నిజాం గుండెల్లో నిదురించిన  యోధులు

నిజాం గుండెల్లో నిదురించిన  యోధులు
  • గెరిల్లా పోరాటాలతో రజాకార్లకు చుక్కలు

అనభేరి ప్రభాకర్​రావు, బద్దం ఎల్లారెడ్డి, అమృత్​లాల్ శుక్లా, చెన్నమనేని రాజేశ్వర్ రావు.. ఇలా ఎందరో వీర యోధులు తమ గెరిల్లా యుద్ధతంత్రాలతో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉరకెత్తించారు. ఊరూరా జనాలను చైతన్యపరుస్తూ, యువకులకు సాయుధ శిక్షణ ఇస్తూ నిజాం మూకలపై ఎక్కడికక్కడ తిరుగుబాట్లు చేశారు. పోలీస్​స్టేషన్లు, ఆర్మీక్యాంపులపై మెరుపుదాడులు చేయడం ద్వారా రజాకార్లకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఈ క్రమంలో పలువురు సమరయోధులు తమ ప్రాణాలు కోల్పోయారు. అలాంటి యోధుల గురించి, వారి వీరోచిత పోరాటాల గురించి తెలంగాణ పల్లెల్లో ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. – వెలుగు నెట్​వర్క్

అలుపెరగని వీరుడు అనభేరి

కరీంనగర్, వెలుగు: తరతరాల బానిసత్వాన్ని, వెట్టి చాకిరిని ఎదిరించిన యోధుడు. రజాకార్ల దౌర్జన్యాలను, నైజాం నిరంకుశత్వాన్ని నిలదీసిన ధీరోదాత్తుడు అనభేరి ప్రభాకర్​రావు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో అనభేరి 1910 ఆగస్టు 15న జన్మించాడు. హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివేప్పుడే స్వాతంత్ర్యోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. కరీంనగర్ బోయవాడలో ఆంధ్రమహాసభ కార్యాలయ కేంద్రం  ఉండగా.. ఆయన జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఆనాడు యువకులతో ఏర్పడిన దళానికి అనభేరి నాయకత్వం వహించారు. ఈ దళం కరీంనగర్ జిల్లాలోని నలభై గ్రామాల్లో తిరిగి పటేల్, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా దాడులు చేసింది. పేద రైతులకు సంబంధించిన అప్పులు, ఇతర పన్నులకు సంబంధించిన రికార్డులన్నీ తగులబెట్టి వారిని విముక్తి చేశారు. ఉద్యమానికి అనభేరి కేంద్ర బిందువు అయ్యాడని భావించిన నిజాం బయటకు వస్తే..తాలుకాదార్ ఉద్యోగం ఇస్తానని ఆశ చూపారు. కానీ లొంగలేదు. నిర్బంధం తీవ్రం కావడంతో కొద్దిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. 

మహ్మదాపూర్ కేంద్రంగా..   
అనభేరి ప్రభాకర్  నాయకత్వంలో  దళం కరీంనగర్ జిల్లాలో జైత్ర యాత్ర చేసింది.  సిరిసిల్ల నుంచి మొదలైన ఈ యాత్ర  కరీంనగర్ వైపు కొనసాగించారు. జమీందార్లు, అధికారులపై దాడులు నిజాం సర్కారుకు మింగుడుపడలేదు. చివరకు ఈ దళం.. హుస్నాబాద్ సమీపంలోని మహ్మదాపూర్ గుట్టలకు చేరుకుని ఆశ్రయం పొందింది. ఈ గుట్టలను కేంద్రంగా చేసుకుని ఉద్యమించే అనభేరి ప్రభాకర్ రావు దళంపై రజాకార్ మూకలు... ఓ రోజు ఉన్నట్టుండి విరుచుకుపడ్డాయి.   మార్చి 14, 1948నాడు దళం సభ్యులు భోజనం చేస్తున్న సమయంలో రజాకార్లు, పోలీసులు మూడు దిక్కుల నుంచి విరుచుకపడ్డారు. కాల్పుల్లో అనభేరి తో సహా తెలంగాణ పోరాట యోధులైన భూపతిరెడ్డి, బలరాంరెడ్డి వంటి 12 మంది యోధులు వీరమరణం పొందారు.  

