
- గాల్లోకెగిరిన స్ట్రాటోలాంచ్
- ఫుట్ బాల్ గ్రౌండంత పొడవైన వింగ్స్
- మొజావే ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్
- 5 కి.మీ. ఎత్తు లో రెండున్నర గంటలు విహారం
- గాల్లోంచి రాకెట్ల ప్రయోగానికి తొలి రిహార్సల్
ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ‘స్ట్రాటోలాంచ్ ’తొలిసారి గాల్లోకి ఎగిరింది . స్ట్రాటోలాంచ్ సిస్టమ్స్ రూపొందించిన ఈ విమానం కాలిఫోర్నియాలోని మొజావే విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం 6.58 గంటలకు టేకాఫ్ అయింది .మొజావే ఎడారిలో 5 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 302 కి.మీ. వేగంతో రెండున్నర గంటల పాటు విహరించింది . 2.26 లక్షల కేజీల బరువుండే దీని రెక్కలపొడవు 117 మీటర్లు. అంటే ఓ ఫుట్ బాల్ గ్రౌండ్ తోసమానం. ముక్కు నుంచి తోక వరకు 72 మీటర్లు ఉంటుంది . బోయింగ్ 747లా ఆరు ఇంజిన్లు, 2విమాన బాడీలున్నాయి . గరిష్టం గా 10 కిలోమీటర్లఎత్తులో ఎగరగలదు.
పాల్ అలెన్ కల
స్ట్రాటోలాంచ్ సంస్థ స్థాపకుడు పాల్ అలెన్. మైక్రో-సాఫ్ట్ కోఫౌండర్. ఇతనికి స్పేస్ విషయాలపై అమితాసక్తి. అందుకే గతంలో ఓ స్పేస్ ప్లేన్ అభివృద్ధికి నిధులిచ్చాడు. ఆ ప్లేన్ మోడల్ 2004లో అన్సారీ ఎక్స్ ప్రైజ్(రూ.69 కోట్లు) గెలుచుకుంది . మానవ అంతరిక్ష యాత్రకు ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకున్న పాల్ 2011లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని తయారు చేస్తానని ప్రకటించారు.స్ట్రాటోలాంచ్ ను స్థాపించారు . తక్కువ ధరకే విమానసేవలు అందించాలనీ అనుకున్నారు. కానీ గతేడాది అక్టోబర్‌లో ఆయన చనిపోయారు. దీంతో విమానం తయారీపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ ఎట్టకేలకు ఆయన కలల విమానం నింగికెగిరింది .
ఇంతకుముందు స్ప్రూస్ గూస్
ప్రపంచంలోనే అతి పెద్ద విమానమని స్ట్రాటోలాంచ్ ప్రకటించుకున్నప్పటికీ ముక్కు నుంచి తోక వరకు లెక్కిస్తే దీని కన్నా పెద్ద విమానాలున్నాయి .‘ఆంటొనోవ్ ఏఎన్ 225 కార్గో ప్లేన్’ పొడవు 84మీటర్లు, ‘బోయింగ్ 747-8’ పొడవు 76 మీటర్లు.స్ట్రాటో లాంచ్ ముందు వరకు ప్రపంచంలో అతి పెద్దవిమానం స్ప్రూస్ గూస్. దీనికి మరో పేరు ‘హెచ్ 4హెర్క్యులెస్ ఫ్లయింగ్ బోట్ ’. దీన్ని హోవర్డ్ హుఘీస్ సంస్థ రూపొందించింది . పొడవు 97 మీటర్లు.1947లో ఒక్కసారే ఎగిరింది .
రాకెట్లే లక్ష్యంగా..
గాల్లోంచి నేరుగా రాకెట్లను ప్రయోగించి ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలన్నది స్ట్రాటోలాంచ్ విమానం తయారీ వెనుకున్న ఉద్దేశం. ఇది రాకెట్లను భూమి నుంచి అంతరిక్షంలోకి పంపే ప్రయోగం కన్నా సులువైనది. తక్కువ ఖర్చు కూడా. అన్ని పరీక్షలు పూర్తయ్యాక దీని వాడకానికి అనుమతులు తీసుకుంటామని స్ట్రాటోలాంచ్ వెల్లడించింది . అయితే ఈ విమానం టేకాఫ్, ల్యాండింగ్ కు భారీ రన్‌వేకావాలి. ప్రస్తుత ఎయిర్ పోర్టుల రన్‌వేలు దీనికి సరిపోతాయో లేదో చూడాలి. అనుకున్నవన్నీ పూర్తయి తేవచ్చే ఏడాదికి దీని ద్వారా తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలోప్రవేశపెట్టనున్నారు .
ప్రత్యేకతలు
- బరువు 2.26 లక్షల కిలోలు
- రెక్కల పొడవు 117 మీటర్లు
- ముక్కు నుంచి తోక వరకు 72 మీటర్లు
- 6 ఇంజిన్లు, 2 విమాన బాడీలు
- 10 కిలోమీటర్ల వరకు ఎగిరే సత్తా