ఆన్​లైన్ ​సదవులు ఆగమే! 11శాతం మందికే స్మార్ట్​ ఫోన్లు

ఆన్​లైన్ ​సదవులు ఆగమే! 11శాతం మందికే స్మార్ట్​ ఫోన్లు
  • ఆన్​లైన్ ​సదవులు ఆగమే!
  • 11శాతం మందికే స్మార్ట్​ ఫోన్లు
  • కనీసం టీవీ కూడా లేనోళ్లు 2 లక్షల పైనే
  • గతేడాది అఫీషియల్ గా 4లక్షల మంది మంది డిజిటల్ పాఠాలు వినలే
  • ఈసారీ గతేడాది పరిస్థితులే.. 
  • కనీసం పంచాయతీల్లోనూ టీవీలు పెట్టించలేకపోయిన సర్కార్
  • నేటి నుంచి ఆన్ లైన్ క్లాసులు
  • ఊళల్లో బడి బంద్ చేసి కూలిపనులకు పోతున్న పిల్లలు 

హైదరాబాద్/ నెట్ వర్క్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది కూడా అన్​లైన్​చదువులు ఆగమయ్యేలా కనిపిస్తున్నాయి. స్మార్ట్​ఫోన్లు, టీవీలు లేక గతేడాది సర్కారు బళ్లలో చదివే పేద స్టూడెంట్స్​లో సుమారు 4 లక్షల మంది డిజిటల్​పాఠాలకు దూరమయ్యారని అఫీషియల్ ​లెక్కలే చెబుతున్నాయి. ఫీల్డ్​లెవల్​లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుంది. అయినప్పటికీ గతేడాది అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్వలేదు. సుమారు 2 నుంచి 3 లక్షల మందికి స్మార్ట్​ఫోన్లుగానీ, టీవీలుగానీ లేవని చెబుతున్న సర్కారు వాళ్ల కోసం ఎలాంటి ఇతర ఏర్పాట్లు చేయలేదు. ఇండ్లలో టీవీలు లేని వాళ్ల కోసం  కనీసం గ్రామ పంచాయతీల్లోనైనా టీవీలు పెట్టించలేదు. ఫలితంగా గతేడాది చదువులు బంద్​జేసి, పేరెంట్స్​తో కలిసి కూలిపనులకు, పొలం పనులకు పోతున్న వేలమంది పిల్లలు ఈసారి కూడా ఆన్​లైన్​ క్లాసులకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

కనీస వివరాలు సేకరించకుండానే.. 
తెలంగాణలో 40,898 స్కూళ్లుండగా 59,26,253 మంది చదువుతున్నారు. వీరికి గురువారం నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభమవుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో చదివేవారికి ఒకటో తరగతి నుంచి, సర్కారు బడుల్లో చదివే వాళ్లకు మూడో తరగతి నుంచి ఈ క్లాసులు నిర్వహిస్తారు. సర్కారు బడుల్లోని ఫస్ట్, సెకండ్​పిల్లలకు ఆగస్టు 1 నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభిస్తారు. ప్రభుత్వం టీశాట్, దూరదర్శన్ యాదగిరి ఛానల్స్​ద్వారా పాఠాలు చెబుతోంది. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 27,255 సర్కారు స్కూళ్లుండగా, వాటిలో 17,18,678 మంది చదువుతున్నారు. జూన్​ నుంచి వేసవి సెలవులు పొడిగిస్తూ వచ్చిన విద్యాశాఖ, అసలు ఎంతమంది ఇండ్లలో టీవీలు, సెల్​ఫోన్లు, లాప్​టాప్​లు ఉన్నాయనే వివరాలు పూర్తిగా సేకరించలేదు. గతేడాది లెక్కల ప్రకారం మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న 17లక్షలకు పైగా స్టూడెంట్లలో 10.14 లక్షల మంది టీవీల ద్వారా, 1.95 లక్షల మంది లాప్​టాప్​లు, స్మార్ట్ ఫోన్ల ద్వారా, మరో లక్ష మంది వరకూ పక్కింట్లో, జీపీల్లోని టీవీల ద్వారా పాఠాలు విన్నారు. మిగిలిన 4 లక్షల మంది ఎలాంటి క్లాసులు వినక దాదాపు బడి బంద్​చేశారు.

విద్యావలంటీర్లు లేకుండానే..
రాష్ట్రంలో సుమారు12వేలమందికి పైగా విద్యావలంటీర్లతో పాటు, ప్రతి స్కూల్​లో ఉండే స్కావెంజర్లను ప్రభుత్వం రెన్యూవల్ చేయలేదు. దీంతో చాలా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో స్టూడెంట్లను పర్యవేక్షించేవారు లేకుండా పోయారు. దీనికి తోడు శానిటైజేషన్​కు, మాస్కులు, ఇతర అవసరాలకు సర్కారు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఫలితంగా హెడ్మాస్టర్లు, టీచర్లకు తిప్పలు తప్పేలా లేవు. 

