మేళ్లచెరువు మండలంలో హాస్టల్‌‌‌‌ లో నీళ్లు వస్తలేవని స్టూడెంట్ల ధర్నా

మేళ్లచెరువు మండలంలో హాస్టల్‌‌‌‌ లో నీళ్లు వస్తలేవని స్టూడెంట్ల ధర్నా
  • హాస్టల్‌‌‌‌ను విజిట్ చేసిన ఆర్సీఓ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి 

మేళ్లచెరువు, వెలుగు: వారం రోజులుగా హాస్టల్‌‌‌‌లో నీళ్లు రావట్లేదని అయినా  ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని బుధవారం సూడెంట్లు ధర్నా చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్లు గంట పాటు కోదాడ మెయిన్ రోడ్ పై ఆందోళనకు దిగారు. పోలీసులు స్టూడెంట్లకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. అనంతరం స్టూడెంట్లు మాట్లాడుతూ..  స్నానాలకు, బాత్రూంలకు వెళ్లడానికి బోర్ బావుల నుంచి వచ్చే నీళ్లు సరిపోవడం లేదని వారం రోజులుగా ప్రిన్సిపాల్ మురళికి మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని  ఆరోపించారు. 

460 మంది స్టూడెంట్లు ఉన్నామన్నారు. సమస్యలు చెబితే ప్రిన్సిపాల్ ఉంటే ఉండండి పోతే పోండి అని బెదిరిస్తున్నారని వాపోయారు. బాత్రూంలకు డోర్లు, గొళ్లాలు లేవని అన్నారు. నల్గొండ ఆర్సీఓ బలరాం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శంకర్  స్కూల్‌‌‌‌ను సందర్శించి సమస్యలపై స్టూడెంట్లను అడిగి తెలుసుకున్నారు.  రెండ్రోజుల్లో మిషన్ భగీరథ ద్వారా నీళ్లను సప్లై చేస్తామని హామీ ఇచ్చారు.