
సిటీలో 100కు పైగా ఉంటాయని పరిశోధకుల అంచనా
-
రెండేండ్ల కింద ప్రభుత్వం గుర్తించిన మెట్ల బావులు 44 వాటిలో వాడుకలోకి వచ్చింది 18 మాత్రమే
-
రెండు చోట్ల కొనసాగుతున్న అభివృద్ధి పనులు
హైదరాబాద్, వెలుగు: చారిత్రక కట్టడాల్లో భాగమైన మెట్ల బావులు ఎన్నో ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. నాలుగైదు శతాబ్ధాల నాటి మెట్ల బావులు సిటీలో వందకుపైగా ఉన్నాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల కిందట 44 మెట్ల బావులను గుర్తించింది. వీటిలోని18 బావులను బాగుచేసి వాడుకలోకి తీసుకురాగా, ఇంకా చాలా చోట్ల చెత్త, చెదారంతో నిండిపోయి ఉన్నాయి. 26 బావులకు గానూ ప్రస్తుతం రెండు చోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మిగిలిన చోట్ల పిచ్చి మొక్కలు,చెట్లు, భారీగా చెత్తతో నిండిపోయి ఉన్నాయి.ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేసి అన్ని మెట్ల బావులను తిరిగి వాడుకలోకి తీసుకురావాలని హెరిటేజ్ పరిరక్షణ సంస్థలు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. పూర్వవైభవం తీసుకొస్తే పర్యాటక ప్రాంతాలుగా మారుతాయని అంటున్నారు.
దాదాపు 2వేల టన్నుల చెత్త
మెట్ల బావులను తిరిగి వాడుకలోకి తీసుకొచ్చే పనులను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులకు అప్పగించింది. పలు ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థలతో కలిసి అభివృద్ధి పనులను మొదలుపెట్టారు. కాగా అధికారులు గుర్తించిన 44లో బన్సీలాల్ పేటలోని మెట్ల బావి ఒకటి. ఈ బావిలో స్థానికులు ఏండ్లుగా చెత్త పోస్తూ డంపింగ్ యార్డు చేసేశారు. ఇక్కడ పనులు మొదలయ్యాక దాదాపు 2 వేల టన్నుల చెత్తను తొలగించారు. మిగిలినచోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం, ఎన్జీవోలు, సీఎస్‌ఆర్ ఫండ్స్ సాయంతో ఇప్పటి వరకు బన్సీలాల్ పేట, బాపూఘాట్, శివంబాగ్, గచ్చిబౌలి, సీతారాంబాగ్, గుడిమల్కాపూర్ తదితర ప్రాంతాల్లోని 18 పురాతన బావులను బాగుచేశారు. ఒకటి, రెండు చోట్ల పనులు జరుగుతున్నాయి.
వీటికి మోక్షం ఎప్పుడో..
సిటీలోని సీతారాం టెంపుల్ కాంపౌండ్, రాయదుర్గం, లక్ష్మణ్ బాగ్, నానక్‌రాం గూడ, ఇఫ్లూ క్యాంపస్ వెల్, ఫలక్‌నుమా బస్ డిపో, బడే బౌలి, కుతుబ్‌షాహీ కాంప్లెక్స్, హెచ్‌సీఎస్ బౌలి, పిరాన్ బౌలి, మహాలాక్యూ చాంద్‌బాయ్ టూంబ్, గుడిమల్కాపూర్ టెంపుల్, నిజాం కాలేజీ, రాంబాగ్ రోడ్ రామాలయం వద్ద ఉన్న మెట్ల బావులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు కిషన్ బాగ్ కాశిబుగ్గ టెంపుల్, మురళీ మనోహర్ స్వామి టెంపుల్, సరూర్ నగర్ రామాలయం, హయత్ బక్షీ బేగం మెక్యూ, దెక్కన్ కాలేజీ, కార్వాన్ రాజాభగవన్ దాస్ మహల్, కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్, ఎల్బీనగర్, జహనుమా స్వేరోస్ చర్చ్, చిత్ర గుప్త టెంపుల్, శ్రీకాళికాదేవి టెంపుల్, సాలార్ జంగ్ మ్యూజియం, మౌలాలీ మసీదు, దేవీబాగ్, భత్‌జీ బాపూ మహరాజ్, పాయిగా టూంబ్స్, హుస్సేనీ ఆలం, దారుల్ ఉల్, టౌలీ మసీదు, జగదీశ్మందిర్, అనంతగిరి కాల హనుమాన్ టెంపుల్ ప్రాంతాల్లోని మెట్ల బావులు కూడా అభివృద్ధి జాబితాలో ఉన్నాయి. కానీ చాలాచోట్ల ఇంకా పనులు మొదలుకాలేదు. చిత్రగుప్త టెంపుల్ లోని మెట్లబావి చెత్త, పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. నిజాం కాలేజీలోని బావిలో గుర్రపుడెక్క, నాచు పేరుకుపోయి దారుణంగా ఉంది. బావి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్ రామాలయంలోని మెట్లబావి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నీటిలో నాచు పేరుకుపోయి ఉంది.
