- నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: విద్యార్థులు సాంకేతిక విద్యపై దృష్టి పెట్టాలని నాగర్కర్నూల్ఎంపీ మల్లు రవి సూచించారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి విద్యార్థులకు డిజిటల్ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. డిజిటల్ తరగతుల ద్వారా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎంపీ నిధులను ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ డెవలప్మెంట్కు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో సౌలతులు కల్పిస్తున్నామని చెప్పారు. డీసీసీబీ అధ్యక్షుడు మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అమరేందర్, ఏఎంసీ చైర్మన్ రమణ రావు పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ బాధితులకు అండగా ఉంటాం..
ఆమనగల్లు: గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు అండగా ఉంటామని ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు. కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో చర్చించారు.
తమకు జరుగుతున్న అన్యాయాన్ని రైతులు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా, మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్ పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల్ మండలాలకు చెందిన మహిళలకు చీరలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని మహిళల పేరిట అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలను మరింత అభివృద్ధి చేసేందుకు పొదుపు సంఘాలను అభివృద్ధి చేస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నిజమైన స్వాతంత్రం లభించిందన్నారు.
