బడి గంట కొట్టేదెవరు?

బడి గంట కొట్టేదెవరు?

బడి గంట కొట్టేదెవరు?
స్కూళ్లలో కనిపించని అటెండర్, శానిటేషన్​ సిబ్బంది

పెద్దపల్లి, వెలుగు : కరోనా సమయంలో స్కూళ్లలో అటెండర్, శానిటేషన్​ సిబ్బందిని తొలగించడంతో బడుల ఆవరణలో పారిశుధ్యం లోపించి స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గంట కొట్టేందుకు కూడా ఎవరూ లేకపోవడంతో విద్యార్థులు లేదా టీచర్లు స్కూల్​గంట కొడుతున్నారు. కరోనా తర్వాత స్కూళ్లు రన్​అవుతున్నా పర్మినెంట్​అటెండర్, శానిటేషన్ సిబ్బందిని, స్వీపర్లను, స్కావెంజర్లను నియమించలేదు. కరోనా టైంలో ఊడ్వడం, పాఠశాలల శానిటేషన్​ బాధ్యతను ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు అప్పగించింది. దీంతో స్థానిక పారిశుధ్య కార్మికులు తోచినప్పుడు వచ్చి స్కూళ్లను ఊడ్చి వెళ్తున్నారు. దీంతో స్కూళ్ల అపరిశుభ్రంగా తయారవుతున్నాయి.

అదనపు భారమనే..

రాష్ట్రంలో 26,065 లోకల్ బాడీ స్కూళ్లు, కేజీబీవీ 475, మోడల్ స్కూల్స్ 194,  మైనారిటీ 204, బీసీ వెల్పేర్​ 259, అర్బన్​ రెసిడెన్సియల్ 31, సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు 239 ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతీ స్కూల్ కు ఇద్దరు నుంచి నలుగురు స్వీపర్లు, ఇద్దరు స్కావెంజర్లు ఉండాలి. ఈ లెక్కన వీరి జీతాలు ప్రతీ నెల రూ.కోట్లల్లో ఉంటుంది. కరోనా టైమ్​లో వీరిని తీసేయడంతో సర్కార్​కు ఆర్థికంగా కలిసొచ్చింది. కరోనాకు ముందు తీసేసిన సిబ్బందిని, స్కూల్స్ రీ ఓపెన్​ అయి ఆరు నెలలు గడిచినా తీసుకోవడం లేదు. రీ ఓపన్​లోపే సిబ్బందిని తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయా స్కూళ్ల హెచ్ఎంలు నివేదికలు పంపినా సర్కార్ ​పట్టించుకోలేదు.

ఆందోళనలో తల్లిదండ్రులు..

సర్కార్​బడుల్లో శానిటేషన్ సక్రమంగా లేకపోవడంతో పేరెంట్స్​పిల్లలను పంపడానికి ఇష్టపడడం లేదు. కొన్ని స్కూళ్లలో ఆయా హెచ్ఎంలు పాఠశాల నిధుల నుంచి ప్రైవేటుగా స్కావెంజర్​ను నియమించుకుంటున్నారు. అలాంటి పరిస్థితి లేనిచోట మున్సిపల్, గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బంది వచ్చే వరకు ఆగాల్సిందే. జీపీ, మున్సిపల్ సిబ్బంది మాత్రం వారం పది రోజులకు ఒకసారి పాఠశాల పరిసరాలు, టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. సర్కార్​ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 8 వ తరగతి వరకు ఇంగ్లిశ్​మీడియం ప్రవేశపెట్టడంతో గ్రామీణ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయి.  గతంలో చాలా స్కూళ్లలో బాలికలు శానిటేషన్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదు.

పర్మినెంట్ స్వీపర్లను ఏర్పాటు చేయాలి

కరోనా టైం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో స్వీపర్లు, స్కావెంజర్లను తీసేశారు. ఇపుడు గవర్నమెంట్ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్య పెరిగింది. స్కూల్స్​లో స్వీపర్లు లేక చాలా ఇబ్బంది ఉంది. క్లీన్​చేయడానికి జీపీ సిబ్బంది రెగ్యులర్​గా రావడం లేదు.

- దొమ్మటి రవీందర్, పీఈటీ, మంథని హైస్కూల్