నిజాంను ధిక్కరించి.. జెండా ఎగరేసి..
మెదక్, వెలుగు:  మెదక్ పట్టణంలోని అరబ్​ గల్లీకి చెందిన బట్టి కిష్టయ్య క్విట్​ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. 80 మందితో ‘బాలభారతి మండలి’ స్థాపించారు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ,  రాత్రి బడి ద్వారా ప్రజలను చైతన్యపరిచేవారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్​ సైనికులు అమ్ముకున్న బాంబులు, 12 బోర్​గన్స్,  బర్మా తుపాకులు కొనుగోలు చేసి వాటిని రజాకార్ల మీద తిరుగుబాటుకు ఉపయోగించారు. ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్​లో గ్రౌండ్ ఇంజినీర్​ గా పనిచేసిన అనుభవంతో మెదక్​ కు చెందిన చోళ లింగయ్య ప్రత్యేక రక్షక దళాన్నిఏర్పాటు చేశారు. డిఫెన్స్ ఆర్మ్ డ్​స్వ్యాడ్​ లో మెంబర్​ గా మిలటరీ శిక్షణ పొందిన కట్లె వెంకటస్వామి తెలంగాణ విమోచనోద్యమ కాలంలో కమ్యూనిస్టులకు కొరియర్ గా సేవలందించారు. నిజాం ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి మరీ 1947 ఆగస్టు 15న బట్టి కిష్టయ్య, చోళ లింగయ్య, కట్లె వెంకటస్వామి తదితరులు చారిత్రక మెదక్ ఖిల్లా మీద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

దళాలను ఏర్పాటు చేసి..
భద్రాచలం, ఆదిలాబాద్, వెలుగు: భద్రాచలం మన్యంలో రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఎదిరించిన ధీరుడు ఆదివాసీ వీరుడు సోయం గంగులు. 26 ఏళ్ల వయస్సులో 1945లో తన గ్రామంలో మిత్రుడు కణితి బుల్లెయ్యతో కలిసి మొదటి దళం ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున గ్రామాలపై పడే రజాకార్ల సైన్యం వ్యూహాలను తిప్పికొట్టి వారిని ముప్పుతిప్పలు పెట్టేవారు. వినాయకపురం చింతలగండి దట్టమైన అటవీప్రాంతంలో కోయవీరులు, రజాకార్లకు మధ్య జరిగిన యుద్ధంలో వందల సంఖ్యలో ఉన్న సైన్యాన్ని వణికించారు. సత్యం అనే సానుభూతిపరుడు వారి చేత చిక్కడంతో గంగులు ఎదురెళ్లి వారితో పోరాటం చేసి విడిపించాడు. దీన్ని అతిపెద్ద కోయసమరంగా చెబుతారు. భారత సైన్యానికి రజాకార్లు, నిజాం సైనికులు లొంగిపోయిన తర్వాత కూడా గంగులు తన ఉద్యమాన్ని కొనసాగించారు. 1951 మే 11న జీలుగు కల్లులో మత్తు మందు కలిపి తాగించి గంగులును పట్టుకున్నారు. తుపాకీతో మూడు రౌండ్లు కాల్చి చంపారు.
  
కస్తాల రాంకిష్టు.. దాజీ శంకర్​ 


ఆదిలాబాద్​కు చెందిన కస్తాల రాంకిష్టు రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు ఉద్యమబాట పట్టారు. నిజాం పోలీసులకు చిక్కడంతో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆదిలాబాద్​కు చెందిన దాజీ శంకర్​ దళాలను ఏర్పాటు చేసి రజాకార్లపై పోరాడారు.  సొంత భూమి 350 ఎకరాలు పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారు. 1947 లో జైలుకు వెళ్లిన ఆయన 1952 లో విడుదలైన తర్వాత
 ఎమ్మెల్యేగా గెలిచారు.

