కేసులు తగ్గుతున్నా.. అలర్ట్ గా ఉండాలి

కేసులు తగ్గుతున్నా.. అలర్ట్ గా ఉండాలి
  • రాష్ట్రాలు నెమ్మదిగా కోలుకుంటున్నయ్​
  • కరోనా రూల్స్ సడలింపు
  • నైట్​ కర్ఫ్యూ ఎత్తేసిన కర్నాటక
  • మహారాష్ట్రలోని పుణెలో ఒంటిపూట బడులు
  • దేశంలో కొత్త కరోనా కేసులు కాస్త తగ్గినయ్

న్యూఢిల్లీ/ బెంగళూరు: దేశంలో కరోనా వేవ్​ నెమ్మదిస్తోంది. వైరస్​ ప్రభావం నుంచి రాష్ట్రాలు క్రమక్రమంగా కోలుకుంటున్నాయి. రూల్స్​ను నెమ్మదిగా సడలిస్తున్నాయి. విద్యాసంస్థలు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. నైట్​ కర్ఫ్యూ విధించిన రాష్ట్రాలు వాటిని ఎత్తేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా కర్నాటక సర్కారు నైట్​ కర్ఫ్యూ ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి 1–9వ తరగతి పిల్లలకు రెగ్యులర్ క్లాసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్ర, కేరళ, గోవా నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు కచ్చితంగా చేయాలన్న ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు చెప్పింది. శనివారం సీఎం బసవరాజ్ బొమ్మై ఆధ్వర్యంలో ఎక్స్‌‌పర్టులు, ఆఫీసర్లతో జరిగిన హైలెవెల్ మీటింగ్ తర్వాత మంత్రి ఆర్.అశోక మీడియాతో మాట్లాడారు. సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ ఉండబోదని చెప్పారు. పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉంచొచ్చని, 100% కెపాసిటీతో నడుపుకోవచ్చని తెలిపారు. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్టేడియాలు 50% కెపాసిటీతో నిర్వహించుకోవాలని సూచించారు. ‘‘థర్డ్ వేవ్ వల్ల 1 నుంచి 9వ తరగతి దాకా క్లాసులు నిలిపేశాం. సోమవారం నుంచి అన్ని క్లాసులు జరుగుతాయి” అని విద్యా మంత్రి బీసీ నగేశ్ చెప్పారు.

1 నుంచి పుణెలోనూ స్కూళ్లు ఓపెన్
ఫిబ్రవరి ఒకటి నుంచి మహారాష్ట్రలోని పుణెలో స్కూళ్లు, కాలేజీలను ఓపెన్ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్పారు. 1 నుంచి 8వ తరగతి దాకా స్టూడెంట్లకు హాఫ్ డే మాత్రమే క్లాసులు నిర్వహించాలని అన్నారు.

కొత్త కేసులు 2.35 లక్షలు
దేశంలో కొత్తగా 2,35,532 కేసులు నమోదయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య 4.08 కోట్లకు చేరిందని, మరో 871 మంది చనిపోయారని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. డెత్స్ 4.93 లక్షలకు పెరిగాయని చెప్పింది. 

బెంగాల్‌‌లో కరోనా ఆస్పత్రిలో మంటలు.. ఒకరు మృతి
వెస్ట్‌‌ బెంగాల్‌‌లోని బుర్ద్వాన్‌‌ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో సంధ్య మండల్(60) అనే వ్యక్తి చనిపోయారు. శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిందని, మిగతా పేషెంట్లను కాపాడగలిగిగామని ఆఫీసర్లు చెప్పారు. ప్రమాదంపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు వివరించారు.

కేసులు తగ్గుతున్నా.. అలర్ట్​గా ఉండాలె
ఐదు తూర్పు రాష్ట్రాలకు కేంద్ర హెల్త్ మినిస్టర్ సూచన
 

న్యూఢిల్లీ:  రెండు వారాలుగా యాక్టివ్ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ, కరోనాపై పోరాటంలో నిర్లక్ష్యం చేయొద్దని, వైరస్ వ్యాప్తిపై అలర్ట్​గా ఉండాలని ఐదు ఈస్టర్న్ స్టేట్స్​కు కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్ సుఖ్ మాండవీయ సూచించారు. శనివారం బీహార్, ఒడిశా, చత్తీస్ గఢ్, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల హెల్త్ మినిస్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అడిషనల్ సీఎస్​లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్లతో మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు. రోజూ పాజిటివిటీ రేటును మానిటర్ చేయాలని, ఆర్టీ పీసీఆర్ టెస్టులను పెంచాలని చెప్పారు. టీకాలు వేసుకున్న వాళ్లు, వేసుకోని వాళ్లలో కరోనా సోకి, హాస్పిటల్స్​లో చేరుతున్న వాళ్ల సంఖ్య, డెత్స్ వంటి వాటిని కూడా అనలైజ్ చేయాలని తెలిపారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్​మెంట్, వ్యాక్సిన్​లు, రూల్స్ పాటించడం వంటి వాటినే ఫాలో కావాలన్నారు. ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ–2 కింద కేటాయించిన ఫండ్స్ వాడుకుని దవాఖాన్లలో సౌలతులు పెంచుకోవాలని కేంద్ర మంత్రి  మాండవీయ చెప్పారు.