‘వెలుగు’ విజిట్​లో విస్తుపోయే నిజాలు
గురువారం నుంచి ఆన్​లైన్​ క్లాసులు ప్రారంభం కానుండడంతో ‘వెలుగు’ టీమ్ పది జిల్లాల్లోని పది గ్రామాలను బుధవారం ​విజిట్​చేసి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించింది. ఏ గ్రామంలో చూసినా 20 నుంచి 25 శాతం స్టూడెంట్ల వద్ద కూడా స్మార్ట్​ఫోన్లు లేవు. వాటిని కూడా పెద్దవాళ్లే వెంట తీసుకెళ్తున్నారు. ఇండ్లలో టీవీ లేని పిల్లల కోసం పంచాయతీ ఆఫీసుల్లో టీవీ సౌకర్యం కల్పించామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా, ఈ పది గ్రామాల్లో ఏ ఒక్క పంచాయతీలోనూ టీవీ లేదు.

  •     భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ములుగుపల్లి జడ్​పీహెచ్​ఎస్​లో 41 మంది, ప్రైమరీ స్కూల్లో 89 మంది చదువుతున్నారు. 130 మందిలో కేవలం 30 మందికి మాత్రమే స్మార్ట్​ఫోన్లు ఉన్నాయి. సగం మందికి పైగా ఇళ్లలో టీవీలు లేవు. 
  •     నిర్మల్​ జిల్లా కుబీర్‍ మండలం గొడాపూర్‍లోని ప్రైమరీ స్కూల్​లో 90 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీరిలో కేవలం 20 మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉండగా,  వీళ్లుగాక మరో15 మంది ఇండ్లలో మాత్రమే టీవీలున్నాయి. 55 మంది పిల్లలకు ఎలాంటి ఫోన్లు, టీవీలు లేవు.
  •     ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కన్గుట్ట ప్రైమరీ స్కూల్​లో 95 మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు. వీరిలో 55 మందికి మాత్రమే  స్మార్ట్​ఫోన్లుగానీ, టీవీలుగానీ ఉన్నాయి. వీరు కూడా స్మార్ట్​ఫోన్లు ఉన్నా సిగ్నల్స్​ లేక, టీవీలున్నా కరెంట్​ లేక సరిగ్గా క్లాసులు వినలేదు. మిగిలిన 40మంది గతేడాది పుస్తకం తెరిచింది లేదు.
  •     సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం పోసానిపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 108 మంది స్టూడెంట్స్​ ఉన్నారు. వీరిలో 58 మంది పిల్లలకు స్మార్ట్ ఫోన్లు లేవు. గ్రామంలో నెట్ రావట్లేదు.  బిల్డింగుల మీదికి ఎక్కితేనే సిగ్నల్స్​ వస్తాయి. 18 మంది ఇండ్లలో టీవీలు లేవు. గత ఏడాది 52 మంది పిల్లలు క్లాసులు వినలేదు. 
  •     మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం నాయకునిపేట గ్రామ పంచాయతీలోని బొగుడగూడెం జడ్పీ హైస్కూల్​లో 107 మంది, చుట్టుపక్కల గూడేల్లోని ప్రైమరీ స్కూళ్లలో మరో 150 మంది వరకు చదువుతున్నారు. వీళ్లలో 120 మందికి సెల్​ఫోన్లు లేవు. గూడేల్లో నెట్​వర్క్​ సమస్య ఉంది. 80 శాతం మందికి టీవీలు ఉన్నా గాలివాన వస్తే కరెంట్​ పోతోంది. 
  •     నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలం మహారాష్ట్ర సరిహద్దులోని ఖండగావ్ అప్పర్​ ప్రైమరీ స్కూలులో 118 మంది స్టూడెంట్లు ఉండగా, గతేడాది 34 మంది టీవీ ద్వారా,  21 మంది స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు విన్నారు. మిగిలినవారు  టీవీలు, ఫోన్లు లేక అసలు పాఠాలే వినలేకపోయారు. 
  •     సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు కాలనీ అప్పర్​ ప్రైమరీ స్కూల్​లో చదువుకుంటున్న 40 మందిలో  20 మంది స్టూడెంట్లకు టీవీలుగానీ, ఆండ్రాయిడ్ ఫోన్లు గానీ లేవు‌‌. దీంతో వీళ్లంతా ఆన్​​లైన్​ క్లాసులు వినలేకపోయారు. జిల్లాలోని 23 మండలాల్లో 475 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్క జీపీలోనూ టీవీ లేదు.
  •     పెద్దపల్లి జిల్లా పెగడపల్లి జిల్లా పరిషత్ హైస్కూలులో 6 నుంచి టెన్త్​ వరకు 162 మంది చదువుతున్నారు. వీరిలో 62 మంది డిజిటల్​ క్లాసులకు దూరంగా ఉంటున్నారు.
  •     మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలోని ప్రైమరీ, సెకండరీ స్కూళ్లలో159 మంది స్టూడెంట్స్​చదువుతున్నారు. ఇందులో  కేవలం -30 మంది స్టూడెంట్లకు మాత్రమే స్మార్ట్ ఫోన్ సౌకర్యం ఉంది. 
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల రెసిడెన్షియల్​ స్కూల్​లో 300 మంది స్టూడెంట్లున్నారు. ఈ స్కూలు పరిధిలోని కొత్త కన్నాయిగూడెం, కన్నాయిగూడెం, చెన్నాపురం, నందిపాడు, మొద్దులమడ గ్రామాల్లో ఫోన్ సిగ్నల్స్​ ఉండవు. దాదాపు 100 మంది స్టూడెంట్లకు ఆండ్రాయిడ్​ ఫోన్లు లేవు. 60 మంది ఇళ్లలో టీవీలు లేవు. దీంతో దాదాపు సగం మంది స్టూడెంట్లు ఆన్​లైన్​క్లాసులకు అటెండ్​ కాలేకపోతున్నారు.

