పాకిస్థాన్​​లో కరెంటు వాడకంపై ఆంక్షలు

పాకిస్థాన్​​లో కరెంటు వాడకంపై ఆంక్షలు
  •     రాత్రి 8.30 గంటలకే  మాల్స్, మార్కెట్లు బంద్
  •     కల్యాణ మండపాలు, రెస్టారెంట్లు రాత్రి 10 గంటలకు మూత

ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పాకిస్తాన్.. ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. కరెంటు వాడకంతో ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, మార్కెట్లను రాత్రి 8.30 గంటలకే మూసేయాలని బుధవారం ఆదేశాలిచ్చింది. కేబినెట్ ఆమోదించిన కొత్త ఇంధన సంరక్షణ ప్రణాళికలోని నిర్ణయాలను పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్, విద్యుత్ మంత్రి గుల్తామ్ దస్తగీర్ మీడియాకు వెల్లడించారు. మ్యారేజ్ హాళ్లు​, రెస్టారెంట్లను రాత్రి 10 గంటలకే మూసేయాలని ఆదేశించారు. దీంతో ఏటా రూ.6 వేల కోట్లు ఆదా అవుతాయన్నారు. 

ఉద్యోగులు పగటిపూటే మీటింగ్​లు పెట్టాలి.. 

సమావేశాలను పగటిపూటే పెట్టుకోవాలని ఉద్యోగులకు మంత్రి సూచించారు. పొదుపు నిబంధనలు పాటిస్తే దేశంలో కరెంటు వాడకం సగానికి తగ్గుతుందన్నారు. చమురు దిగుమతులను తగ్గించుకునే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.