మొండితనమే మమతకు మైనస్

మొండితనమే మమతకు మైనస్

ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యం.  పెద్ద పెద్ద లీడర్లు ఏసీ రూముల్లో కూర్చుని ఎత్తుగడలు వేయవచ్చు. ఎన్నికల్లో గెలుపుకోసం అనేక రకాల వ్యూహాలు పన్నవచ్చు. కానీ పార్టీ పాలసీని, యాక్షన్‌‌ ప్లాన్‌‌నీ  జనంలోకి తీసుకెళ్లేది కార్యకర్తలే. అందుకే లెఫ్ట్ పార్టీలు ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా కేడర్‌‌ని ఎప్పుడూ దూరం చేసుకోవు.  దీనికి మినహాయింపు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ. జెయింట్‌‌ కిల్లర్‌‌గా రాజకీయాల్లో ప్రవేశించడం, యూత్‌‌ కాంగ్రెస్‌‌ జీన్స్‌‌తోనే కంటిన్యూ కావడం ఆమెకు ప్లస్‌‌ పాయింట్లు. వరుస విజయాలతో నియంతగా మారడం, పట్టువిడుపుల్లేకుండా సీనియర్లతో తగాదాలు తెచ్చుకోవడం మమతకు మైనస్‌‌ పాయింట్లు. నేసనల్‌‌ లెవెల్లో ఏ పార్టీతోనూ దోస్తానా లేదు.  ప్రస్తుతం ఆమె రాజకీయ భవిష్యత్తు చౌరస్తాలో ఉందంటున్నారు  రాజకీయ విశ్లేషకులు.

మమతా బెనర్జీ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ యూత్‌‌ వింగ్‌‌తో ప్రారంభమైంది.  ఎమర్జెన్సీ కాలం (1976)లో పశ్చిమ బెంగాల్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా పనిచేశారు.  ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984 లోక్‌‌సభ ఎన్నికల్లో జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి సీపీఎం దిగ్గజం సోమనాథ్ ఛటర్జీని ఓడించి జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పటికి బెంగాల్లో లెఫ్ట్‌‌ ఫ్రంట్‌‌ ఫుల్‌‌ స్వింగ్‌‌లో ఉంది. దాంతో మమత పేరు ఢిల్లీ వర్గాల్లో మారుమోగింది.  రాజీవ్‌‌ ఆమెను బెంగాల్‌‌ పాలిటిక్స్‌‌లో బాగా ప్రోత్సహించారు. ఆ తర్వాత పీవీ నరసింహా రావు తన కేబినెట్‌‌లోకి తీసుకుని,  హ్యూమన్ రిసోర్సెస్, యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ శాఖలకు సహాయ మంత్రిని చేశారు.

సీనియర్లంటే మమతకు చిన్నచూపు ఉండేదని, కాంగ్రెస్‌‌లో పీవీ సహా అప్పటి సీనియర్లెవరినీ లెక్క చేసేవారు కాదని చెబుతారు. మొత్తం మీద పీవీ తరహా జంటిల్‌‌మేన్‌‌ వ్యవహార శైలితో విభేదించి మంత్రివదవి వదులుకున్నారు. 1997లో ఆ పార్టీ నుంచి మమత బయటికొచ్చారు. 1998 జనవరి 1న తృణమూల్ కాంగ్రెస్ ను  ఏర్పాటు చేశారు. సీపీఎం నాయకత్వాన గల లెఫ్ట్ ఫ్రంట్‌‌కు ప్రత్యామ్నాయంగా తృణమూల్ కాంగ్రెస్ ఎదిగింది. వాజ్‌‌పేయి నాయకత్వంలోని ఎన్డీయేలో చేరి, మొదటిసారి రైల్వే మంత్రి అయ్యారు. తొందరలోనే ఎన్డీయేతో విభేదించి బయటకొచ్చేశారు. 2009లో కాంగ్రెస్‌‌ నాయకత్వంలోని యూపీఏలో చేరి, మన్మోహన్‌‌ ప్రభుత్వంలో రెండోసారి రైల్వే మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2011 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్‌‌యూసీఐ (సీ)తో కలిసి  తృణమూల్ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో తృణమూల్– కాంగ్రెస్ కూటమికి 227 సీట్లు వచ్చాయి.  తృణమూల్ సొంతంగా 184 సీట్లు గెలుచుకుంది. ఎర్రకోట బద్దలైంది. మమతా బెనర్జీ జైత్రయాత్ర మొదలైంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి మమత రెండో టర్మ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఎనిమిదేళ్లలో తృణమూల్ కాంగ్రెస్ అనేక ఎన్నికల్లో పోటీ చేసింది….గెలిచింది కూడా. అయితే తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 42 నియోజకవర్గాల్లో బీజేపీ 18 సీట్లను గెలుచుకుని మమత కు గట్టి సవాల్ విసిరింది. ఎందుకిలా జరిగిందని ఆరాతీస్తే  తృణమూల్ కాంగ్రెస్​ కార్యకర్తలకు, మమతా బెనర్జీకి మధ్య దూరం పెరిగిందన్న విషయం తెర మీదకు వచ్చింది.

