సంక్రాంతిలోపు ఉద్యోగాలు భర్తీ చేయకపోతే పోరు తీవ్రం

సంక్రాంతిలోపు ఉద్యోగాలు భర్తీ చేయకపోతే పోరు తీవ్రం
  • సర్కారుకు విద్యార్థి, నిరుద్యోగ సంఘాల డెడ్​లైన్​
  • ఓయూలో భారీ ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు

సికింద్రాబాద్​, వెలుగు: కొత్త ఏడాదిలోనైనా కొలువుల నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు మహా ర్యాలీ చేపట్టాయి. సంక్రాంతి లోపు నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వానికి డెడ్​లైన్​ విధించాయి. గడువులోపు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్ల పోరాటం చేశామో.. అంతకు మించిన స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించాయి. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లవుతున్నా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మండిపడ్డాయి. ర్యాలీ ఓయూ ఆర్ట్స్​ కాలేజీ నుంచి  ఎన్​సీసీ గేటు వరకు చేరుకోగానే.. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఎన్​సీసీ గేటు నుంచి బయటకు వెళ్లేందుకు స్టూడెంట్లు ప్రయత్నించగా ముందుకు వెళ్లనీయలేదు. దీంతో పోలీసులకు, స్టూడెంట్లకు మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  పోలీసుల చర్యను నిరసిస్తూ స్టూడెంట్లు ఎన్​సీసీ గేటు వద్ద రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 2 లక్షల 80 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదని విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఏడేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయట్లేదని, లక్షన్నర  వరకు ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రభుత్వం కాకి లెక్కలు చెప్తున్నదని దుయ్యబట్టారు. టీఎస్​పీఎస్సీ పోర్టల్​లోనే 28 లక్షల  మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ఈ ర్యాలీకి పలు స్టూడెంట్​ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. ఉద్యోగాల భర్తీకి చేపట్టే ఉద్యమానికి మద్దతు తెలపడంతో పాటు భవిష్యత్తు పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పారు.

ప్రభుత్వం మోసం చేస్తున్నది

ఏడేండ్లుగా సర్కారు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. తెలంగాణ  ఉద్యమంలో ముందుండి పోరాడిన స్టూడెంట్లు, నిరుద్యోగులు ఇప్పుడు కూలీలుగా మారారు. ఉద్యోగాల భర్తీ కోసం ఒక వైపు నిరుద్యోగ యువత ఉద్యమాలు చేస్తుంటే మరో వైపు ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కేసీఆర్ ప్రభుత్వం కాకి లెక్కలు చూపెడుతూ మోసం చేస్తున్నది.  

- చనగాని దయాకర్​, విద్యార్థి నిరుద్యోగ సంఘం చైర్మన్

దుర్మార్గమైన పాలన

ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఏండ్ల తరబడి ఎదురు చూసి ఇక భర్తీ చేయరన్న మనస్తాపంతో లాక్ డౌన్ కాలంలో 50 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇంకా ఎంత మంది బలి కావాలి. ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సీఎం కేసీఆర్​  నోటిఫికేషన్లు వేస్తామంటూ వాగ్దానాలు చేయడం తప్ప ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలే. 

- మేడ శ్రీనివాస్​, నిరుద్యోగ జేఏసీ నాయకులు 

త్వరలో కార్యాచరణ ప్రకటిస్తం

2022 లో అయినా కేసీఆర్​కు నిరుద్యోగులు గుర్తు వచ్చి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలి. నోటిఫికేషన్ల కోసం 2022 సంక్రాంతి  డెడ్​లైన్​గా విధించాం. ఆలోపు నోటిఫికేషన్లు రాకపోతే  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్ల పోరాడినమో అంతకంటే ఎక్కువగా పోరాటం చేస్తాం. ఈ పోరాటాలకు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం.

- సతీశ్​ యాదవ్, స్టూడెంట్​ యూనియన్​ లీడర్