అరే బాబు AI వాడటం చీటింగ్ కాదు.. కుర్ర గ్రాడ్యుయేట్లకు డెలాయిట్ సీఈఓ క్రేజీ సలహా

అరే బాబు AI వాడటం చీటింగ్ కాదు.. కుర్ర గ్రాడ్యుయేట్లకు డెలాయిట్ సీఈఓ క్రేజీ సలహా

ఈ రోజుల్లో ఏఐ అనే పదం వింటేనే ఉద్యోగులతో పాటు కొత్తగా జాబ్ మార్కెట్లోకి వస్తున్న చాలా మంది యువతలో కంగారు కనిపిస్తోంది. భవిష్యత్తులో అన్ని పనులూ ఏఐ చేసేస్తే మేము ఎలా బతకాలి అనే భయం చాలా మందిని వెంటాడుతోంది. దీంతో ఏఐ వాడకాన్ని, ఏఐ టూల్స్ ని వాడటానికి చాలా మంది దూరంగా జరుగుతున్నారు. ముఖ్యంగా కాలేజీల నుంచి ఏఐ యుగంలో జాబ్ మార్కెట్లోకి వస్తున్న యువతలో ఈ సాంకేతికతపై ఉన్న అభద్రతాభావం గురించి డెలాయిట్ కంపెనీ సీనియర్ అధికారి క్లారిటీ ఇచ్చారు. అసలు ఆయన ఏఐ గురించి ఏమంటున్నారు, నేటి తరం యువత దాని నుంచి ఏం గ్రహించాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

వేగంగా ఏఐ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో.. కాలేజీలు విద్యార్థులను భవిష్యత్తు పని వాతావరణానికి సరిగ్గా సిద్ధం చేయడంలో విఫలమవుతున్నాయని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ 'డెలాయిట్' ఆసియా-పసిఫిక్ బ్రాంచ్ సీఈఓ రాబ్ హిల్లార్డ్ సంచలన కామెంట్స్ చేశారు. యూనివర్సిటీలు ఏఐ టెక్నాలజీని ఒక విద్యా సాధనంగా కాకుండా.. పరీక్షల్లో కాపీయింగ్, చీటింగ్ చేయడానికి వాడే ఒక తప్పుడు మార్గంగా విద్యార్థులకు బోధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఇప్పుడిప్పుడే డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లోకి వస్తున్న యువత ఏఐ పట్ల ఒక నెగటివ్ భావనతో కెరీర్ స్టార్ట్ చేస్తున్నారని అన్నారు.

మారిన కాలానికి అనుగుణంగా విద్యాసంస్థలు తమ బోధనా విధానాన్ని మార్చాలని, ఏఐని కేవలం ఒక నిషేధిత వస్తువులా చూడటం మానేయాలని హిల్లార్డ్ హితవు పలికారు. భవిష్యత్తులో ఉద్యోగాలు పెంపొందించుకోవాలంటే మనుషులకు, మెషీన్లకు మధ్య ఒక సరైన సమన్వయం అవసరమని.. విద్యార్థులు ఈ టెక్నాలజీని ప్రత్యక్షంగా ఉపయోగిస్తూ నేర్చుకుంటేనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. దాదాపు 42 శాతం కాలేజీలు ఏఐ వాడకాన్ని నిరుత్సాహపరుస్తుండగా, 11 శాతం విద్యాసంస్థలు దీనిపై పూర్తిగా నిషేధం విధించాయని గాలప్ అండ్ లుమినా ఫౌండేషన్ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా శక్తి తగ్గకూడదనే ఉద్దేశంతో విద్యావేత్తలు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ప్రాక్టికల్ లైఫ్‌లో దీనివల్ల నష్టం జరుగుతోందని నిపుణులు అంటున్నారు.

డెలాయిట్, పీడబ్ల్యూసీ వంటి బిగ్-ఫోర్ సంస్థలు తమ రోజువారీ పనులలో జనరేటివ్ ఏఐని వేగంగా భాగం చేస్తున్నాయి. డేటా విశ్లేషణ.. రిపీటెడ్ గా చేయాల్సిన పనులను ఏఐ ద్వారా త్వరగా ముగించడం వల్ల జూనియర్ లెవెల్ ఉద్యోగాలపై దీని ప్రభావం పడుతోంది. అయితే రాబ్ హిల్లార్డ్ తమ సంస్థ వ్యూహాన్ని వివరిస్తూ.. తాము రికార్డు స్థాయిలో గ్రాడ్యుయేట్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని, వారిని భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయడానికి శిక్షణపై భారీగా పెట్టుబడులు పెడుతున్నామని స్పష్టం చేశారు. ఏఐని చీటింగ్‌గా కాకుండా ఒక స్మార్ట్ వర్కింగ్ టూల్‌గా గుర్తించినప్పుడే ఏఐ యుగంలో జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోగలరని చెప్పారు.