తృణమూల్‌‌ ట్రేడ్‌‌ యూనియన్లలో అసంతృప్తి….

పశ్చిమ బెంగాల్లో ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ ఎక్కువ. సహజంగానే ప్రతి ట్రేడ్‌‌ యూనియన్‌‌లోనూ లెఫ్ట్ కార్యకర్తలు ముందంజలో ఉంటారు. తొలి రోజుల్లో లెఫ్ట్ పార్టీలకు పోటీగా మమత కూడా తృణమూల్ కాంగ్రెస్  అనుబంధ కార్మిక సంఘాలు ఏర్పాటు చేశారు. సింగూరు, నందిగ్రామ్‌‌లలో ఇండస్ట్రియల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ప్రాజెక్ట్‌‌లకు వ్యతిరేకంగా పోరాడారు. సింగూరు నుంచి నానో కార్ల ప్రాజెక్ట్‌‌ వెనక్కి పంపేయడంలో మమత పోరాటం ఫలించింది. అయితే, అధికారంలోకి వచ్చాక తమ పార్టీ అనుబంధ కార్మిక సంఘాలను ఆమె పట్టించుకోలేదన్న విమర్శ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలోనైతే అసలు ట్రేడ్ యూనియన్ల వ్యవహారాలకు ఏమాత్రం టైం కేటాయించడం లేదన్న అసంతృప్తి తృణమూల్‌‌ ఫ్రంటల్‌‌ ఆర్గనైజేషన్లలో బాగా పెరిగింది.  ఒక్క కోల్‌‌కతాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని తృణమూల్‌‌ అనుబంధ సంఘాల్లోనూ ఇది బయటపడుతోంది. ప్రభుత్వ వ్యవహారాలకి, పొలిటికల్‌‌ ప్లానింగ్‌‌కి సమయమంతా కేటాయిస్తున్నారన్న అసంతృప్తి తృణమూల్‌‌ ట్రేడ్ యూనియన్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోంది.

