెబ్బతింటున్నాయి. సూర్యాపేట జిల్లాకు 5,424 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయగా, 3,166  ఇండ్లు పూర్తి చేశారు. 

వీటిలో 2,318 ఇండ్లను పంపిణీ చేయకపోవడంతో నిర్వహణ లేక బంజరుదొడ్లను తలపిస్తున్నాయి. మెదక్​ జిల్లాలో 4,776 డబుల్​ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా.. 2,440 పూర్తయ్యాయి. ఇందులో దాదాపు 1,240 ఇండ్లను పంపిణీ చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. ఖమ్మం జిల్లాకు 14,560 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుకాగా.. కేవలం 2,158 ఇండ్లు పూర్తి చేశారు. వీటిలో కేవలం 620 ఇండ్లను పంపిణీ చేయగా.. మిగిలిన 1,538 ఇండ్లు నిర్వహణ లేక దెబ్బతింటున్నాయి. కేసీఆర్​ సొంత జిల్లా  సిద్దిపేటలో మాత్రమే ఈ స్కీమ్​ కొంతవరకు సక్సెస్​ అయింది. ఈ జిల్లాలో 15,929 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయగా 11,072 ఇండ్లు పూర్తి చేశారు. వీటిలో దాదాపు 10,665 ఇండ్లను  పంపిణీ చేయడం విశేషం. మిగిలిన జిల్లాలకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది.

జీహెచ్​ఎంసీలో రూ.300 కోట్లు కావాలి

గ్రేటర్​ హైదరాబాద్​లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని గత బీఆర్ఎస్​ ప్రభుత్వం హామీ  ఇచ్చినప్పటికీ 69 వేల ఇండ్ల నిర్మాణమే పూర్తయింది. మిగిలివాటిలో కొన్ని నిర్మాణ దశలో ఆగిపోగా.. కొన్ని అసలు స్టార్టే కాలేదు. అత్యధికంగా కొల్లూర్​లో 15,660 ఇండ్లు నిర్మించగా.. పోచారంలో 6 వేలు.. ప్రతాపసింగారంలో 2,200..  దుందిగల్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో ఒక్కోచోట వెయ్యికి పైగా ఇండ్లను నిర్మించారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమని గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఎన్నికల కోడ్ వచ్చే కొద్దిరోజుల ముందు ఒకేసారి 65 వేల ఇండ్లను అందిస్తామంటూ కలెక్టరేట్లలో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసింది. వీరిలో కొందరికి  ఇండ్ల తాళాలు కూడా ఇచ్చింది. కానీ కరెంట్, వాటర్​, లిఫ్ట్​, రోడ్​ఫెసిలిటీ లేక దాదాపు 20 వేల మంది ఇండ్లలోకి పోలేదు. ఈ క్రమంలో ఇటీవల సర్కారు ఆదేశాలతో ఫీల్డ్​ఎంక్వైరీ చేసిన జీహెచ్​ఎంసీ ఆఫీసర్లు.. డబుల్​ ఇండ్లలో మౌలి కవసతులు, రిపేర్ల కోసం ఏకంగా రూ.300 కోట్లు కావాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఆ పైసలు వచ్చి, రిపేర్లు చేసి, మౌలికవసతులు కల్పిస్తే తప్ప వాటిలోకి లబ్ధిదారులు వెళ్లే పరిస్థితి లేదు. 

మొదలుపెట్టని ఇండ్లు క్యాన్సిల్​

రాష్ట్రంలో పూర్తయిన, మధ్యలో వదిలేసిన డబుల్​బెడ్రూం ఇండ్ల పరిస్థితి ఇలా ఉండడంతో ఇప్పటివరకు నిర్మాణమే ప్రారంభించని ఇండ్లను రద్దు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. నారాయణపేట, వికారాబాద్ లాంటి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా పూర్తి కాలేదు. నారాయణపేట జిల్లాకు 2,090 ఇండ్లు శాంక్షన్​ చేయగా.. 864 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 1,190 ఇండ్ల పనులు అసలు స్టార్ట్ కాలేదు. వికారాబాద్ జిల్లాకు 4,036 ఇండ్లు శాంక్షన్ కాగా.. 1,219 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 1,759 ఇండ్ల పనులు ప్రారంభించలేదు. హౌసింగ్​అధికారుల లెక్కల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల 602 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు మొదలుకాలేదు. దీంతో వీటిని రద్దు చేసి, ఆ స్థానంలో  ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయాలని భావిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.

