స్నానం చేయాలంటే ట్యాంకర్​ రావాలే.. నీళ్లు లేక వంట చేయడంలో ఆలస్యం

స్నానం చేయాలంటే ట్యాంకర్​ రావాలే.. నీళ్లు లేక వంట చేయడంలో ఆలస్యం
  • స్టూడెంట్స్​కు సమయానికి ఫుడ్ కూడా పెట్టట్లే
  • ముదిగొండ సోషల్ వెల్ఫేర్ స్కూల్/కాలేజీలో పాడైన బోరు
  • నాలుగు రోజులుగా స్టూడెంట్స్​ఇబ్బందులు
  • పిల్లలను ఇండ్లకు తీసుకెళ్తున్న పేరెంట్స్

ఖమ్మం, ఖమ్మం టౌన్, వెలుగు:  ఖమ్మం కార్పొరేషన్​పరిధిలో ఉన్న ముదిగొండ సోషల్ వెల్ఫేర్ స్కూల్/కాలేజీలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పుట్టకోటలోని బొమ్మ ఇంజినీరింగ్ కాలేజ్ బిల్డింగ్ లో నడుస్తున్న ఈ గురుకులంలో నాలుగు రోజుల కింద బోరు మోటారు పాడైంది. అప్పటి నుంచి నీళ్ల కోసం మున్సిపల్ కార్పొరేషన్​ నీటి ట్యాంకర్ పైనే ఆధారపడుతున్నారు. విద్యార్థులు స్నానాలు చేసేందుకు, వంటలు చేసేందుకు కూడా ఆ నీటిని వాడుతున్నారు. దీంతో స్టూడెంట్స్ స్నానాలతోపాటు సమయానికి తిండి లేక అలమటిస్తున్నారు. రెండ్రోజులకోసారి స్నానాలు చేస్తున్నామని, తమను ఇండ్లకు తీసుకెళ్లాలంటూ పేరెంట్స్ కు ఫోన్​చేసి ఏడుస్తున్నారు. తోటి పిల్లలను చూసేందుకు వచ్చిన పేరెంట్స్​ను బతిమిలాడి మిగిలినవారు సొంతిండ్లకు ఫోన్​ చేసుకుంటున్నారు. టీసీలు తీసుకొని వెళ్లిపోదామంటూ కొందరు స్టూడెంట్స్ వాళ్ల తల్లిదండ్రులను కన్నీళ్లతో వేడుకుంటున్నారు. దీంతో కొంతమంది పేరెంట్స్ ఈ ఇబ్బందులపై మీడియాకు సమాచారమిచ్చారు. వర్షాల కారణంగా స్కూల్​/కాలేజీకి గురు, శుక్రవారాల్లో సెలవు రావడం స్టూడెంట్స్​కు కలిసి వచ్చింది. నీళ్ల కొరత కారణంగా టైమ్ కు స్కూల్/కాలేజీకి వెళ్లలేక ఇబ్బంది అవుతోందని స్టూడెంట్స్​చెబుతున్నారు. 

 సమస్యల మధ్య ఉండలేం...

2018 నుంచి ముదిగొండకు చెందిన ఈ గురుకులాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 560 కాగా, ప్రస్తుతం 460 మంది స్టూడెంట్స్ ఉన్నారు. బోరు మోటార్​ పాడవడంతో నీళ్లు లేక స్టూడెంట్స్ స్నానానికి, రెంటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా సమస్య తలెత్తడం ఇది రెండోసారని స్టాఫ్ చెప్తున్నారు. చేసేదేమీ లేక కార్పొరేషన్ ట్యాంకర్ తో ప్రిన్సిపల్ నీళ్లు తెప్పిస్తున్నారు, ట్యాంకర్ వచ్చినప్పుడే స్టూడెంట్స్ బకెట్లతో నీళ్లు మోసుకెళ్తూ స్నానం చేసి, బట్టలు వాష్ చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో అపరిశుభ్రంగా ఉన్న సంపులో నిల్వ ఉన్న నీరు వినియోగిస్తున్నట్లు స్టూడెంట్స్ చెబుతున్నారు. రెసిడెన్షియల్ ఆవరణలోని ఆర్వో వాటర్ ప్లాంట్ రిపేర్ లో ఉండడంతో, తాగునీరు కూడా బయటనుంచి తెప్పించి స్టూడెంట్స్ దప్పిక తీరుస్తున్నారు. కిచెన్ అస్తవ్యస్తంగా ఉందని, డైనింగ్ హాల్ కూడా అపరిశుభ్రంగా తయారైందని, ఇన్ని సమస్యలతో తాము ఇక్కడ చదవలేమని స్టూడెంట్స్​తమ పేరెంట్స్​ను వేడుకుంటున్నారు. 

బిల్డింగ్​ రెన్యూవల్ పై సందిగ్ధత..

ఇటీవల సోషల్ వెల్ఫేర్ ఉన్నతాధికారి ఒకరు ఈ స్కూల్ ను సందర్శించి, ఇక్కడి పరిస్థితులు చూసి వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించినట్టు అక్కడి సిబ్బంది ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ప్రస్తుతం వేరే బిల్డింగ్ ను వెతికే పనిలో ఉన్నామంటున్నారు. ఈ బిల్డింగ్ మేనేజ్​మెంట్ కు ప్రభుత్వం ప్రతి నెల రూ.2.10 లక్షలు అద్దె చెల్లిస్తోంది. బిల్డింగ్ రెన్యూవల్ అగ్రిమెంట్ పూర్తయ్యి మూడేళ్లు అయినట్లు తెలిసింది. బిల్డింగ్ మేనేజ్ మెంట్ ప్రతిస్క్వేర్ ఫీట్ కు రూ.15 చెల్లించాలని డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం రూ.9 చొప్పున చెల్లిస్తోందని అంటున్నారు. సౌలత్ లు కల్పించాలంటే అగ్రిమెంట్ రెన్యూవల్ చేయాలని మేనేజ్ మెంట్ అడుగుతుండగా, వేరే బిల్డింగ్ కు మారేందుకు ఆఫీసర్లు ప్లాన్​చేస్తున్నారు. దీంతో ఇలాంటి పరిస్థితి కూడా స్టూడెంట్స్ ఇబ్బందులు పడడానికి కారణమవుతోంది. పై విషయాలపై ప్రిన్సిపల్ కు ఫోన్​చేయగా, ఆయన స్పందించలేదు. 

ఇన్ని సమస్యల్లో చదువుతరా..?

నాలుగు రోజులుగా వాటర్ సప్లై లేక సమయానికి భోజనం కూడా పెడ్తలేరని ఫోన్​చేసిండు. బిల్డింగ్ కూడా ఉరుస్తోంది. చాలీచాలని రూముల్లో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. ఇన్ని సమస్యల మధ్య వాళ్లకు చదువు వస్తదా. సార్లు వచ్చి మంచి సౌలతులు కల్పించాలె.

–సతీశ్, విద్యార్థి తండ్రి

ఉండనంటే ఇంటికి తీసుకువెళ్తున్నా..

మా అబ్బాయి ఇక్కడ 8వ తరగతి చదువుతున్నడు. నీళ్లు లేక, సరైన తిండి లేక బాబు ఇక్కడ చదివేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. ఫోన్ చేసి ఏడుస్తుంటే, వచ్చి ఇంటికి తీసుకెళ్తున్నా.

–వీరబాబు, ముజ్జుగూడెం