బిగ్బాస్ హౌస్ నుంచి సుదీప ఎలిమినేషన్

బిగ్బాస్ హౌస్ నుంచి సుదీప ఎలిమినేషన్

ఆదివారం వచ్చిందంటే ప్రేక్షకులకి ఆనందం, కంటెస్టెంట్లకి అయోమయం. ఎవరు ఉంటారో ఎవరు వెళ్లిపోతారోనని వాళ్లకి ఒకటే భయం. నిన్న శ్రీసత్య ఒక్కతే సేవ్ అయ్యింది. మిగతావాళ్లంతా గుండె చిక్కబట్టుకుని వెయిట్ చేస్తున్నారు. మరి వీరిలో సేవ్ అయ్యిందెవరు? బైటికి వెళ్లిందెవరు?

శ్రీసత్య వెంట.. లక్ ఉంటుందంట!

సన్‌డే ఫన్‌డే అంటూ ప్రతి ఆదివారం హౌస్‌మేట్స్ రకరకాల ఆటలాడిస్తుంటారు నాగార్జున. వీటిలో కచ్చితంగా ఒకటి పాటలకు సంబంధించినదై ఉంటుంది. ఈవారం కూడా అలాంటిదే ప్లాన్ చేశారు. స్క్రీన్‌ మీద కొన్ని బొమ్మలు చూపిస్తారు. వాటి ఆధారంగా అది ఏ పాటో కనిపెట్టాలి. ముందుగా కంటెస్టెంట్లని రెండు టీమ్స్ గా  విభజించారు. శ్రీసత్య ఏ టీమ్‌లో ఉంది అని అడిగారు నాగ్. టీమ్ బిలో ఉంది అని చెప్పగానే ఈసారి కూడా తన టీమే గెలుస్తుందేమో చూద్దాం అన్నారు. ఆ తర్వాత రకరకాల పాటల క్లూస్ ఇచ్చారు. రెండు టీమ్స్ వాటిని గెస్ చేయడంలో పోటీపడ్డాయి. లక్ ఎప్పుడూ శ్రీసత్య వెంటే ఉంటుందన్న నాగ్ నమ్మకమే నిజమైంది. టీమ్ బి గెలిచింది. దాంతో ఈసారి కూడా శ్రీసత్య టీమే గెలిచింది అని ప్రకటించారు నాగ్. ఆ టీమ్‌కి వీకెండ్ కానుకను కూడా ఇచ్చారు.  

మాటలతో ఆట

ఆ తర్వాత మరో గేమ్ కూడా పెట్టారు నాగ్. బోర్డ్స్ మీద కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అవి ఎదుటివారిని చాలెంజ్ చేసేలా ఉన్నాయి. మీరు ఆ డైలాగ్ ఎవరికి చెప్పాలనుకుంటున్నారో వారి మెడలో వేయండి అని చెప్పారు. గీతూ అవసరాల కోసం దారులు తొక్కుతుందంటూ సాయికుమార్ డైలాగ్ ఉన్న బోర్డును ఆమె మెడలో వేశాడు బాలాదిత్య. దానికీ నాకూ సంబంధం ఏమిటో అర్థమే కాలేదు అంటూ ఎప్పటిలానే ఏదో చెప్పబోయింది గీతూ. నీకు అర్థం కాకపోయినా మాకు అయ్యిందిలే అంటూ కౌంటర్ ఇచ్చారు నాగ్. సొల్లు ఆపు, దమ్ముంటే నన్ను ఆపు అనే డైలాగ్‌ని ఇనయా సూర్యకి ఇస్తే.. ఒకవైపే చూడు ఇంకోవైపు చూడకు అనే డైలాగ్‌ని సూర్య ఆమెకి ఇచ్చాడు. నా సావు నేను సస్తా నీకెందుకు అనే డైలాగ్‌ని గీతూ రాజ్‌కి ఇచ్చింది. జోకర్‌‌తో కామెడీ చేస్తే చేస్తా నీకెందుకు అంటూ లాజిక్ తీసింది. దాంతో అతను అన్నదాంట్లో తప్పేమీ లేదు, నువ్వు చేసిందే తప్పు తేల్చేశారు నాగ్. ఇదే డైలాగ్‌ని ఆదిరెడ్డికి కీర్తి ఇచ్చింది. నేను ఎక్కువ ఆలోచిస్తే తనకెందుకు అని కౌంటరేసింది. ఇలా అందరూ మాటల ద్వారా తమ తమ మనసులోని విషయాల్ని బైటపెట్టారు హౌస్‌మేట్స్. 