 పొలంలో పనిచేస్తున్న ఈ స్టూడెంట్​పేరు చందు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం జడ్పీహెచ్ఎస్​ స్కూల్ లో​ఆరో తరగతి చదువుతున్నాడు. వీరి ఇంట్లో ఫోన్​గానీ, టీవీగానీ లేక గతేడాది ఆన్​లైన్​ క్లాసులు వినలేదు. ఈసారీ అదే పరిస్థితి. దీంతో చందు తండ్రి రాములు, 
తన వెంట పొలం పనులకు తీసుకెళ్తున్నాడు.

 

 

 ఈ పిల్లలిద్దరూ ఖమ్మం రూరల్​ మండలం వెంకటాయపాలెం స్కూల్​లో 7వ తరగతి చదువుతున్నారు. గతేడాది ఆన్​ క్లాస్​ లు అరకొరగానే విన్నారు. ఒకటే స్మార్ట్ ఫోన్​ ఉండడం, తండ్రి బయటకు వెళ్తే ఆ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో క్లాసులు వినలేకపోయారు. ఇక చేసేదేం లేక మిగిలిన టైమ్​ లో ఇంట్లో ఉన్న గొర్లు, మేకలు కాసేందుకు వెళ్తున్నారు. 

 

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ములుగుపల్లికి చెందిన చిర్ర బానయ్య, లీలావతికి ఇద్దరు పిల్లలు. ప్రైమరీ, జడ్పీహెచ్ఎస్​స్కూళ్లలో అజయ్ నాలుగో తరగతి, హారిక ఏడో తరగతి చదువుతున్నారు. కానీ బానయ్య ఇంట్లో టీవీ గానీ, స్మార్ట్​ఫోన్​గానీ లేదు. పంచాయతీ ఆఫీసులోనూ టీవీ లేకపోవడంతో గతేడాది క్లాసులు వినలేదు. ఈసారి కూడా చదువుకు దూరమవుతారని ఆందోళనలో ఉన్నారు. 

నాతో పాటే పనికి తీస్కపోతన్న 
నా భర్త ఏడేండ్ల క్రితం చనిపోవడంతో కూలి పని చేసుకుంటూ పిల్లలను సాదుకుంటున్న. గతేడాది కరోనాతో మా పిల్లలు స్కూలుకు పోలే. ఆన్​లైన్​ క్లాసులకు ఫోన్​ కావాలని అడిగిన్రు. 10 వేలు పెట్టి ఫోన్ కొనే స్థోమత మాకు లేదు. అందుకే బడి బంద్​జేసి నాతో పాటు పనికి తీస్కపోతన్న.  
- భూక్య సునీత, బాణాపురం తండా, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా

జీపీలో టీవీ లేదు
మా ఇంట్లో టీవీ, స్మార్ట్​ఫోన్ లేదు. జీపీలో కూడా టీవీ లేక ఆన్ లైన్ క్లాసులు వినలేక పోతున్న. మా ఊళ్లో సెల్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. ఫ్రెండ్స్​ఇండ్లకు వెళ్లి పాఠాలు వినాలని సార్లు చెప్తున్నరు. ప్రతిసారి వేరే వాళ్ల ఇండ్లకు వెళ్లాలంటే ఇబ్బంది అవుతోంది. 
- రుద్రపంగు ఐశ్వర్య, 6వ తరగతి, పులిచింతల ప్రాజెక్టు కాలనీ

ఫోన్​ కొనుడు నాతోటి ఏమైతది
నా బిడ్డ, అల్లుడు చాలా ఏండ్ల కిందే చనిపోయిన్రు. వాళ్ల ఇద్దరు బిడ్డలు, కొడుకును నేను కూలిపని చేసుకుంటూ సాదుతన్న. నా పెద్ద మనవరాలు ఇంటర్, మనవడు తొమ్మిది, మనవరాలు 5 చదువుతున్నరు. కరోనా వల్ల ఫోన్లనే క్లాసులు చెప్తున్నరట. నేను కూలి పనిజేస్తే బట్టపొట్టకే సాల్తలెవ్వు. ఇగ ఫోన్ కొనుడు నాతోని ఎట్లయితది. అందుకే బడి మానేసిన్రు. 
- తోట కుసుమ, ఖండగావ్, డిచ్ పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా