అక్షర ప్రపంచం..జీవం ఉన్న కవితలు

అక్షర ప్రపంచం..జీవం ఉన్న కవితలు

‘జీవద్రవ్యం’లో జీవితానికి సరిపడా విలువలున్నాయి. కవిత్వానికి కావలసిన సొబగులున్నాయి. డా॥ నలిమెల భాస్కర్ కు ప్రతిదీ కవిత్వమే. అతనికి తన ఊరు ఒక మహత్తర ప్రాచీన పద్యకావ్యం. వీధులు పద్యాల పాదాలు. ఇండ్లన్నీ గణాలు. ఇళ్లల్లో జీవశక్తితో ఉన్న మనుషులు అందమైన అక్షరాలు. పిల్ల తెమ్మెరలు అలంకారాలు. కష్టజీవుల ప్రయాసే ప్రాస. ప్రజల సహజీవన సూత్రం యతిమైత్రి. శ్రామికుల కన్నీళ్లే కావ్యవస్తువు. ఇప్పుడా ఊరు ఆధునికత సంతరించుకొని వచన కవిత్వ సంపుటంగా మారుతున్నది.

‘జీవద్రవ్యం’లో భాస్కర్ కవితా సౌందర్యంతో పాటు సృష్టి సౌందర్యం కూడ సాక్షాత్కరిస్తుంది. ఈ భూమి - సృష్టి లిఖించిన సుందర బృహత్ కవిత. నదీనదాలు వక్రోక్తులు. జలపాతాలు అద్భుత పదచిత్రాలు. ఉద్యానవన అందాలు కొత్త పదబంధాలు. అగాధమైన లోయలు లోతైన భావచిత్రాలు. అందమైన దృశ్యాలు అనవద్యశిల్ప వైవిధ్యం. పర్వతాలూ, వృక్షాలూ, అలంకారాలు. హరితమే అచ్చమైన కవితావస్తువు. భూమికి చెవులు ఆనిస్తే కవితలోని అంతర్లయ వినిపిస్తుంది. దేశాన్ని చుట్టివస్తే కరుణరసప్లావిత మహాకావ్యాన్ని చదివిన అనుభూతి. 

ఈ ధరణి సహజసిద్ధమైన పచ్చల బరణి. వర్షాక్షరాలు వరుణుని కరుణరసార్ద్ర వాక్యాలు. కాలపురుషుని కవితావర్ణ పంక్తులు. వానచప్పుడు మానవ జీవన బాధానివారణ మంత్రోచ్చాటనం, శాశ్వత నిర్వాణ సౌధ నిర్మాణ జలమంత్రోద్ఘాటనం, త్రిభువనైక మోహనరాగ సరాగం, గంధర్వులు కంపోజ్ చేసి పంపిస్తున్న రాగపరాగం. మట్టి - అనునిత్యం మనమంతా కండ్లకు అద్దుకోవాల్సిన మహా మహిమాన్విత పదార్థం.

మట్టితల్లి గొప్ప కవయిత్రి. సముద్రం - నేలతల్లి విశాల హృదయం మీద హాయిగా ఆడుకుంటున్న జల శిశువు. నేలరంగస్థలం మీద సముద్రనర్తకి చేస్తున్న అపురూప ఉల్లాసలాస్యం. వసంత ఋతువు అంతా వర్ణమయం! సర్వం నాదమయం ! సకలం నిశ్శబ్దమయం ! సృష్టి సమస్తం సహజసిద్ధమైన విచిత్ర వైవిధ్యం.

రచన ఎలా పుడుతుందో, ఎలా ఉండాలో భాస్కర్ చెప్తాడు. కలతపడితే కవిత, పాటు పడితే పాట, వెతలుంటే కథలు, గాయపడితే గేయం, వేదనలోంచి నవల, శోకం నుంచి శ్లోకం వస్తాయి. ఒక భావస్థితి, ఒక ఆగ్రహోదగ్ర ఉద్వేగస్థితి, ఒక దుఃఖాశ్రువు, ఒక సంతోష పారవశ్యం సారస్వతావిర్భావ సంకేతం. కవితలో పదచిత్రమేదో ముద్దులీనాలి. కథలో ఒకానొక శిల్పం కువకువలాడాలి. నవలల్లో పాత్రలు సందర్భోచితంగా రెక్కవిప్పాలి. సారవంతమైన వాక్యాలు రాయాలి.

వాటికి నగిషీలు చెక్కాలి. భాషా పటిమ గల గట్టి వాక్యాలు పేర్చాలి. అద్భుత వ్యక్తీకరణ ఉండాలి. అలంకారాలు తోడవ్వాలి. పరిమళభరితమైన చిక్కని కవిత్వం వస్తుంది. తనను కదిలించి కరిగించి మరిగిస్తూ, అనుక్షణం మనిషిగా నిలబెడుతున్న గొప్ప కవిత్వ పాదాలకు నమస్కరిస్తాడీ కవి. ‘‘కవిత్వం ఒక సుదీర్ఘ కాల తపస్సు / సాహిత్య సవనంలో కవి నిలువునా కాలిపోవడం కవిత్వం’’.
 

