ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే ఆశలు, విదేశీ నిధుల తాజా ప్రవాహం తోడ్పాటుతో పాటు గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ కారణంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. యూఎస్ ఫెడ్ రేట్ల తగ్గింపుపై ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించారు. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 368.97 పాయింట్లు (0.44 శాతం) పెరిగి 84,997.13 వద్ద ముగిసింది.
డే ట్రేడింగ్ సమయంలో ఇది 477.67 పాయింట్లు పెరిగి 85,105.83 గరిష్ట స్థాయిని తాకింది. 50-షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 117.70 పాయింట్లు (0.45 శాతం) లాభపడి 26,053.90 వద్ద స్థిరపడింది. ఈ ట్రేడింగ్‌లో బీఎస్ఈలో మొత్తం 2,482 స్టాక్స్ పెరగగా, 1,668 స్టాక్స్ నష్టపోయాయి. 175 స్టాక్స్ ఎలాంటి మార్పు లేకుండా ఉన్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ గేజ్ 0.68 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.56 శాతం చొప్పున పెరిగాయి.
బీఎస్ఈ సెక్టోరల్ఇండెక్స్లలో పవర్ 2.72 శాతం, యుటిలిటీస్ 2.61 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.55 శాతం, మెటల్ (1.68 శాతం) అత్యధికంగా లాభపడగా, ఆటో రంగం ఒక్కటే నష్టపోయింది. సెన్సెక్స్ సంస్థలలో అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, సన్ ఫార్మా, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి నష్టాలతో ముగిశాయి.
ఆసియా మార్కెట్లకు లాభాలు
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ లాభాలను సాధించాయి. యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు మంగళవారం సానుకూలంగా ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) మంగళవారం రూ. 10,339.80 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.23 శాతం పెరిగి 64.55 డాలర్లకు చేరుకుంది. యూఎస్ ఫెడ్ రేట్ నిర్ణయం, భవిష్యత్తు రేట్ల కోతలపై ఫెడ్ ఇచ్చే వివరణ మార్కెట్ల భవిష్యత్‌కు కీలకమని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
