గిట్టుబాటు కాదాయె.. పరిహారం రాదాయె ..  రాష్ట్రంలో రైతుల అరిగోస 

గిట్టుబాటు కాదాయె.. పరిహారం రాదాయె ..  రాష్ట్రంలో రైతుల అరిగోస 
  • గిట్టుబాటు కాదాయె.. పరిహారం రాదాయె ..  రాష్ట్రంలో రైతుల అరిగోస 
  • రోజుల తరబడి వడ్లు కాంటా పెడ్తలే.. తాలు, తరుగుతో మిల్లర్ల దోపిడీ 
  • చేసేదేం లేక ప్రైవేట్​గా అగ్గువకే అమ్ముకుంటున్న రైతులు 
  • వర్షాలతో 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం.. 6 లక్షల ఎకరాల్లోనే 
  • అంటున్న సర్కార్.. ఇప్పటి వరకు ఒక్క రైతుకూ పరిహారం ఇయ్యలే 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో రైతులు అరిగోస పడుతున్నారు. అటు వడ్లకు గిట్టుబాటు కాక.. ఇటు అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం రాక తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో వడ్లు తొందరగా కాంటా పెడ్తలేరు. కొన్నిచోట్ల వడ్లు తెచ్చినంక నెల రోజులకు గానీ జోకుతలేరు. చివరకు రైతులు రోజుల తరబడి ఎదురుచూసినంక కాంటా పెడ్తున్నా తాలు, తరుగు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నారు. ఈ బాధలు భరించలేక కొందరు రైతులు వడ్లను కల్లాల్లోనే ప్రైవేట్ వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటున్నారు. ఇక ఈ ఏడాది కురిసిన అకాల వర్షాలకు లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. పైగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, కేవలం 6 లక్షల ఎకరాల్లోనే జరిగిందని సర్కార్ చెబుతోంది.  

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో గత రెండేండ్లుగా యాసంగి సీజన్ లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వడ్ల కొనుగోళ్లను కేంద్రంపై నెట్టి ఓసారి యాసంగిలో వరి వేయొద్దని, మరోసారి ఎంతైనా వరి సాగు చేయండని రైతులను కన్ఫ్యూజ్ చేసింది. ఈసారి యాసంగిలో 57 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అయితే అకాల వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నది.వడ్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే వెంటనే కాంటా పెట్టడం లేదు. తాలు, తరుగు పేరుతో క్వింటాల్ కు ఐదారు కిలోల చొప్పున కోత పెడుతున్నారు. ఈ లెక్కన 20 క్వింటాళ్ల వడ్లు తెచ్చిన రైతు క్వింటాల్ వరకు నష్టపోతున్నాడు. పైగా కొనుగోలు కేంద్రాల్లో అన్నీ రైతులే సమకూర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అకాల వర్షాలతో దిగుబడి తగ్గడం, మిగిలిన వడ్లను సెంటర్ కు తీస్కపోతే కోత పెట్టడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వడ్లు అమ్మితే ఎకరాకు యావరేజ్​గా రూ.40 వేలు వస్తాయనుకుంటే.. రూ.15 వేల నుంచి రూ.20 వేలే వస్తున్నాయని వాపోతున్నారు. కొనుగోలు సెంటర్లలో నెలల తరబడి కష్టపడి వడ్లు అమ్మితే ఏం మిగుల్తలేవని అంటున్నారు. మద్దతు ధర రూ.2,060 ఉన్నప్పటికీ, రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ.1600లకే అమ్ముకుంటున్నారు.    

పంట నష్టం తగ్గించిన్రు..  

ఈసారి అకాల వర్షాలు, వడగండ్ల వానలతో లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. సీఎం కేసీఆర్ మార్చిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మొత్తం 2.50 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని, ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత పంట నష్టాన్ని లక్షన్నర ఎకరాలకే కుదించారు. అనంతరం ఏప్రిల్, ఈ నెలలోనూ వర్షాలు పడ్డాయి. ప్రాథమికంగా 12.50 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని అంచనా వేశారు. అయితే కొన్ని రోజులుగా పంట నష్టాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో రెండో దఫాలో కేవలం 4.50 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లు తేల్చారు. మొత్తంగా రెండు దఫాల్లో 6 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు లెక్క కట్టారు.  ‘‘అసలు ప్రభుత్వం నష్ట పరిహారమే ఇవ్వొద్దు అనుకున్నప్పుడు.. పంట నష్టం లెక్కలు ఎందుకు వేస్తుందో? దాన్ని ఎందుకు తగ్గిస్తుందో అంతుచిక్కడం లేదు. సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్​18 లక్షల టన్నుల వడ్ల సేకరణ తగ్గించుకున్నది. ఈ లెక్కన ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందో ప్రభుత్వానికి తెలియదా?” అని సెక్రటేరియెట్​లోని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

పరిహారం లేనట్టేనా?

వచ్చే నెలలో వానాకాలం సీజన్​కు సంబంధించి రైతుబంధు పంపిణీ చేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం ‘నష్ట పరిహారం ఇవ్వడం ఎందుకు? రైతుబంధు ఇచ్చేద్దాం’ అని అంటున్నట్లుగా తెలిసింది. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం.  రైతుబంధు ఇస్తే రైతులు నష్ట పరిహారం గురించి మర్చిపోతారని సర్కార్​భావిస్తున్నది. అందుకే పరిహారానికి సంబంధించిన నిధులను ఇంతవరకు రిలీజ్​ చేయలేదు. మొదట రూ.150 కోట్లు రిలీజ్ చేసినప్పటికీ, అవి రైతులకు పంపిణీ చేయలేదు.