నిజాం కాలేజీ చుట్టుపక్కల 80 బౌలీలు
సిటీకి చెందిన రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ సంస్థ ప్రస్తుతం మెట్ల బావుల అభివృద్ధి పనులను చూసుకుంటోంది. జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ పర్యవేక్షణలో ఈ పనులను చేపడుతోంది. ఈ సంస్థ కొన్నేండ్లుగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, చెరువుల పరిరక్షణపై పనిచేస్తోంది. ఇందులో భాగంగా నిజాం కాలేజీలో రెయిన్వాటర్హార్వెస్టింగ్ ఎక్కడ చేస్తే బాగుంటుందని చూస్తుండగా బౌలీలు(బావులు) ఉన్నట్లుగా గుర్తించామని సంస్థ ఫౌండర్ కల్పనా రమేశ్ తెలిపారు.ఒక్క నిజాం కాలేజీ చుట్టుపక్కలే 80 బౌలీలు గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత 1921 నాటి హైదరాబాద్ మ్యాప్‌లో తాము 6 వేలకు పైగా బౌలీలు ఉన్నట్లు గుర్తించామని ఆమె చెప్పారు.
తెలియక చెత్త వేస్తున్నరు
ప్రస్తుతం బన్సీలాల్ పేట, బాపూఘాట్ ఏరియాల్లోని మెట్ల బావుల పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఫండ్స్ ఇచ్చింది. జనాలకు తెలియక ఇన్నాళ్లు మెట్లబావుల్లో చెత్త పోస్తూ వచ్చారు. చెత్తను తొలగించడానికే చాలా రోజులు పడుతోంది. పనులు పూర్తయ్యాక స్థానికులను భాగస్వాములు చేస్తున్నాం. మెట్ల బావులను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌కు ఉపయోగించవచ్చు. - కల్పనా రమేశ్, ఫౌండర్, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఎన్జీవో
భూగర్భ జలాలు ఎక్కువ..
పూర్వం మెట్ల బావులను ఎక్కువగా ఉపయోగించేవారు. రోజువారీ అవసరాలకు ఆ నీటినే వాడేవారు. పట్టణీకరణ జరిగాక మెట్ల బావులను అనాగరికంగా చూస్తూ వచ్చారు. ప్రభుత్వాలు, జనం నిర్లక్ష్యం చేయడంతో ఒక్కొక్కటిగా కనుమరుగవుతూ వచ్చాయి. చాలా వాటిని చెత్తతో నింపేశారు. ఎక్కడిక్కడ ఉన్నాయో గుర్తించి వాడుకలోకి తీసుకొస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. బాగుచేసి వదిలేయకుండా మెయింటెనెన్స్ కొనసాగించాలి. పార్క్, కాలనీ అసోసియేషన్లను మెట్ల బావుల మెయింటెనెన్స్‌లో భాగం చేయాలి. - దొంతి నరసింహారెడ్డి, పర్యావరణవేత్త
వారితోనే చేయించాలి
మెట్ల బావుల పనులను అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్‌లు, వర్కర్లతోనే చేయించాలి. ఇష్టమొచ్చినట్టు వ్యవహరించకూడదు. పనుల్లో నాసిరకం మెటీరియల్ ఉపయోగించకూడదు. చరిత్రను, చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సిటీలోని అన్ని మెట్ల బావులను తిరిగి వాడుకలోకి తీసుకురావాలి. ఆ నీటిని రోజువారీ అవసరాలకు వాడుకునే ఏర్పాట్లు చేయాలి. -అనురాధ రెడ్డి, కన్వీనర్,ఇన్టాక్, హైదరాబాద్ చాప్టర్