
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ పురుషుల ఫుట్ బాల్ 11వ టోర్నమెంట్ మహబూబ్ నగర్ లో గురువారం ప్రారంభమైంది. తొలిరోజు జరిగిన లీగ్ పోటీల్లో 12 జట్లు తలపడ్డాయి. నిజామాబాద్ పై ఆదిలాబాద్ (2), ఖమ్మంపై కరీంనగర్ (4), నల్గొండపై రంగారెడ్డి (6) వరంగల్ పై మెదక్ (7) పాయింట్ల చొప్పున సాధించి గెలుపొందాయి.
వనపర్తి, నిజామాబాద్ జట్లు చేరో పాయింట్ సాధించాయి. లీగ్ మ్యాచ్ లో ఖమ్మంపై జట్టు మహబూబ్ నగర్ 2/0 తేడాతో గెలుపొందింది. ఈ టోర్నమెంట్ ఆదివారం వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లా క్రీడా మైదానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 16 కోట్లు మంజూరు చేసిందన్నారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఫుట్ బాల్ క్రీడకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఎంతో మంది ఫుట్ బాల్ క్రీడాకారులు దేశం తరఫున ఆడి రాణించారని గుర్తు చేశారు.