గీతూ వంకర.. ఫైమా తొందర

ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ వచ్చి చివరికి బాలాదిత్య, సుదీప మిగిలిపోయారు. చివరికి బాల ఎలిమినేషన్‌ నుంచి బైటపడ్డాడు. సుదీపని బిగ్‌బాస్ బైటికి పంపాడు. స్టేజ్ మీదికి వచ్చిన సుదీపకి ఓ టాస్క్ పెట్టారు నాగ్. అక్కడ కొన్ని కూరగాయలు ఉంచారు. ఒక్కోదానికీ ఒక్కో లక్షణం పెట్టారు. దాన్నిబట్టి ఏది ఎవరికి సూటవుతుందో చెప్పమన్నారు. ముందుగా గీతూ గురించి చెప్పమన్నారు. సుదీప కన్‌ఫ్యూజ్ అవుతుంటే వంకర టింకర ఇస్తావా అంటూ హింట్ ఇచ్చారు. దాంతో ఆమె అదే కరెక్ట్ అంటూ గీతూని అల్లంతో పోల్చింది. బద్దకస్తురాలు కనుక జిడ్డు అనేది కూడా ఆమెకే ఇచ్చింది. రేవంత్‌ని మిరపకాయ అంది. పైకి హార్డ్  లోపల సాఫ్ట్ గా ఉంటాడంటూ ఆదిరెడ్డిని కొబ్బరికాయతో పోల్చింది. ఇంట్లో ఇనయా లీస్ట్ లైక్డ్ పర్సన్ అని, కానీ నిజానికి ఆమె మనసు మంచిదని చెప్పింది. శ్రీహాన్‌లో చాలా లేయర్స్ ఉన్నాయని, అవి అవసరానికి తగ్గట్టుగా బైటికి వస్తాయని, ఎక్కడెలా ఉండాలో తనకి బాగా తెలుసని పొగిడేసింది. ఇంతలో ఫైమా కల్పించుకుని నాకూ ఏదో ఒకటి ఇవ్వక్కా అని అడిగింది. దాంతో ఇమ్మెచ్యూరిటీ ఇచ్చింది సుదీప. నీ వయసు ఇంకా చిన్నది కాబట్టి నీకు అర్థం చేసుకోవడం చేతకావట్లేదు, మెల్లగా అన్నీ నేర్చుకుంటావ్, ఏదైనా జరిగినప్పుడు వెంటనే రియాక్టయిపోకుండా ఆలోచించి మాట్లాడు అని చెప్పింది. అసలు ఫైమా అడిగి ఉండకపోతే ఆమెకి ఇచ్చేదో కాదో. కానీ తొందరపడి అడిగి మరీ అక్షింతలు వేయించుకుంది ఫైమా. 

నాగ్ పైఎత్తు.. గీతక్క చిత్తు చిత్తు

ఇవాళ్టి ఎపిసోడ్‌లో మిగతాదంతా ఒకెత్తు. గీతూతో నాగ్ ఆడుకున్న తీరు ఒకెత్తు. ఎప్పుడూ కబుర్లతో కాలక్షేపం చేస్తుందే తప్ప దమ్మిడీ పని చేయదు గీతూ. ఒకవేళ చేయాల్సి వచ్చినా ఏమాత్రం ఒళ్లు కదలని పనే ఎంచుకుంటుంది. అందుకు తగిన శాస్తి చేశారు నాగ్. ఇవాళ ప్రతి పనినీ ఆమెకే చెప్పారు. అది తీసుకురా, ఇది పెట్టెయ్ అంటూ పదే పదే స్టోర్‌‌ రూమ్‌కి పంపించారు. ఎందుకు సార్ నాతో ఆడుకుంటున్నారు అని కాసేపయ్యాక అడిగేసింది గీతూ. ఓ సమయంలో అలసిపోయి ముఖం నీరసంగా కూడా పెట్టేసింది. అయినా కూడా నాగ్ తగ్గలేదు. ఎపిసోడ్ ముగిసేవరకు ఆమెని ఓ ఆటాడుకున్నారు. దాంతో రేవంత్ యమా ఖుషీ అయిపోయాడు. భలే చేయిస్తున్నారు సార్, వియ్ లవ్యూ సార్ అని చెబుతూ నవ్వుతూనే ఉన్నాడు. దాంతో ఇక నుంచి స్టోర్‌‌ రూమ్ పనులన్నీ గీతూకే చెబుదాం అంటూ మరింత ఉడికించారు నాగ్. చాలా విషయాల్లో గీతూ తప్పుల్ని ఎత్తి కూడా చూపించారు. మిగతా హౌస్‌మేట్స్ అందరి మీద నోరేసుకుని పడిపోతుంది గీతూ. ఎవరినీ తమ పాయింట్ చెప్పనివ్వదు. దాని గురించి కూడా ఆయన సెటైర్ వేశారు. ఇవాళ ఆమె ఎవరితో వాదించబోయినా మధ్యలో కల్పించుకుని, అవతలివారి పాయింట్‌ చెప్పనిచ్చి సమన్యాయం చేశారు. చివరికి సుదీప వెళ్లిపోయేటప్పుడు నిన్ను తిట్టుకున్నందుకు సారీ అక్కా, నువ్వు చాలా మంచిదానివి అని గీతూ చెబితే.. నీకు ఎమోషన్లు, రిలేషన్లు ఏంటి అని సెటైర్ వేశారు నాగ్. మొత్తానికి నవ్వుతూనే ఆమెకి చాలా మొట్టికాయలు వేశారివాళ.

ఇక రేపటి నుంచి మళ్లీ యుద్ధం మొదలు. అసలే సోమవారం నామినేషన్లు ఉంటాయి. కాబట్టి ఇల్లంతా వార్ ఫీల్డ్లా మారిపోతుంది. వాళ్లు ఏ రేంజ్‌లో కొట్టుకోబోతున్నారో ఆల్రెడీ ప్రోమో ద్వారా హింట్ ఇచ్చారు. మిగతాదంతా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపిస్తారు. ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారో, ఎవరు ఏమేం రీజన్స్ చెబుతారో చూడాల్సిందే.