ఇండ్లు కట్టి కిటికీలు పెట్టలే..!

కరీంనగర్ సిటీ శివారులోని చింతకుంటలో 660 డబుల్ బెడ్రూం ఇండ్లను జీ ప్లస్ ఫైవ్ పద్ధతిలో గత ప్రభుత్వం ఐదేండ్ల కింద నిర్మించింది. కొన్ని ఫ్లాట్లకు కిటికీలు, డోర్లు బిగించగా.. మరికొన్నింటికి బిగించలేదు. కరెంట్ వైరింగ్ లాంటి పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇందులో తమకు ఫ్లాట్లను కేటాయించాలంటూ నిరుడు పలుమార్లు మహిళలు వాటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు వెళ్లగొట్టారు. ఎన్నికలకు ముందు లాటరీ పద్ధతిలో ఇస్తారని భావించినా ఇవ్వలేదు. అలాగే, హుజూరాబాద్ శివారులో 55‌‌‌‌0 డబుల్ బెడ్రూం ఇండ్ల ఫ్లాట్లను జీ ప్లస్ 3 పద్ధతిలో నిర్మించారు. వీటిని కూడా పంపిణీ చేయలేదు. ఇవి నిర్మించి ఇప్పటికే నాలుగేండ్లు దాటడం, వాడకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కిటికీల అద్దాలు పగిలి, డోర్లు విరిగి అధ్వానంగా మారుతున్నాయి. 

బిల్లులు రాక పనులు మూలకు

సూర్యాపేట పట్టణంలోని కేసారం వద్ద గత ప్రభుత్వం 480 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టగా.. 60 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ మధ్యలోనే పనులను వదిలేసి వెళ్లాడు. దీంతో ఇండ్లన్నీ శిథిలమవుతున్నాయి. కిటికీలు ఇరిగిపోయి, గోడలు పగుళ్లుబారి, లోపల పశువుల కొట్టాల్లా మారిపోయాయి. 384 ఇండ్లు పూర్త యితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏకంగా 804 మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. కానీ, పొజిషన్​ చూపకపోవడంతో ఎవరూ ఉండట్లేదు. దీంతో తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు అలాట్ మెంట్ చేయాలంటూ కలెక్టర్ ఎస్. వెంకటరావుకు లబ్ధిదారులు సోమవారం వినతిపత్రం అందించారు. ఉండేందుకు ఏమాత్రం అనుకూలంగా లేని వీటిని ఎలా పంపిణీ చేయాలో తెలియక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు.

పైపులు, కిటికీలు దొంగలపాలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో నిర్మించిన డబుల్​ బెడ్రూం ఇండ్ల దుస్థితి ఇది. ఒకేచోట సుమారు 200 ఇండ్లు నిర్మించి, ఏడాది క్రితం లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. కానీ పంపిణీ మాత్రం మరిచిపోయారు. దీంతో నిర్వహణ లేక ఇండ్లన్నీ  దెబ్బతిన్నాయి. దీనికితోడు విద్యుత్ వైర్లను, పైపులను, ఇనుప కిటికీలను  దొంగలు ఎత్తుకెళ్లారు. క్వాలిటీ లేకపోవడంతో గోడలు నెర్రలు బారాయి. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు లేవు. దీంతో రిపేర్లు చేసి ఈ  ఇండ్లను పంపిణీ చేయాలంటే దాదాపు రూ. 2 కోట్లు అవసరమని ఆఫీసర్లు చెప్తున్నారు.