నేను పెంచిన రమేశే నాకు వెన్నుపోటు పొడిచిండు: కడియం

నేను పెంచిన రమేశే నాకు వెన్నుపోటు పొడిచిండు: కడియం

     నా బిడ్డ కులంపై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నడు: కడియం

వరంగల్‍, వెలుగు:  రాజకీయ గురువునైన తనకే ఆరూరి రమేశ్‍ వెన్నుపోటు పొడిచారని స్టేషన్‍ ఘన్‍పూర్‍ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. 1994లో తాను ఇరిగేషన్‍ మంత్రిగా ఉన్నప్పుడు వేరే వాళ్ల వర్క్స్​ టర్మినేట్ చేయించి రమేశ్‍కు ఇప్పించడంవల్లే ఆయన క్లాస్‍ వన్‍ కాంట్రాక్టర్ ​అయ్యారన్నారు. పదేండ్ల పాటు అక్రమ దందాలు, వరంగల్‍ ఓఆర్‍ఆర్‍ అలైన్‍మెంట్‍ చుట్టూ భూకబ్జాలు చేశారన్నారు. అందుకే జనాలు ఓడగొట్టారన్నారు. శుక్రవారం వరంగల్​లోని కాంగ్రెస్‍ భవన్​లో కడియం తన కూతురు కావ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆరూరి లాగా తాను దందాలు చేసి ఆస్తులు కూడబెట్టుకోలేదన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఆరూరి కోసం వర్ధన్నపేటలో ప్రచారం చేశానని, 2023లో ఆయన పిలవకపోవడంతో వెళ్లలేదన్నారు. ఈసారి వరంగల్‍ ఎంపీ టిక్కెట్‍ ఆరూరికే ఇవ్వాలని కేసీఆర్​కు చెప్పానని తెలిపారు. పసునూరి దయాకర్‍కు కూడా తాను అన్యాయం చేయలేదని, తాను డిప్యూటీ సీఎం అయినప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును తానే చెప్పినట్టు వివరించారు.

కావ్య పెండ్లిపై క్లారిటీ

తన బిడ్డ కడియం కావ్య ప్రేమ పెండ్లి చేసుకుంటే తప్పేంటని కడియం ప్రశ్నించారు. ‘కావ్య వరంగల్లో పుట్టింది.. ఇక్కడే పెరిగింది.. ఇక్కడే ఉద్యోగం చేస్తున్నది.. ఇక్కడే తన క్లాస్‍మేట్‍ను పెండ్లి చేసుకుంది.. మతం మారినంత మాత్రాన కులం మారదని సుప్రీం కోర్టు చెప్పింది’ అని ఆయన అన్నారు. కావ్యకు తన కులమే​వర్తిస్తుందని.. ఆమె బిడ్డలకు వారి తండ్రి కులం వర్తిస్తుందని చెప్పారు. ఆమె ఎస్సీ కాదంటూ ఆరూరి రమేశ్‍ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మాదిగలకు ద్రోహం చేస్తున్నదే మంద కృష్ణ మాదిగ అని శ్రీహరి ఆరోపించారు. ఎన్నికల కోసం బీఆర్‍ఎస్‍ నుంచి తాను డబ్బులు తీసుకున్నట్టు కేసీఆర్‍, కేటీఆర్‍, హరీశ్​లలో ఒకరైనా చెప్తే పోటీనుంచి తప్పుకుంటామని సవాల్​ చేశారు.

నేను గుంటూరులో ఉన్నది చూశావా: కావ్య

తాను గుంటూరులో ఉండడం ఆరూరి రమేశ్ ​ఎప్పుడైనా చూశారా? అని వరంగల్ ​కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రశ్నించారు. తాను పుట్టి పెరిగింది, ఉంటున్నది వరంగల్​లోనేనని, తన క్లాస్‍మేట్‍ను స్పెషల్‍ మ్యారేజీ యాక్ట్​ ప్రకారం పెండ్లి చేసుకున్నానని తెలిపారు. రమేశ్‍ కులం, మతాన్ని అడ్డుపెట్టుకొని మాట్లాడడంపై కావ్య ఫైరయ్యారు. మూడు నెలల కిందనే ఓడిపోయాడని, మరోసారి ఓటమి తప్పదని అన్నారు. మీడియా సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి తదితరులు పాల్గొన్నారు.