
అలంపూర్, వెలుగు: భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల కోసం పోరు బాట పట్టిన మహోన్నత నేత సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కొనియాడారు. గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడులో సోమవారం నిర్వహించిన సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఆయనతో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హాజరయ్యారు.
ముందుగా సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన వ్యక్తి పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ విలువల పట్ల నిక్కచ్చిగా వ్యవహరించేవాడని, కామ్రేడ్ లను కాపాడుకోవడంలో ముందు వరుసలో ఉండేవాడని కొనియాడారు.
సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తెలిపారు. భవిష్యత్ తరాల రాజకీయ నేతలకు ఆయన జీవితం ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని 5 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ కాపీలను సుధాకర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి చేతుల మీదుగా లబ్ధిదారులకు సంపత్ కుమార్ అందజేశారు.
తెలంగాణ ఉద్యమంలో సుధాకర్ రెడ్డి సేవలు మరువలేని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ జీవితంలో సుధాకర్ రెడ్డి ఎలాంటి మచ్చలేని నేత అని ఎంపీ డీకే అరుణ కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, బాల నరసింహ, గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, నాగర్ దొడ్డి వెంకట రాముడు, సీపీఎం నేతలు పాల్గొన్నారు.