- స్టూడెంట్స్, పేరెంట్స్ పేరు, ఊరు, ఫోన్ నంబర్లతో సహా ప్రైవేట్ కాలేజీలకు సేల్
- అడ్మిషన్ల పేరుతో స్థానిక, ఇతర రాష్ట్రాల కాలేజీలు, ప్రైవేట్
- యూనివర్సిటీల నుంచి ఫోన్లు
- రోజుకు 20 నుంచి 50 కాల్స్..
- వ్యక్తిగత వివరాల లీక్‌పై తల్లిదండ్రుల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే చాలు.. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లు విశ్రాంతి లేకుండా మోగుతున్నాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగియడమే ఆలస్యం.. కార్పొరేట్ స్కూళ్లు, ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల వ్యక్తిగత వివరాలను అంగట్లో సరుకుగా మార్చి, అడ్మిషన్ల దందాకు సహకరిస్తున్నాయి.
లక్షలాది మంది విద్యార్థుల పేర్లు, ఊరు, ఫోన్ నంబర్లను ప్రైవేట్ యూనివర్సిటీలు, కన్సల్టెన్సీల చేతుల్లో పెడుతున్నాయి.తమ పిల్లల వివరాలు బయటకు ఎలా వెళ్లాయో తెలియక, ప్రైవసీ దెబ్బతింటున్నదని పేరెంట్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆదాయ వనరుగా విద్యార్థుల డేటా
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల డేటాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకునేటప్పుడు మేనేజ్మెంట్లు వారి తల్లిదండ్రుల పేర్లు, ఊరు, ఫోన్‌నంబర్, పేరెంట్స్ ఏం పనిచేస్తారు వంటి వివరాలన్నీ తీసుకుంటున్నాయి.
పరీక్షలు పూర్తికాగానే ఆ విద్యార్థుల డేటాను ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు, డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీలకు అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకూ డేటా ఇచ్చేస్తున్నారు. దీంతో పాటు, కార్పొరేట్ హైస్కూళ్లు తమ దగ్గర టెన్త్ పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు చేరవేస్తున్నాయి. ఈ జాబితాలో కొన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు కూడా ఉంటున్నాయి. ఒక్కో విద్యార్థి సమాచారాన్ని బల్క్ రేటులో విక్రయిస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు.
పక్క రాష్ట్రాల నుంచీ వేధింపులు
కేవలం మన రాష్ట్రంలోని కాలేజీలే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేరెంట్స్ కు ఫోన్లలో వేధింపులు ఎక్కువయ్యాయి. ఏపీ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లోని ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల ప్రతినిధులు పేరెంట్స్ ను అడ్మిషన్ల కోసం నిత్యం సతాయిస్తున్నారు.
ఒక్కో పేరెంట్కు రోజుకు కనీసం 20 నుంచి 50 దాకా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లో కన్సల్టెంట్లనూ నియమించుకుంటున్నారు. ‘మీ అబ్బాయి ఇంటర్ పాసయ్యాడు కదా.. మా యూనివర్సిటీలో / కాలేజీలో చేర్పించండి, మా దగ్గర సీటు రిజర్వ్ చేసుకోండి’ అంటూ విరామం లేకుండా ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడే సీట్లు రిజర్వు చేసుకుంటే మీకు ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తామని, మెరిట్ స్కాలర్షిప్ కింద సగం ఫీజు మాఫీ చేస్తామంటూ కాలేజీలు, ప్రైవేటు వర్సిటీల నుంచి పేరెంట్స్ కు ఏజెంట్లు ఎర వేస్తున్నారు. తమ వివరాలు మీకెలా తెలిశాయని వారిని ప్రశ్నిస్తే.. కొందరు సమాధానం చెప్పకుండానే కాల్ కట్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం డైరెక్ట్‌గా కాలేజీల నుంచి తీసుకున్నామని, ఇంకొందరు మీ పిల్లల స్నేహితుల ద్వారా దొరికాయని సమాధానాలు ఇస్తున్నారు. ఈ కాల్స్ తో ఆఫీసు పనుల్లో ఉన్నా, డ్రైవింగ్‌లో ఉన్నా నిరంతరం కాల్స్ వస్తుండడంతో పేరెంట్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ్యక్తిగత వివరాలు ఇలా బహిరంగంగా అమ్ముడవుతుండడంపై సర్కారు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రైవసీ అనేది లేకుండా పోయింది
మా అమ్మాయికి ఇంజినీరింగ్ సీటు కోసం నిత్యం ఫోన్లు వస్తున్నాయి. తను చదివిన కాలేజీ నుంచే డేటా లీక్ అయినట్లు అనుమానంగా ఉంది. మా వ్యక్తిగత వివరాలను కాలేజీలకు అమ్ముకోవడం దారుణం. మాకు నచ్చిన కాలేజీలో మేం జాయిన్ అవుతాం, కానీ ఇలా ఫోన్లతో వేధించడం ఏంటి? స్టూడెంట్స్ డేటా దుర్వినియోగం కాకుండా కఠినమైన చట్టాలు ఉండాలి.
– రమణి, పేరెంట్ (రామంతపూర్)
ఆఫీసులో పని చేసుకోలేకపోతున్న..
మా అబ్బాయి ఈ ఏడాది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. రిజల్ట్స్ రాకముందే కార్పొరేట్ కాలేజీల నుంచి ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. రోజుకు 200 కాల్స్ వస్తున్నాయి. ఆఫీసులో మీటింగ్‌లో ఉన్నా సరే ఆగకుండా ఫోన్ చేస్తున్నారు. మా ఫోన్ నంబర్, మా అబ్బాయి పేరు వాళ్లకు ఎలా తెలిశాయో అర్థం కావడం లేదు. ఫోన్ నంబర్లు బ్లాక్ చేస్తున్నా కొత్త నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి.
– శ్రీనివాస్ రెడ్డి, పేరెంట్ (ఖైరతాబాద్)-