‘‘అస్తవ్యస్త వ్యవస్థాభూజాన్ని నరికి పెరికివేసేది అసమాన పవిత్ర కవిత్వ లవిత్రమే’’నని ఈయన భావన. ‘‘క్షామపీడితమైన మేధోసీమల మీద / కవిత్వ దయాపంక్తులు విహరింపనిద్దాం’’ అంటాడు. జడత్వాన్ని సృజనతో తరిమి ఉత్సాహం అందిస్తాడు. అద్భుత పద్య ఆవిష్కారానికి ఏమేమి కావాలో, మనం ఏమేమి చేయాలో అంటుకట్టుటలో చెప్తాడు. ‘పుస్తకం’ గురించి భాస్కర్ రాసిన రెండు కవితలు, ‘బుక్ ఫెయిర్’ గురించిన మరో కవిత చదివాక మనం పుస్తకం పట్టడం మానం. చదివేదాకా విడువం.

ఈ కవి సామాజికాంశాలను పదునుగా చెప్తాడు. ‘‘చెలరేగితే బడుగులు చిచ్చర పిడుగులౌతారు/ఉన్నవాళ్లు ఉన్నపళంగా ఊడ్చుకుపోవడం నిశ్చయం’’. ప్రజాస్వామ్యాన్ని పాతరేసే పాలకులు పాఠాలు నేర్చుకోకుంటే ‘‘ప్రజలు నిరాయుధులు కారు / పాదరక్షలున్నాయి జాగ్రత్త’’ అని హెచ్చరిస్తడు. తప్పుడు చదువులతో ఇప్పుడు మనందరి తలల్లో డబ్బుల పురుగు మెసులుతున్నది.

స్వార్థం పైకం మైకంలను ఆశ్రయించిన ప్రబుద్ధులను మార్చడానికి, కఠిన హృదయాలలో కరుణను నింపడానికి బుద్ధుణ్ని మళ్ళీ రమ్మంటాడు. బస్తాలు మోసిన, రోడ్లు వేసిన, భవనాలు కట్టిన, ఆనకట్టలై నిలిచిన వలసజీవులకు వందనం చేస్తడు. రైతుల పాదాలకు ‘విశ్వలేఖినుల వినమ్ర సలాములు’ అందజేస్తడు.

ఇతరాంశాలను అవలోకిద్దాం. ఇందులోని ‘స్ఫూర్తి’ కవిత మన జీవితానికి స్ఫూర్తినిస్తది. ‘పానం’ ధ్యానం గొప్పతనాన్ని చాటుతది. ‘ధానార్చన’ దేహమే దేవాలయం అనేదానికి చేసిన సరికొత్త కవితా వ్యాఖ్యానం. ‘అపర పరమేశ్వరుడు’లో శివుడికీ గౌడుకీ అభేదం చెప్పిన తీరు ఆకట్టుకుంటది. ‘అనువాదం’ అందమైన, అద్భుతమైన, ఎవ్వరూ ఊహించని, అందరినీ ఆకర్షించే కవిత. ‘కొత్త భాష’ కొత్తగా ఉంది.

‘స్నానఘట్టం’ ద్వారా స్నానం చేయడాన్నే కాదు, ప్రతిపనినీ ఆస్వాదించడం తెలుసుకుంటం. ‘నీలి వజ్రం’లో నలుపు గొప్పతనం, ‘కన్నుపోటు’లో ఎరుపు విశేషాలు కనిపిస్తాయి. ‘మల్లెల బుట్ట’ చదవగానే మన మెదడులో ఆలోచనలు విచ్చుకుంటయి. ‘జీవద్రవ్యం’ నుంచి సానుకూల దృక్పథాన్ని నేర్చుకుంటం. “ఏ మేకప్పులేని / పల్లెటూరి పిల్ల ముఖ వర్చస్సులా / బతుకు నిసర్గ రమణీయం కావాలి’’ అని కోరుకుంటం.

భాస్కర్ ‘అదృష్టవంతుడు’. తనకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని పరిగెత్తుకొచ్చే అనుంగు కూతురు ఉంది. ఇంట్లోనే కళ్లముందర భారతీయ భాషల పుస్తక భాండాగారముంది. ప్రాణస్నేహితగణం ఉంది. అతనికి మనుమరాలితో ‘కాసేపు ఆడుకుంటే’ ఒక జీవితకాలానికి సరిపడిన ఉల్లాసం. ఒక కవితలో అతని సతీమణితో సంభాషణ పసందుగా ఉంది. ఈ గ్రంథం తన అర్ధాంగికి అంకితమివ్వడం సముచితంగా ఉంది. ‘జీవద్రవ్యం’లో అన్నీ జీవం ఉన్న కవితలే. రసాస్వాదన యోగ్యాలే.

స్వార్థం పైకం మైకంలను ఆశ్రయించిన ప్రబుద్ధులను మార్చడానికి, కఠిన హృదయాలలో కరుణను నింపడానికి బుద్ధున్ని మళ్ళీ రమ్మంటాడు. బస్తాలు మోసిన, రోడ్లు వేసిన, భవనాలు కట్టిన, ఆనకట్టలై నిలిచిన వలసజీవులకు వందనం చేస్తడు. రైతుల పాదాలకు ‘విశ్వలేఖినుల వినమ్ర సలాములు’ అందజేస్తడు.
 ‘నీలి వజ్రం’లో నలుపు గొప్పతనం, ‘కన్నుపోటు’లో ఎరుపు విశేషాలు కనిపిస్తాయి. ‘మల్లెల బుట్ట’ చదవగానే మన మెదడులో ఆలోచనలు విచ్చుకుంటయి.

ఎ. గజేందర్ రెడ్డి