మండుటెండలో సమ్మె చేస్తున్నా మానవత్వం లేదా ?

మండుటెండలో సమ్మె చేస్తున్నా మానవత్వం లేదా ?
  • జేపీఎస్‌‌ల దీక్షకు టెంట్ వేసుకోనివ్వరా..
  • కరీంనగర్​ సీపీపై  బండి సంజయ్​ ఫైర్​  

కరీంనగర్, వెలుగు:  శాంతియుత దీక్షకు అనుమతి అడిగితే  జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కరీంనగర్ సీపీ  బెదిరిస్తున్నారని,  మండుటెండలో సమ్మె చేస్తుంటే కనీసం సీపీకి మానవత్వం లేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. నాలుగురోజులుగా మండుటెండలో కలెక్టరేట్​ముందు దీక్ష చేస్తున్న జేపీఎస్‌‌లకు బండి సంజయ్​గురువారం సంఘీభావం తెలిపి, వారితో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేపీఎస్‌‌లు టెంట్ వేసుకుని దీక్షకు కూర్చోవడానికి పర్మిషన్​ఇవ్వకంపోవడంపై ఆయన ఫైర్​అయ్యారు. ​సమ్మె హక్కును, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎట్లా ఉల్లంఘిస్తారని మండిపడ్డారు. సీపీ ఫక్తు బీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జేపీఎస్‌‌ల సమ్మె పూర్తిగా న్యాయబద్ధమైందని, గ్రామాల అభివృద్ధిలో, కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరి పాత్రే కీలకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జేపీఎస్ లతో చాకిరీ చేయించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ నుంచి రాష్ట్రానికి అనేక అవార్డులు రావడం వెనుక వీరి శ్రమ ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా సీఎం మొండి వైఖరికి పోకుండా జేపీఎస్‌‌లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా..

గన్నేరువరం,వెలుగు:  కరీంనగర్ మానేరు నది పైన బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఇస్తే గన్నేరువరం మండలంలో బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ బండి సంజయ్ తెలిపినట్లు బ్రిడ్జి సాధన కమిటీ అధ్యక్షుడు సంపత్ ఉదయ్ కుమార్ తెలిపారు. గురువారం బీజేపీ నాయకుడు అజయ్ వర్మ తో కలిసి ఎంపీ సంజయ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రవీణ్ కుమార్, మైపాల్ రెడ్డి పాల్గొన్నారు.