లెఫ్ట్ సీట్లపై నో క్లారిటీ.. నాన్చుతున్న కాంగ్రెస్

లెఫ్ట్ సీట్లపై నో క్లారిటీ.. నాన్చుతున్న కాంగ్రెస్
  • సీపీఎం, సీపీఐ నేతల అసహనం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్​ పొత్తుపై ఇంకా అయోమయమే కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు ప్రకటించినా.. అందులో సీపీఎం, సీపీఐ పార్టీల సీట్లపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దాదాపు రెండు నెలలుగా పొత్తులపై చర్చలు జరుగుతున్నా, ఇప్పటికీ సీట్లను తేల్చకపోవడంపై ఆ పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారును గద్దె దించాలనే లక్ష్యంతో రెండు లెఫ్ట్ పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమైంది. 

కమ్యూనిస్టులతో పొత్తు ద్వారా ఉమ్మడి ఖమ్మం, నల్గొండతో పాటు పలు జిల్లాల్లో లాభం చేకూరే అవకాశముందని పలు సర్వేల్లో తేలింది. దీంతో లెఫ్ట్ పార్టీలతో పొత్తులపై నిర్ణయం జాతీయ స్థాయిలోనే జరుగుతోంది. అయితే, ఫస్ట్ లిస్టు నాటికి లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లపై స్పష్టత ఇస్తామని చెప్తూ వచ్చిన కాంగ్రెస్ నేతలు తీరా చేతులెత్తేశారు. లెఫ్ట్ పార్టీలకు ఇవ్వాలని భావిస్తున్న సీట్లపై మీడియాకు లీకులు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లను ఇస్తున్నట్టు లీకులు వచ్చాయి. సీపీఎం అడుగుతున్న స్థానాల్లో ఇప్పటికే మిర్యాలగూడకు కాంగ్రెస్ ఓకే చెప్పగా మిగిలిన సీటుపై స్పష్టత రాలేదు.

 భద్రాచలంలో అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో పాలేరు ఇవ్వాల్సిందేననీ సీపీఎం పట్టుపడుతోంది. మరోపక్క కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన వచ్చిందని చెప్తున్న కొత్తగూడెం, చెన్నూరు స్థానాలపై సీపీఐ అసంతృప్తితో ఉంది. చెన్నూరు బదులు మునుగోడు లేదా హుస్నాబాద్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కాగా, పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించనున్నారు. మీటింగ్ త్వరగా పూర్తయితే, సీపీఎం నేతలతో సీపీఐ ముఖ్యనేతలు భేటీ కానున్నట్టు తెలిసింది.