జనంలో అధికార్లకే పలుకుబడి…

లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి డిఫరెంట్‌‌గా ఉండేది. ప్రభుత్వం తరఫున సామాన్య ప్రజలకు ఏదైనా లబ్ది జరిగితే ఆ విషయాన్ని పార్టీ కార్యకర్తలు విపరీతంగా ప్రచారం చేసేవారు. మూరుమూల పల్లెలు, పట్టణాల్లోనైతే అక్కడి సీపీఎం శాఖలే ఈ వ్యవహారాలే చూసుకునేవి.  పార్టీ వల్లనే ప్రజలకు ఉపయోగాలు జరుగుతున్నాయన్న బిల్డప్ కేడర్ ఇచ్చేది. జ్యోతిబసు, బుద్ధదేవ్‌‌ భట్టాచార్యల హయాంలో సంక్షేమ కార్యక్రమాలకు, లబ్దిదారులకు మధ్య లెఫ్ట్ ఫ్రంట్‌‌ కార్యకర్తలు వారధిలా ఉండేవారు.  దీంతో ప్రభుత్వం వల్ల ప్రయోజనం పొందినవారికి లెఫ్ట్ పార్టీల పట్ల గౌరవం, కృతజత పెరిగేది. మమతా బెనర్జీ ఈ వ్యవస్థను తుంగలో తొక్కారు. ప్రభుత్వం ద్వారా ఎవరికైనా ఏదైనా మేలు జరిగితే , అధికారులకు ఆ క్రెడిట్‌‌ దక్కుతోంది. ప్రాంతీయ పార్టీల్లో సహజంగా కార్యకర్తలకు ఇచ్చే ప్రయారిటీ ఇక్కడ రావడం లేదు. తృణమూల్ కార్యకర్తల పాత్ర ఏమీ ఉండడం లేదు. దీంతో  ప్రజల దృష్టిలో   మమతా బెనర్జీ ప్రభుత్వమే కనిపిస్తోంది తప్ప, ఆమె స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ కనిపించకుండా పోయింది. మమతకు ఓటేస్తే చాలన్న పరిస్థితి తయారైంది. తృణమూల్ కాంగ్రెస్‌‌కి ఓటేసినా, ఓటేయకపోయినా తేడా ఏమీ రాదని ప్రజలు డిసైడ్ అవుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఇది ఎంతవరకు పోయిందంటే బ్లాక్‌‌, విలేజ్ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ ఆఫీసులకు జనం రావడం మానేశారు. సర్కార్‌‌తో ఏ అవసరం ఉన్నా  బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (బీడీఓ) ఆఫీసుకు వెళ్లడం, అక్కడే వినతి పత్రాలు ఇచ్చే కల్చర్ మొదలైంది.  విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు అధికారుల ఆలోచనలకు ఇచ్చే ప్రాధాన్యతను పార్టీ లీడర్లకు మమత ఇవ్వడం లేదని వారు ఆరోపించారు.

అన్నిటికీ మేనల్లుడి పైనే ఆధారం …

ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా  పార్టీలో మమతకు ఎవరూ నమ్మకస్తులు లేరు. అన్నిటికీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పైనే ఆమె ఆధారపడతారు. తృణమూల్ కాంగ్రెస్‌‌లో అభిషేక్ బెనర్జీ ఓ ప్యారలల్ ఫోర్స్ అంటారు చాలా మంది. అభిషేక్‌‌తో మంచిగా ఉంటే చాలు పార్టీలో ఎదగవచ్చన్న అభిప్రాయం ఏర్పడిందంటారు పొలిటికల్ ఎనలిస్టులు. ఈ సందర్భంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా బ్లాక్ వ్యవహారాలను గుర్తు చేసుకుంటారు. ఫల్తా బ్లాక్ లో జహంగీర్ ఖాన్ అనే లీడర్ కు అభిషేక్ బెనర్జీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో జహంగీర్ ఖాన్ మాటే శాసనంగా మారిందన్నారు. దీంతో చాలా మంది కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారు.

కేడర్ తో లీడర్లకు సంబంధాలు కట్ ….

మమతా బెనర్జీ స్టయిల్‌‌ ఫలితంగా కోల్‌‌కతాలో ఉండే పార్టీ పెద్ద లీడర్లకు… ఎక్కడో దూరాన ఉండే బ్లాక్,  పంచాయితీ స్థాయి కమిటీలకు సంబంధాలు తెగిపోయాయి. పల్లెల్లో ఉండే కార్యకర్తల ఆకాంక్షలు ఏమిటో తెలియకుండా పోయింది. ఫలితంగా రూట్ లెవెల్ కేడర్‌‌కి, స్టేట్‌‌ లీడర్లకు మధ్య గ్యాప్ పెరిగింది. ఈ పరిణామంతో పార్టీ జెండా పట్టుకుని పల్లెపల్లెనా తిరిగే అట్టడుగు స్థాయి కార్యకర్తలు కరువయ్యారు. టీఎంసీలో  ఒక రకమైన శూన్యత ఏర్పడింది. ఇదంతా శద్ధగా గమనిస్తున్న బీజేపీ మొన్నటి జనరల్‌‌ ఎలక్షన్స్‌‌లో ‘ఆపరేషన్‌‌ కేడర్‌‌ ఆకర్ష్‌‌’ చేపట్టింది  ఇతర పార్టీల యాక్టివిటీకి దూరమైన లెఫ్ట్‌‌, తృణమూల్‌‌ కేడర్‌‌ని చాలా నేర్పుగా  బీజేపీ తన వైపు తిప్పుకుంది. ఫలితమే 18 లోక్​సభ సీట్లు