
న్యూఢిల్లీ, వెలుగు: మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే సామాజిక న్యాయం లభిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. లేకపోతే సమాజంలో మార్పును తీసుకురాలేమన్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే ఆ బిల్లుకు సార్ధకత ఉండదన్నారు. రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్యా, ఉద్యోగాలలోనూ 50 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్ల పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో ఎంపీలు బీద మస్తాన్ రావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం, దేశంలో 56 శాతం ఉన్న బీసీల బతుకులు మార్చే బీసీ బిల్లును ప్రవేశపెట్టదా? అని ప్రశ్నించారు. బీసీల డిమాండ్లను కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దేశంలో బీసీలను బిచ్చగాళ్లను చేశారని, వారికి రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు, బర్రెలు, పందులు, పెన్షన్లు ఇచ్చి శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు విమర్శించారు.
మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం రెండు సిఫార్సులు మాత్రమే కేంద్రం అమలు చేసిందని బీఆర్‌ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ప్రపంచదేశాల నుండి తెచ్చే అప్పులకు బీసీలను బాధ్యలను చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ దేశ సంపదలో, అధికారంలో వాటా ఇవ్వదా? ఇదేమి ఆటవిక న్యాయం? అని లింగయ్య యాదవ్ ఫైర్ అయ్యారు.