సీమా హైదర్ చిత్రాన్నిఆపండి.. లేదంటే.. రాజ్ థాక్రే పార్టీ నేత వార్నింగ్

సీమా హైదర్ చిత్రాన్నిఆపండి.. లేదంటే.. రాజ్ థాక్రే పార్టీ నేత వార్నింగ్

రాజ్ థాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) పార్టీకి చెందిన ఒక నాయకుడు.. భారతీయ ప్రేమికుడితో  కలిసి ఉండేందుకు ఇటీవలే సరిహద్దులు దాటి పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమా హైదర్ కు వార్నింగ్ ఇచ్చారు. బాలీవుడ్ లో అరంగేట్రంపై ఆయన మండిపడ్డారు. నోయిడాలోని చిత్ర నిర్మాత అమిత్ జానీ ఈ జంట కథ ఆధారంగా ఒక చిత్రాన్ని తీస్తున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు. ఈ సినిమాకు 'కరాచీ టు నోయిడా'  అనే టైటిల్ ను కూడా ఆయన ఫిక్స్ చేశారు. ప్రస్తుతం సీమా హైదర్ ఈ చిత్రం షూటింగ్‌లోనే ఉన్నారు.
 
ఈ సినిమా నిర్మాణంపై స్పందించిన ఎంఎన్ఎస్ నేత అమేయ ఖోప్కర్.. ఇలాంటి డ్రామాలు ఆపాలి అని సీమాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. లేదంటే చర్యలకు సిద్ధంగా ఉండమని హెచ్చరించారు. ‘‘భారత చలనచిత్ర పరిశ్రమలో పాకిస్థాన్ పౌరులకు స్థానం లేదు. ఈ వైఖరిపై మేము గట్టిగా నిలబడతాం. సీమా హైదర్ అనే పాకిస్థానీ మహిళ ప్రస్తుతం భారత్‌లో ఉంది. ఆమె ఐఎస్ఐ ఏజెంట్ అని కూడా పుకార్లు వచ్చాయి. మన పరిశ్రమలో కీర్తి కోసం, వారు సీమా హైదర్‌ని నటిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దేశద్రోహ నిర్మాతలు సిగ్గుపడకుండా ఎలా ఉంటారు? తక్షణమే దీనికి ముగింపు పలకండి లేదా ఎంఎమ్ఎస్ నుంచి ఎదురయ్యే చర్యకు సిద్ధంగా ఉండండి” అని అమేయ ఖోప్కర్ మరాఠీలో ట్వీట్ చేశారు.

ఇటీవలే 'కరాచీ టు నోయిడా' కోసం సీమా ఆడిషన్‌లో కనిపించిన ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి నిర్మాత.. ఆమె మాజీ భర్త గులాం హైదర్‌ని ఇండియాకు పిలిచారు. "PUBG ఆడుతున్నడు ఈ ప్రేమకథ ఎలా సాగిందో, ఆమె భారతదేశానికి ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాము. ఈ అంశాలను మా చిత్రంలో తెలియజేయాలనుకుంటున్నాము. అందుకే సీమా హైదర్ గురించిన ప్రతి వివరాలను సేకరిస్తున్నాము" అని అమిత్ జానీ చెప్పారు.