మహిళలతో గెరిల్లా దళం


యాదాద్రి, వెలుగు: యాదాద్రిలో నైజాంను ఎదిరించినవారిలో ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు చెందిన ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, రావి నారాయణరెడ్డి, చింతలపూడి రాంరెడ్డి ప్రముఖులు. ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ఆరుట్ల కమలాదేవి, రాంచంద్రారెడ్డి దంపతులు తమ బిడ్డను పురిట్లోనే వదిలి సాయుధ పోరాటాలు నిర్వహించారు. కమలాదేవి మహిళలకు శిక్షణ ఇచ్చి గెరిల్లా దళం ఏర్పాటు చేశారు. అనారోగ్య కారణాలతో అడవుల నుంచి బయటకు వచ్చిన వీరిని అరెస్ట్​ చేసి చంచల్​గూడ జైలుకు పంపించారు. 1952లో జరిగిన  ఎన్నికల్లో సీపీఐ తరపున ఆలేరు నుంచి మూడుసార్లు కమలాదేవి ఎమ్మెల్యేగా గెలిచారు. 1962లో భువనగరి నుంచి రాంచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. భువనగిరి మండలం బొల్లేపల్లికి చెందిన రావినారాయణరెడ్డి నైజాం పాలకులు, భూస్వాములు, పెత్తందార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు నడిపారు. భూమి లేని నిరుపేదలకు  తన సొంత భూమి వందల ఎకరాలు దానం చేశారు. రాజాపేట మండలం రేణికుంటకు చెందిన చింతలపూడి రాంరెడ్డి 150 మంది రజాకార్లను చంపారు. ఆయనను తట్టుకోవడం చేతకాని రజాకార్లు 1948లో పారిపోతున్నట్టు నటించి దొంగదెబ్బ కొట్టారు.  చెట్టుచాటు నుంచి రాంరెడ్డిపై కాల్పులు జరిపి చంపేశారు.

సిరిసిల్ల కేంద్రంగా పోరాటం


సిరిసిల్ల కలెక్టరేట్​, వెలుగు: 1935లో సిరిసిల్లలో ఆంధ్రమహాసభ నిర్వహించారు. ఆ తర్వాతే సిరిసిల్ల కేంద్రంగా సాయుధ పోరాటం ఉద్యమరూపం దాల్చింది.  దీనికి  బద్దం ఎల్లారెడ్డి, అమృత్​​లాల్ శుక్లా తదితరులు నాయకత్వం వహించారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట కేంద్రంగా గెరిల్లా పోరు నడిచింది. అనభేరి ప్రభాకర్ రావు నాయకత్వంలో 1948 మార్చి 12న ఇల్లంతకుంట పోలీస్ క్యాంప్ పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై సహా ఆరుగురు పోలీసులను చంపేశారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన చెన్నమనేని రాజేశ్వర్​రావు 1948 నుంచి 1951 వరకు భార్య లలితతో కలిసి  అజ్ఞాతనంలో ఉండి సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. సిరిసిల్లకు చెందిన అమృత్ లాల్ శుక్లా సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పై దాడితో వెలుగులోకి వచ్చారు. అమృత్ లాల్ శుక్లాను  నిజాం సైన్యం పట్టుకుని 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శుక్లాను చంచల్ గూడ జైలుకు తరలిస్తుండగా సికింద్రాబాద్ వద్ద పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు.1991 నవంబర్ 14న మరణించారు.

నిజాం పాలిట సింహస్వప్నం
పెద్దపల్లి, వెలుగు:  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెందిన సాయపు రాజు మురళీధర్​రావు అలియాస్​ గట్టెపల్లి మురళి 1943లో కమ్యూనిస్టుల్లో చేరి హైదరాబాద్​ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. మురళిని పోలీసులు బంధించగా, పోలీసు ఆఫీసర్​ సీతాపతిని చంపి పారిపోయాడు. ఓ అతిథి భోజనానికని పిలిచి మురళిని రివార్డు కోసం నిజాం పోలీసులకు పట్టించాడు. చాలాకాలం జైలు జీవితం గడిపారు.