
- ఎస్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ పర్వత్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కొత్త పీఆర్సీ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) అధ్యక్షుడు వై. పర్వత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందం డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ కాచిగూడలోని సంఘ భవనంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి రెండేండ్లు గడిచినా నివేదిక బహిర్గతం కాకపోవడం సరికాదన్నారు. ఏపీ తరహాలో బదిలీలకు సంబంధించి యాక్ట్ రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
టీచర్ల సమస్యలపై ఎస్టీయూ ఎప్పటికప్పుడు రాజీలేని పోరాటాలు చేస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో టీజీజేఏసీ ఆధ్వర్యంలో జరిగే పాత పెన్షన్ సాధన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ డీఏలను వెంటనే మంజూరు చేయాలని, జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్, సరెండర్ లీవ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. సర్వీస్ రూల్స్ రూపొందించి అర్హులైన టీచర్లకు ఎంఈఓ, డిప్యూటీ ఈవో, డైట్, జూనియర్ లెక్చరర్ గా పదోన్నతులు కల్పించాలని కోరారు.
జీవో 317 ద్వారా స్థానికత కోల్పోయిన టీచర్లను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలన్నారు. సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల నివాళి అర్పించారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య, రాష్ట్ర నేతలు జుట్టు గజేందర్, నర్సింహారెడ్డి, రంగా రావు, కృష్ణా రెడ్డి, పోల్ రెడ్డి, బి. రవీంద్ర, శీతల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.