నస్పూర్ మండలం లో స్త్రీనిధిలో అరకోటి స్వాహా చేసిన ఆర్పీ

నస్పూర్ మండలం లో స్త్రీనిధిలో అరకోటి స్వాహా చేసిన ఆర్పీ

మంచిర్యాల, వెలుగు: నస్పూర్ మండలం సంఘమల్లయ్యపల్లెలో రిసోర్స్​ పర్సన్​గా పనిచేసిన రమేశ్​..   స్ర్తీనిధిలో రూ.50 లక్షలు స్వాహా చేశాడని, ఆ డబ్బులు రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని మహిళా సంఘాల సభ్యులు కోరారు. సోమవారం గ్రీవెన్స్​లో కలెక్టర్ కుమార్​ దీపక్​కు విన్నవించారు. బాధితుల కథనం ప్రకారం.. సంఘమల్లయ్యపల్లెలోని మహిళా సంఘాలకు స్ర్తీనిధి నుంచి గతంలో లోన్లు సాంక్షన్​ చేశారు. 14 గ్రూపుల నుంచి నెలనెలా కిస్తీలు వసూలు చేసిన ఆర్పీ రమేశ్​ ఆ డబ్బులను స్ర్తీనిధిలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నాడు.

మరికొన్ని గ్రూపులకు సంబంధించిన పొదుపు డబ్బులను దుర్వినియోగం చేశాడు. విషయం ఆలస్యంగా బయటపడడంతో అధికారులు విచారణ జరిపి రమేశ్​ను తొలగించారు. తాను వాడుకున్న రూ.50 లక్షలు చెల్లిస్తానని బాండ్​ పేపర్​ రాసిచ్చాడు. ఇప్పటికి రెండేండ్లు గడుస్తున్నా రూ.3 లక్షలు మాత్రమే చెల్లించాడని బాధితులు తెలిపారు. మిగతా డబ్బులు కట్టాలంటూ స్ర్తీనిధి నుంచి తమకు నోటీసులు పంపుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి డబ్బులను రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.